PC: BCCI X
న్యూజిలాండ్ గడ్డ మీద తొలుత టీ20 సిరీస్‌ను 3-2తో గెలిచిన టీమిండియా.. అనంతరం వన్డే సిరీస్‌లో 3-1తో విజయం సాధించింది. ఇరుజట్ల మధ్య ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో తొలి రెండు వన్డేలు భారత్ గెలవగా.. మూడో వన్డే వర్షం వల్ల రద్దైపోయింది.
ఇక మౌంట్‌మౌంగనూయ్ వేదికగా టీమిండియా కివీస్ చేతిలో ఏకంగా 244 పరుగుల భారీ తేడాతో ఓడిపోయింది. ఈ నేపథ్యంలో హెడ్‌కోచ్ గౌతం గంభీర్ భారత బ్యాటర్ల తీరును తీవ్రంగా తప్పుబట్టాడు. వన్డే వరల్డ్‌కప్-2027కు వేదికైన సౌతాఫ్రికాలోనూ కివీస్ పిచ్ మాదిరే వికెట్లు ఉంటాయని పేర్కొంటూ.. టీమిండియా బ్యాటర్ల ప్రదర్శన తనను ఆందోళనకు గురిచేస్తోందన్నాడు.
3-1తో సిరీస్ సొంతం
బ్యాటింగ్ పరంగా మెరుగుపడకపోతే వరల్డ్‌కప్ టోర్నీలో తమకు తిప్పలు తప్పవని గంభీర్ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఇదిలా ఉంటే.. నాలుగో వన్డేలో ఓటమికి బదులుగా.. అదే వేదికపై ఐదో వన్డేలో గెలిచి సిరీస్‌ను 3-1తో సొంతం చేసుకుంది టీమిండియా.
ఈ పరిణామాల నేపథ్యంలో టీమిండియా మాజీ హెడ్‌కోచ్ రవిశాస్త్రి కీలక వ్యాఖ్యలు చేశాడు. కివీస్ గడ్డ మీద భారత బ్యాటర్ల ప్రదర్శన నిజంగానే ఆందోళనకరంగా ఉందని గంభీర్‌కు మద్దతు పలికాడు. ఐదో వన్డేలో టీమిండియా విజయానంతరం సోనీ స్పోర్ట్స్ షోలో మాట్లాడుతూ..
గంభీర్ చెప్పింది నిజమే
‘‘గత ప్రెస్‌మీట్ గంభీర్ చెప్పినవన్నీ వాస్తవాలే. ‘సౌతాఫ్రికా మాదిరి వికెట్ల మీద మా బ్యాటర్లు ఇలా తేలిపోవడం నన్ను నిరాశపరిచింది’ అని గంభీర్ అన్నాడు. అది వాస్తవం. భవిష్యత్తులో టీమిండియా బ్యాటర్లు మరింత గొప్పగా రాణించాల్సిన ఆవశ్యకత ఉంది.
పిచ్ పరిస్థితులపై మరింత అవగాహన తెచ్చుకోవాలి. కొన్నిసార్లు ప్రొటిస్ పిచ్‌లు నిజంగానే బ్యాటర్లను కఠిన పరీక్షకు గురిచేస్తాయి. అలాంటి వికెట్ల మీద ప్రతిసారీ 300-320 మేర స్కోరు చేయాల్సిన పనిలేదు. అక్కడ 260-270 కూడా మ్యాచ్ విన్నింగ్ స్కోరు అవుతుంది’’ అని రవిశాస్త్రి పేర్కొన్నాడు.
కాగా కివీస్‌తో తొలి వన్డేలో ఐదు వికెట్ల నష్టానికి 143 పరుగులు చేసిన టీమిండియా.. రెండో వన్డేలో ఏడు వికెట్ల నష్టానికి కేవలం 113 పరుగులు చేసింది. ఈ రెండు మ్యాచ్‌లకు వర్షం అంతరాయం కలిగించడం వల్ల డీఎల్‌ఎస్ పద్ధతిలో విజయం సాధించింది. నాలుగో వన్డేలో 89 పరుగులకే ఆలౌట్ అయిన భారత జట్టు.. ఐదో వన్డేలో 209 పరుగులకు కుప్పకూలింది.
ఇదీ చదవండి: అతడొక అద్భుతం.. ధోనిని గుర్తుచేశాడు: టీమిండియా దిగ్గజం


