సాక్షి, న్యూఢిల్లీ: మలేషియా ప్రభుత్వం భారత పౌరులకు భారీ షాక్ ఇచ్చింది. భారతీయులకు వీసా రహిత ప్రవేశాన్ని రద్దు చేసింది. వచ్చే ఏడాది (2027) జనవరి 1 నుండి భారతీయ పౌరులకు మలేషియా వీసా రహిత ప్రవేశాన్ని (visa-free entry) నిలిపివేయనుంది. ప్రభుత్వం ఏవైనా మార్పులు ప్రకటిస్తే తప్ప, ఆ దేశానికి ప్రయాణించే భారతీయ పాస్‌పోర్ట్ హోల్డర్లందరూ అక్కడికి చేరుకోవడానికి ముందే చెల్లుబాటు అయ్యే వీసాను తప్పనిసరిగా పొందవలసి ఉంటుంది. ఇప్పటివరకు మలేషియా వెళ్లా భారతీయ పౌరులకు వీసా అవసరంలేదు. దీని ద్వారా సందర్శకులు వ్యాపారం, పర్యాటకం, సామాజిక లేదా ట్రాన్సిట్ ప్రయాణాల కోసం 30 రోజుల వరకు వీసా లేకుండా ప్రవేశించే అవకాశం ఉండేది.
నవంబర్ 17న విడుదల చేసిన ఒక నోటీసులో మలేషియా ఇమ్మిగ్రేషన్ విభాగం (JIM), 2027 జనవరి 1 నుండి భారతీయ పౌరులకు వీసా మినహాయింపు సౌకర్యాలు ఇకపై ఉండవు అని పేర్కొంది. దేశంలోకి ప్రవేశించే భారతీయ పౌరులు తమ ప్రయాణానికి ముందే చెల్లుబాటు అయ్యే వీసాను పొందాలని కోరింది. 2026 డిసెంబర్ 1 నుండి 'MyVISA' పోర్టల్‌లో వీసా దరఖాస్తులను సమర్పించవచ్చని ఆ విభాగం సూచించింది. వీసా మినహాయింపు లేని విదేశీ పౌరులు మలేషియాలోకి ప్రవేశించడానికి కనీసం ఆరు నెలల చెల్లుబాటు ఉన్న పాస్‌పోర్ట్ , అక్కడ ఉండే కాలానికి సరిపడా ఆర్థిక స్తోమత ఉన్నట్లు రుజువులను కలిగి ఉండాలి. 30 రోజుల వీసా రహిత ప్రవేశ సౌకర్యాన్ని మలేషియాలో ఉద్యోగాల వేట కోసం ఉపయోగించవద్దని కౌలాలంపూర్‌లోని భారత హైకమిషన్ భారతీయ పౌరులను హెచ్చరిస్తూ అడ్వైజరీ జారీ చేసిన రెండు నెలల తర్వాత ఈ నిర్ణయం వెలువడింది.

ఇదీ చదవండి: బుడ్డోడి ఫోజులకు ఫిదా : సర్‌ప్రైజ్ ఆఫర్
మలేషియా కొత్త వీసా నిబంధనలు
సందర్శకులు తమ పూర్తి పర్యటన కాలానికి ట్రావెల్ మెడికల్ ఇన్సూరెన్స్ (ప్రయాణ వైద్య బీమా) తీసుకోవాలి. ప్రవాసేతరులు (Non-residents) వైద్య చికిత్స ,సంబంధిత ఆరోగ్య సేవల కోసం అయ్యే ఖర్చులన్నింటినీ తామే భరించాల్సి ఉంటుంది. వీసా దరఖాస్తులకు సపోర్టింగ్ డాక్యుమెంట్‌గా, ట్రావెల్ మెడికల్ ఇన్సూరెన్స్ మరియు అత్యవసర సహాయ సేవలను అందించే ఇన్‌బౌండ్ ట్రావెల్ ప్లాట్‌ఫారమ్ 'MyTripPass' నుండి పొందిన బీమా ధృవీకరణ పత్రాన్ని (Certificate of Insurance) ఉపయోగించాలని ఆ విభాగం ప్రయాణికులను కోరింది.
కొత్త విధానంలో భాగంగా, ఏడు పని దినాలకు పైగా “కొత్త దరఖాస్తు” (New Application) లేదా “చెల్లింపు పెండింగ్” (Pending Payment) స్థితిలో ఉన్న ఏ వీసా దరఖాస్తు అయినా ఆటోమేటిక్‌గా రద్దు (expire) అవుతుంది. ఈ విధానం ఈ ఏడాది అక్టోబర్ 1 నుండి అమల్లోకి వచ్చింది. 2026 సెప్టెంబర్ 1కి ముందున్న దరఖాస్తులతో సహా అన్నింటికీ ఇది వర్తిస్తుంది.
ఒకవేళ దరఖాస్తు గడువు ముగిస్తే, సందర్శకులు అప్‌డేట్ చేసిన వీసా ఫారమ్‌ను ఉపయోగించి కొత్త దరఖాస్తును సమర్పించాలి. దరఖాస్తు ఫలితం, విధానంలో మార్పు లేదా ప్రయాణ ప్రణాళికలలో ఏవైనా మార్పులతో సంబంధం లేకుండా వీసా రుసుము తిరిగి చెల్లించబడదు (non-refundable).


