సానియాతో పరిణీతి (PC: Instagram)
భారత టెన్నిస్ దిగ్గజం సానియా మీర్జా ఆదివారం (నవంబరు 15) తన నలభైవ పుట్టినరోజు జరుపుకొన్నారు. ఈ సందర్భంగా స్నేహితులు, అభిమానుల నుంచి ఆమెకు శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. ఈ క్రమంలో బాలీవుడ్ నటి, సానియా మీర్జా ప్రాణ స్నేహితురాలు పరిణీతి చోప్రా సోమవారం చేసిన పోస్టు వైరల్‌గా మారింది.
నువ్వు నిజం.. అందుకే నిన్ను పిచ్చిగా ప్రేమిస్తున్నా
‘‘నేను నిన్ను ఎందుకింతగా.. మరీ ఇంత పిచ్చిగా ప్రేమిస్తాను?.. ఎందుకంటే నువ్వు నిజం. ఎందుకంటే నువ్వు నువ్వే. అతి సాధారణంగా ఉంటావు. ఈ రెండు గుణాలే నాకు నీలో బాగా నచ్చుతాయి.
పుట్టినరోజు శుభాకాంక్షలు ఆగూ. ఐ లవ్ యూ. ఇప్పటికే నేను నిన్ను వ్యక్తిగతంగా కలిసి విషెస్ చెప్పాను. ఇప్పుడు ఇలా ఇన్‌స్టాగ్రామ్‌లో మనం కలిసి ఉన్న చెత్త (సరదాగా) ఫొటోలను పోస్ట్ చేస్తున్నాను’’ అంటూ పరిణీతి సానియాపై ప్రేమను కురిపించింది.
అనన్య బిర్లా సైతం
కాగా సానియా మీర్జా ప్రస్తుతం తన కుమారుడితో కలిసి దుబాయ్‌లో నివసిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో పరిణీతితో పాటు.. సానియా మరో బెస్ట్ ఫ్రెండ్ అనన్య బిర్లా సైతం అక్కడికే వెళ్లి ఆమె బర్త్‌డేను సెలబ్రేట్ చేసినట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

అకాడమీ పనులు, కుమారుడి పెంపకంలో బిజీ
పాకిస్తాన్ మాజీ క్రికెటర్ షోయబ్ మాలిక్‌ను ప్రేమించి పెళ్లి చేసుకున్న హైదరాబాదీ సానియాకు.. కుమారుడు ఇజహాన్ సంతానం. షోయబ్‌తో విడాకులు తీసుకున్న సానియా ప్రస్తుతం దుబాయ్‌లో తన టెన్నిస్ అకాడమీ పనులతో పాటు.. కొడుకు పెంపకంలో బిజీగా ఉన్నారు. తన బర్త్‌డే సందర్భంగా స్నేహితులు కేక్ కట్ చేయించగా.. సానియా ఆ ఫొటోలను ఇన్‌స్టా స్టోరీలో షేర్ చేశారు.
ఇదిలా ఉంటే.. ఎంపీ రాఘవ్ చద్దాను ప్రేమ పెళ్లి చేసుకున్న పరిణీతి చోప్రా.. కుమారుడు నీర్‌కు జన్మనిచ్చింది. వీలు చిక్కినప్పుడల్లా సానియాతో చేరి కబుర్లలో మునిగిపోతూ ఉంటానని పరిణీతి గతంలో వెల్లడించింది. ఇక బిర్లా వారసురాలు అనన్య బిర్లా, బాలీవుడ్ దర్శకురాలు ఫరా ఖాన్, భారత మాజీ క్రికెటర్ రాబిన్ ఊతప్ప భార్య శీతల్ సానియా బెస్ట్ ఫ్రెండ్స్ జాబితాలో ఉన్నారు.
ఇదీ చదవండి: IND vs NZ Tests: షెడ్యూల్, మ్యాచ్ ఆరంభ సమయం, లైవ్ స్ట్రీమింగ్ వివరాలు


