ఈగలా అతడిని టీమిండియా నుంచి తీసేశారు.. ఇదేం పద్ధతి? | Thrown out like fly removed from milk: Ind Ex Star Slams Kuldeep Release | Sakshi
Sakshi News home page

ఈగలా అతడిని టీమిండియా నుంచి తీసేశారు.. ఇదేం పద్ధతి?

Nov 16 2026 7:57 PM | Updated on Nov 16 2026 7:57 PM

Thrown out like fly removed from milk: Ind Ex Star Slams Kuldeep Release

PC: BCCI X

న్యూజిలాండ్‌ పర్యటనకు వెళ్లిన టీమిండియా స్పిన్నర్‌ కుల్దీప్‌ యాదవ్‌కు చేదు అనుభవమే మిగిలింది. ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో మొత్తం బెంచ్‌కే పరిమితమైన ఈ చైనామన్‌ బౌలర్‌.. ఐదు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో ఒకే ఒక్క మ్యాచ్‌ ఆడాడు.

రాకరాక అవకాశం వస్తే.. 
కివీస్‌తో నాలుగో వన్డేలో రాకరాక అవకాశం వస్తే.. కుల్దీప్‌ యాదవ్‌ దానిని సద్వినియోగం చేసుకోలేకపోయాడు. మౌంట్‌మౌంగనూయ్‌ వేదికగా ఈ మ్యాచ్‌లో కేవలం ఎనిమిది ఓవర్లు మాత్రమే బౌలింగ్‌ చేసిన ఈ లెఫ్టార్మ్‌ స్పిన్నర్‌ ఏకంగా 73 పరుగులు ఇచ్చి ఒక్క వికెట్‌ కూడా తీయలేకపోయాడు.

గంభీర్‌ ఆగ్రహం
ఈ క్రమంలో కుల్దీప్‌ యాదవ్‌ ఆట తీరుపై విమర్శలు వచ్చాయి. టీమిండియా హెడ్‌కోచ్‌ గౌతం గంభీర్‌ సైతం.. అవకాశం ఇచ్చినా సద్వినియోగం చేసుకోలేదని.. అతడిని వైఫల్యాన్ని ఎత్తి చూపుతూ మండిపడ్డాడు. ఇలాగే కొనసాగితే వన్డే వరల్డ్‌కప్‌-2027 జట్టులో చోటు దక్కదనే సంకేతాలు ఇచ్చాడు.

అనంతరం టెస్టు జట్టు నుంచి కుల్దీప్‌ యాదవ్‌ను విడుదల చేసిన యాజమాన్యం.. అతడి స్థానంలో పేసర్‌ గుర్నూర్‌ బ్రార్‌ను చేర్చింది. ఈ నేపథ్యంలో భారత మాజీ ఓపెనర్‌, కామెంటేటర్‌ ఆకాశ్‌ చోప్రా తీవ్రంగా స్పందించాడు. పాలలో ఈగను తీసిపడేసినట్లు కుల్దీప్‌ను జట్టు నుంచి అంతే తేలికగా తీసిపడేశారని మండిపడ్డాడు.

ప్రపంచంలోనే అత్యుత్తమ స్పిన్నర్‌
‘‘కుల్దీప్‌ను అకారణంగా ఇంటికి పంపించేశారు. ఇలా జరగడం చాలా అరుదు. ఓ ఆటగాడిని జట్టుకు ఎంపిక చేసి మధ్యలోనే ఇలా తప్పించడం ఏమిటి?.. కొత్తగా ఆటగాళ్లను జట్టులో చేర్చుతారే తప్ప.. జట్టులో ఉన్న వాళ్లను తొలగించరు. అసలు ఇదేం పద్ధతి?

ఈగను తీసిపడేసినట్లు తీసేశారు
మూడు ఫార్మాట్లలో ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యుత్తమ స్పిన్నర్లలో కుల్దీప్‌ యాదవ్‌ ముందు వరుసలో ఉంటాడు. కానీ అతడిని చాలా సులువుగా జట్టు నుంచి తప్పించేస్తున్నారు. పాలలో ఈగను తీసిపడేసినట్లు జట్టు నుంచి అతడిని తీసేశారు.

న్యూజిలాండ్‌లో అతడిని టీ20 సిరీస్‌లో ఆడించనేలేదు. వన్డేల్లో ఒకే ఒక్క మ్యాచ్‌లో అవకాశం ఇచ్చి.. ఆ తర్వాత తప్పించారు. దేశీ క్రికెట్‌ ఆడేందుకు అతడిని స్వదేశానికి పంపించారా?.. గత ఎనిమిదేళ్లుగా టీమిండియా యాజమాన్యం కుల్దీప్‌ యాదవ్‌ విషయంలో పదే పదే తప్పులు పునరావృతం చేస్తోంది.

వన్డేల్లో అతడికి అద్భుతమైన రికార్డు ఉంది. అయినా సరే ఎవరినైనా తప్పించాలంటే ముందుగా అతడిపైనే వేటు వేస్తారు. టీ20లలోనూ కుల్దీప్‌ రాణిస్తున్నాడు. అయినా సరే చిన్నచూపే. గుర్నూర్‌ విషయంలో నాకేమీ తప్పు అనిపించడం లేదు. కానీ కుల్దీప్‌ యాదవ్‌కు మరిన్ని అవకాశాలు కచ్చితంగా దక్కాలి’’ అని ఆకాశ్‌ చోప్రా మేనేజ్‌మెంట్‌ తీరుపై ఒకింత ఆగ్రహం వ్యక్తం చేశాడు.

ఇదీ చదవండి: IND vs NZ Tests: షెడ్యూల్‌, మ్యాచ్‌ ఆరంభ సమయం, లైవ్‌ స్ట్రీమింగ్‌ వివరాలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement