న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్ గెలిచిన ఆనందంలో ఉన్న టీమిండియాకు అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC) షాకిచ్చింది. మౌంట్‌మంగునూయి వేదికగా జరిగిన చివరి వన్డే మ్యాచ్‌లో స్లో ఓవర్ రేట్ కారణంగా భారత జట్టుకు ఐసీసీ జరిమానా విధించింది. నిర్ణీత సమయంలో ఓవర్లు పూర్తి చేయడంలో విఫలమైనందుకు గాను భారత జట్టుకు మ్యాచ్ ఫీజులో 35 శాతం కోత విధించింది. ఈ విషయాన్ని ఐసీసీ ఒక మీడియా ప్రకటన ద్వారా వెల్లడించింది.
నిర్ణీత సమయం ముగిసేసరికి టీమిండియా ఏడు ఓవర్లు వెనుకబడి ఉన్నట్లు మ్యాచ్ రిఫరీ రంజన్ మడుగల్లె తేల్చారు. ఈ కారణంగానే ఆటగాళ్ల మ్యాచ్ ఫీజులో కోత పడింది.
ఐసీసీ ప్రవర్తనా నియమావళిలోని ఆర్టికల్ 2.22 ప్రకారం.. సమయానికి పూర్తి చేయని ప్రతి ఓవర్‌కు 5 శాతం మ్యాచ్ ఫీజు కోత విధిస్తారు. ఈ లెక్కన 7 ఓవర్లకు గాను 35 శాతం జరిమానా పడగా.. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ఈ తప్పును అంగీకరించడంతో అధికారిక విచారణ అవసరం లేకుండా శిక్ష ఖరారైంది.
ఆఖరి వన్డేలో అద్భుతం
సిరీస్ డిసైడర్ అయిన ఐదో వన్డేలో భారత జట్టు అద్భుతమైన ప్రదర్శన కనబరిచింది. బ్యాటర్లు విఫలమైనప్పటికీ, బౌలర్లు మాత్రం అదరగొట్టారు. కేవలం 209 పరుగుల లక్ష్యాన్ని సమర్థవంతంగా డిఫెండ్ చేసి భారత్‌కు అపురూప విజయాన్ని అందించారు. భారత బౌలర్ల ధాటికి కివీస్ జట్టు 187 పరుగులకే ఆలౌటైంది. ఈ విజయంతో భారత్ సిరీస్‌ను 3-1 తేడాతో కైవసం చేసుకుంది. కాగా గురువారం నుంచి భారత్-న్యూజిలాండ్ మధ్య రెండు టెస్టుల సిరీస్ ప్రారంభం కానుంది.


