టీమిండియా యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ కేవలం 15 ఏళ్ల వయసులోనే క్రికెట్ ప్రపంచం మొత్తాన్ని తనవైపు తిప్పుకున్న సంగతి తెలిసిందే. అయితే అతడు భారత టీ20 జట్టులో భాగమైనప్పటికీ, తుది జట్టులో మాత్రం పెద్దగా అవకాశాలు లభించడం లేదు.
ఇటీవల ముగిసిన న్యూజిలాండ్ సిరీస్‌లోనూ సూర్యవంశీకి కేవలం రెండు మ్యాచ్‌లలోనే ఆడే ఛాన్స్ దక్కింది. రెగ్యులర్ ఓపెనర్లుగా అభిషేక్ శర్మ, సంజు శాంసన్ ఉండటంతో వైభవ్ బెంచ్‌కే పరిమితమవుతున్నాడు.
ఈ నేపథ్యంలో వైభవ్ భవిష్యత్తుపై భారత మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ కీలక వ్యాఖ్యలు చేశారు. వైభవ్‌కు అద్భుతమైన టాలెంట్ ఉన్నప్పటికీ.. అతడు రాబోయే రోజుల్లో సచిన్‌లా దిగ్గజంగా ఎదుగుతాడా, లేక వినోద్ కంబ్లీలా దారితప్పుతాడా అనేది అతడి క్రమశిక్షణపైనే ఆధారపడి ఉంటుందని కపిల్ అభిప్రాయపడ్డారు.
డబ్బు, పార్టీల మాయలో పడకూడదు: కపిల్ దేవ్
"వైభవ్ ప్రయాణించాల్సిన దూరం ఇంకా చాలా ఉంది. భారత జట్టులో ఉన్నప్పటికీ అతడికి తగినన్ని అవకాశాలు రావడం లేదు. ఒక 15 ఏళ్ల కుర్రాడు మైదానంలో ఫోర్లు, సిక్సర్లు బాదుతుంటే చూసేందుకు ప్రతీ ఒక్కరూ ఇష్టపడతారు. అతడిలో అద్భుతమైన ప్రతిభ ఉంది, అందులో ఎలాంటి సందేహం లేదు. కానీ రెగ్యులర్ ప్లేయర్‌గా మారడానికి కాస్త సమయం పడుతుంది.
ఈ దశలో డబ్బు, ఇతర అంశాల గురించి ఆలోచించకుండా కేవలం క్రికెట్‌పైనే దృష్టి పెట్టాలి. 15 ఏళ్ల వయసులో అతడికి క్రికెటే ప్రపంచంగా ఉంది. కానీ 18 లేదా 19 ఏళ్లకు చేరుకున్నప్పుడు పార్టీలు, ఇతర ఆకర్షణలు ఎదురవుతాయి. అప్పుడు అతడు సచిన్ టెండూల్కర్‌లా మారతాడా లేక వినోద్ కంబ్లీలా అవుతాడా అనేది తేలిపోతుంది. కానీ ఇప్పుడే ఏదీ చెప్పడం కష్టం" అని కపిల్ దేవ్ పేర్కొన్నారు.
కాగా, సచిన్ టెండూల్కర్ కంటే ఎక్కువ ప్రతిభ ఉన్న వినోద్ కంబ్లీ చేజేతులా తన కెరీర్‌ను నాశనం చేసుకున్నాడు. సరైన క్రమశిక్షణ, అంకితభావంతో సచిన్ 'గాడ్ ఆఫ్ క్రికెట్'గా ఎదిగితే.. కంబ్లీ మాత్రం విలాసవంతమైన జీవనశైలి, క్రమశిక్షణారాహిత్యం కారణంగా అర్ధాంతరంగా తన కెరీర్‌ను ముగించాడు. ఈ నేపథ్యంలోనే సూర్యవంశీ కెరీర్ గాడితప్పకుండా జాగ్రత్త పడాలని కపిల్ దేవ్ హితవు పలికారు.


