భారత్-న్యూజిలాండ్ మధ్య తొలి టెస్టు వెల్లింగ్టన్ వేదికగా గురువారం(నవంబర్ 19) నుంచి ప్రారంభం కానుంది. ఇప్పటికే టీ20, వన్డే సిరీస్‌లను సొంతం చేసుకున్న టీమిండియా.. రెడ్ బాల్ సిరీస్‌లోనూ బోణీ కొట్టాలని పట్టుదలతో ఉంది. వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ రేసులో ఉండాలంటే భారత్‌కు ఈ సిరీస్ కీలకం.
దీంతో పూర్తి స్ధాయి జట్టుతో భారత్ బరిలోకి దిగుతోంది. వైట్‌బాల్ సిరీస్‌లకు దూరంగా ఉన్న స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా టెస్టుల్లో మాత్రం ఆడనున్నాడు. నాలుగు రోజుల ముందే న్యూజిలాండ్‌కు చేరుకున్న బుమ్రా నెట్స్‌లో తీవ్రంగా శ్రమించాడు.
పేసర్లకు అనుకూలించే వెల్లింగ్టన్ వికెట్‌పై నిప్పులు చెరగాలని జస్ప్రీత్ భావిస్తున్నాడు. ఈ నేపథ్యంలో కివీస్ కెప్టెన్ టామ్ లాథమ్ కీలక వ్యాఖ్యలు చేశాడు. బుమ్రా బౌలింగ్ యాక్షన్ చాలా విభిన్నంగా ఉంటుందని, అతడి నుంచి వచ్చే వైవిధ్యమైన బంతులను ఎదుర్కోవడం తమ బ్యాటర్లకు పెద్ద సవాల్‌గా మారుతుందని లాథమ్ అన్నాడు.
"ఈ రెడ్ బాల్ సిరీస్‌లో బుమ్రా మాకు పెద్ద సవాలుగా మారబోతున్నాడని మాకు తెలుసు. ముఖ్యంగా న్యూజిలాండ్ పిచ్‌లు అతడికి సరిగ్గా సరిపోతాయి. పేస్‌కు, సీమ్‌కు అనుకూలించే నేపథ్యంలో బుమ్రా లాంటి బౌలర్‌ను ఎదుర్కోవడం చాలా కష్టం. బుమ్రాను ఎదుర్కొనేందుకు తాము ప్రత్యేకంగా కసరత్తు చేశాము.
అదే సమయంలో బుమ్రా ఒక్కడిపైనే దృష్టి పెట్టకుండా మిగితా భారత బౌలర్లను కూడా సమర్ధవంతంగా ఆడేందుకు సిద్దమయ్యామని ప్రీ మ్యాచ్ ప్రెస్ కాన్ఫరెన్స్‌లో" లాథమ్ పేర్కొన్నాడు. అలాగే తొలి టెస్టులో ముగ్గురు పేస్ బౌలర్లు, ఒక బౌలింగ్ ఆల్ రౌండర్‌తో బరిలోకి దిగనున్నట్లు లాథమ్ వెల్లడించాడు.
కాగా ఐదో వన్డేకు దూరమైన మాట్ హెన్రీ పూర్తి ఫిట్‌నెస్ సాధించి ఇప్పుడు జట్టుతో కలవడం కివీస్‌కు పెద్ద ఊరటనిచ్చే అంశం. ఇదే సమయంలో స్టార్ ఆల్‌రౌండర్ మిచెల్ శాంట్నర్ గాయం కారణంగా సిరీస్ మొత్తానికి దూరం కావడం పెద్ద ఎదురు దెబ్బగా చెప్పుకోవాలి.


