Photo Credit: BCCI
భారత యువ క్రికెటర్ మోహిత్ ఉల్వాపై టీమిండియా దిగ్గజం సునిల్ గావస్కర్ ప్రశంసల వర్షం కురిపించాడు. పాకిస్తాన్‌తో ఫైనల్లో అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నాడని కొనియాడాడు. భారత లెజెండరీ కెప్టెన్, దిగ్గజ ఫినిషర్ మహేంద్ర సింగ్ ధోనిని మోహిత్ గుర్తుచేశాడని ప్రశంసించాడు.
ఒక్క వికెట్ తేడాతో ఓడించి..
ఏసీసీ మెన్స్ అండర్-19 ఆసియా కప్-2026 వన్డే టోర్నమెంట్లో భారత యువ జట్టు సంచలన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఆఖరి బంతి వరకు ఉత్కంఠగా సాగిన టైటిల్ పోరులో దాయాది పాకిస్తాన్‌ను ఒక్క వికెట్ తేడాతో ఓడించి.. గత ఎడిషన్‌లో ఎదురైన పరాభవానికి బదులు తీర్చుకుంది.
49 పరుగులతో అజేయంగా
పాక్ విధించిన 338 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో మిడిలార్డర్ తడబడగా.. లోయర్ ఆర్డర్‌లో వచ్చిన మనాల్ చౌహాన్, మోహిత్ ఉల్వా అద్భుతం చేశారు. ముఖ్యంగా ఆఖరి బంతికి మూడు పరుగులు అవసరమైన వేళ మోహిత్ బౌండరీ బాది భారత్ గెలుపును ఖరారు చేశాడు. పదో నంబర్‌లో బ్యాటింగ్‌కు వచ్చిన అతడు కేవలం 26 బంతుల్లోనే 5 ఫోర్లు, 3 సిక్సర్లు బాది 49 పరుగులతో అజేయంగా నిలిచాడు. తద్వారా జట్టును గెలిపించి హీరోగా అవతరించాడు.
ధోనిని గుర్తు చేశాడు
ఈ నేపథ్యంలో టీమిండియా దిగ్గజ సారథి, కామెంటేటర్ సునిల్ గావస్కర్ మోహిత్ ఉల్వా ఆట తీరును ముగ్ధుడయ్యాడు. సోనీ స్పోర్ట్స్ షోలో మాట్లాడుతూ.. ‘‘ఎంఎస్ ధోని మాదిరి ఉల్వా చాలా కూల్‌గా కనిపించాడు. ఐస్‌మ్యాన్. వచ్చాడు.. అలా ఫోర్ బాదాడు. నాన్ స్ట్రైకర్ కూడా చాలా సంతోషించాడు. ఉల్వా హెల్మెట్ తీసి కింద పెట్టేసి అలా విజయగర్వంతో చేతులు ఎత్తాడు.
అతడొక అద్భుతం
ఒకవేళ ఆ స్థానంలో ధోని ఉంటే కూడా అచ్చం అలాగే చేసేవాడు. వన్డే వరల్డ్‌కప్-2011లో విన్నింగ్ సిక్సర్ కొట్టిన తర్వాత ధోని ఏం చేశాడో అందరికీ తెలుసు కదా!.. అదొక చిరస్మరణీయ దృశ్యం. ఇప్పుడు ఉల్వా కూడా తన పేరును చిరస్మరణీయం చేసుకున్నాడు.
252 పరుగుల వద్ద ఎనిమిదో వికెట్ కోల్పోయినప్పటికీ మనవాళ్లు పట్టువీడలేదు. ఉల్వా నిజంగానే అద్భుతం చేశాడు’’ అని గావస్కర్ కొనియాడాడు. కాగా పాకిస్తాన్‌పై ఆఖరి బంతికి లక్ష్యాన్ని ఛేదించి భారత జట్టు ఒక్క వికెట్ తేడాతో గెలుపొందిన సంగతి తెలిసిందే.
ఇదీ చదవండి: IND vs PAK: ఆఖరి బంతికి టీమిండియాను గెలిపించాడు.. ఎవరీ మోహిత్ ఉల్వా?


