source: X
సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీ 2026లో భాగంగా అస్సాంతో ఇవాళ జరుగుతున్న మ్యాచ్‌లో మధ్యప్రదేశ్ కెప్టెన్ రజత్ పాటిదార్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. 48 బంతుల్లో 13 సిక్సర్లు, 8 ఫోర్ల సాయంతో అజేయమైన 135 పరుగులు చేశాడు. ఫలితంగా తొలుత బ్యాటింగ్ చేసిన అతడి జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 250 పరుగుల భారీ స్కోర్ చేసింది.
57 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న జట్టును పాటిదార్-శివాంగ్ కుమార్ (38 బంతుల్లో 61; 3 ఫోర్లు, 4 సిక్సర్లు) ఆదుకున్నారు. వీరిద్దరూ నాలుగో వికెట్‌కు 62 బంతుల్లో 153 పరుగులు జోడించారు. శివాంగ్ కుమార్ ఔటయ్యాక కూడా పాటిదార్ విధ్వంసం కొనసాగింది. స్ట్రైక్ తన వద్దనే పెట్టుకుని ప్రత్యర్ది బౌలర్లపై విరుచుకపడ్డాడు.
గతకొంతకాలంగా పాటిదార్ టీమిండియాలో చోటే లక్ష్యంగా బ్యాటింగ్‌ను కొనసాగిస్తున్నాడు. అవకాశం దొరికిన ప్రతిసారి ఫార్మాట్లకతీతంగా చెలరేగుతున్నాడు. సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీ సుదీర్ఘంగా సాగనుండటంతో పాటిదార్ నుంచి ఇలాంటి ధమాకేదార్ ఇన్నింగ్స్‌లు మరిన్ని చూడవచ్చు.
సెంచరీ చేసిన తొలి మధ్యప్రదేశ్ ఆటగాడు
తాజా సెంచరీ పాటిదార్‌ను రికార్డుల్లోకెక్కించింది. మధ్యప్రదేశ్ తరఫున సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీలో సెంచరీ చేసిన తొలి ఆటగాడిగా అతడు చరిత్ర సృష్టించాడు. దీనికి ముందు కూడా మధ్యప్రదేశ్ తరఫున సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీలో అత్యధిక స్కోర్ (96) పాటిదార్ పేరిటే ఉండింది.
అస్సాంతో మ్యాచ్‌లో ఐదో స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన పాటిదార్ కేవలం 41 బంతుల్లోనే శతక్కొట్టాడు. ఈ ఇన్నింగ్స్‌తో అతడు భారత సెలెక్టర్లకు గట్టి సవాల్ విసిరాడు.
ఇదీ చదవండి: భారత అండర్ 19 జట్టు దూకుడును మెచ్చుకున్న అక్తర్


