మహిళల హాకీ చాంపియన్స్ ట్రోఫీ బరిలో భారత జట్టు
నేడు మలేసియాతో టీమిండియా తొలి పోరు
సాయంత్రం గం. 4:45 నుంచి స్టార్ స్పోర్ట్స్–2, జియో హాట్‌స్టార్‌లో ప్రత్యక్ష ప్రసారం
భోపాల్: ఆసియా క్రీడల్లో స్వర్ణ పతకం సాధించి లాస్ ఏంజెలిస్ ఒలింపిక్స్‌కు అర్హత సాధించిన భారత మహిళల హాకీ జట్టు స్వదేశంలో మెగా టోర్నీకి సిద్ధమైంది. నేటి నుంచి ఆరు దేశాల మధ్య జరిగే ఆసియా చాంపియన్స్ ట్రోఫీ హాకీ టోర్నీలో భారత జట్టు ఫేవరెట్‌గా బరిలోకి దిగనుంది. నేడు జరిగే తొలి లీగ్ మ్యాచ్‌లో మలేసియా జట్టుతో సలీమా టెటె సారథ్యంలోని భారత జట్టు తలపడుతుంది.
మహిళల ఆసియా చాంపియన్స్ ట్రోఫీకి భారత్ ఆతిథ్యమివ్వడం ఇది వరుసగా మూడోసారి కావడం విశేషం. గత రెండు పర్యాయాల్లో రాంచీ (జార్ఖండ్; 2023లో), రాజ్‌గిర్ (బిహార్; 2024లో) వేదికగా జరిగిన ఆసియా చాంపియన్స్ ట్రోఫీలో భారత జట్టే విజేతగా నిలిచింది. ఈసారి కూడా గెలిచి టీమిండియా ‘హ్యాట్రిక్’ నమోదు చేయాలని పట్టుదలతో ఉంది. 2016లో సింగపూర్‌లో భారత జట్టు తొలిసారి ఆసియా చాంపియన్స్ ట్రోఫీ చాంపియన్‌గా అవతరించింది.
చైనా, జపాన్, దక్షిణ కొరియా, థాయ్‌లాండ్ జట్లు కూడా చాంపియన్స్ ట్రోఫీ బరిలో ఉన్నాయి. మలేసియాతో మ్యాచ్ అనంతరం భారత జట్టు ఈనెల 21న దక్షిణ కొరియాతో... 22న థాయ్‌లాండ్‌తో... 24న చైనాతో... 25న జపాన్‌తో ఆడుతుంది. లీగ్ దశ ముగిశాక టాప్–4లో నిలిచిన జట్లు సెమీఫైనల్‌కు చేరుకుంటాయి. 27న సెమీఫైనల్స్, 28న ఫైనల్ జరుగుతుంది.


