అతి పిన్న వయసు కెప్టెన్‌గా రికార్డు
ఇండోర్: భారత యువ ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ మరో ఘనత తన ఖాతాలో వేసుకున్నాడు. ఇప్పటికే 15 ఏళ్ల వయసులో అంతర్జాతీయ అరంగేట్రం చేసి రికార్డు సృష్టించిన వైభవ్... ఇప్పుడు పురుషుల టి20 క్రికెట్ చరిత్రలో ఒక జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించిన అతిపిన్న వయస్కుడిగా చరిత్రకెక్కాడు. దేశవాళీ టి20 టోర్నమెంట్ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో వైభవ్ సూర్యవంశీ బిహార్ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. టోర్నీలో భాగంగా శనివారం జరిగిన మ్యాచ్‌లో బిహార్ జట్టు సౌరాష్ట్రతో మ్యాచ్ ఆడింది. దీంతో వైభవ్ 15 ఏళ్ల 232 రోజుల వయసులో జట్టుకు సారథ్యం వహించాడు. తద్వారా ఇప్పటి వరకు క్రొయేషియా కెప్టెన్ జాచ్ వుకుసిచ్ (17 ఏళ్ల 311 రోజులు; 2025 ఆగస్టు 7న సైప్రస్ జట్టుపై) పేరిట ఉన్న రికార్డును వైభవ్ బద్దలు కొట్టాడు.
ఇటీవల దులీప్ ట్రోపీ సందర్భంగా ఈస్ట్ జోన్ జట్టుకు వైస్ కెప్టెన్‌గా వ్యవహరించిన వైభవ్.. సారథిగా తొలి మ్యాచ్‌లో జట్టును గెలిపించలేకపోయాడు. ఇండోర్ వేదికగా ఎలైట్ గ్రూప్ ‘బి’లో భాగంగా శనివారం జరిగిన మ్యాచ్‌లో సౌరాష్ట్ర జట్టు 5 వికెట్ల తేడాతో బిహార్‌పై గెలిచింది. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్‌కు దిగిన బిహార్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 137 పరుగులు చేసింది. వైభవ్ 12 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్స్ సాయంతో 18 పరుగులు చేసి వెనుదిరగగా... పృథ్వీ రాజ్ (38; 4 సిక్స్‌లు) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. సౌరాష్ట్ర బౌలర్లలో ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ చేతన్ సకారియా, ప్రేరక్ మన్కడ్ చెరో మూడు వికెట్లు పడగొట్టారు. అనంతరం లక్ష్యఛేదనలో సౌరాష్ట్ర 16.3 ఓవర్లలో 5 వికెట్లకు 138 పరుగులు చేసి మ్యాచ్ గెలిచింది.


