బ్యాటింగ్‌లో మెరుపులు.. అర్షదీప్‌ సింగ్‌ అరుదైన రికార్డులు | Arshdeep Singh Batting Blitz Sets New Record In IND vs NZ 5th ODI | Sakshi
Sakshi News home page

బ్యాటింగ్‌లో మెరుపులు.. అర్షదీప్‌ సింగ్‌ అరుదైన రికార్డులు

Nov 15 2026 12:33 PM | Updated on Nov 15 2026 12:52 PM

Arshdeep Singh Batting Blitz Sets New Record In IND vs NZ 5th ODI

source: X

మౌంట్‌ మాంగనూయ్‌ వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న ఐదో వన్డేలో భారత పేసర్ అర్షదీప్ సింగ్ బ్యాట్‌తో మెరుపులు మెరిపించాడు. 11వ స్థానంలో బ్యాటింగ్‌కు దిగి తొలి బంతికే సిక్సర్ బాదాడు. ఆతర్వాత తానెదుర్కొన్న మూడో బంతికి మరో సిక్సర్‌ కొట్టాడు. మొత్తంగా నాలుగు బంతులు మాత్రమే ఎదుర్కొని 14 పరుగులు చేసి డఫీ బౌలింగ్‌లో ఔటయ్యాడు. ఈ విధ్వంసకర బ్యాటింగ్‌తో అర్షదీప్‌ పలు భారత రికార్డుల జాబితాలో చోటు సంపాదించాడు.

వన్డేల్లో భారత్‌ తరఫున 11 స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చి ఒకే ఇన్నింగ్స్‌లో రెండు సిక్సర్లు బాదిన మూడో ఆటగాడిగా నిలిచాడు. గతంలో వెంకటేశ్ ప్రసాద్, మహమ్మద్ షమీ మాత్రమే ఈ ఘనత సాధించారు.

అలాగే వన్డేల్లో భారత్‌ తరఫున 11వ స్థానంలో బ్యాటింగ్‌కు దిగి ఎదుర్కొన్న తొలి బంతికే సిక్సర్ బాదిన మూడో ఆటగాడిగా నిలిచాడు. గతంలో వెంకటేశ్ ప్రసాద్, జస్ప్రీత్ బుమ్రా ఈ ఘనత సాధించారు.

దీంతో పాటు న్యూజిలాండ్‌పై వన్డేల్లో భారత్ తరఫున మూడో అత్యధిక పదో వికెట్ భాగస్వామ్యాన్ని (సిరాజ్‌తో కలిసి 26 పరుగులు) నెలకొల్పాడు. ఈ జాబితాలో ధవల్‌ కులకర్ణి-ఉమేశ్‌ యాదవ్‌ (34 పరుగులు), వరుణ్‌ ఆరోన్‌-రవీంద్ర జడేజా (28* పరుగులు) జోడీలు మొదటి రెండు స్థానాల్లో ఉన్నాయి.  

మ్యాచ్‌ విషయానికొస్తే.. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా జరుగుతున్న ఈ చివరి మ్యాచ్‌లో టీమిండియా టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగి స్వల్ప స్కోర్‌కే కుప్పకూలింది. 42.1 ఓవర్లలో 209 పరుగులకే చాపచుట్టేసింది. అక్షర్‌ పటేల్‌ (46), ఇషాన్‌ కిషన్‌ (46) మినహా ఎవరూ చెప్పుకోదగ్గ స్కోర్లు చేయలేదు. 

శ్రేయస్‌ అయ్యర్‌, నమన్‌ ధిర్‌ తలో 22 పరుగులు చేయగా.. ఆఖర్లో సిరాజ్‌ (14 నాటౌట్‌), అర్షదీప్‌ (14) ఓ మోస్తరు స్కోర్లు చేయడంతో భారత్‌ 200 పరుగుల మార్కైనా తాకగలిగింది. న్యూజిలాండ్‌ బౌలర్లలో డఫీ, సాంట్నర్‌ తలో 3, ఫిషర్‌ 2, టిక్నర్‌, బ్రేస్‌వెల్‌ చెరో వికెట్‌ తీసి భారత్‌ పతనాన్ని శాశించారు.

అనంతరం స్వల్ప లక్ష్యాన్ని న్యూజిలాండ్‌ నిదానంగా ఛేదించే ‍ప్రయత్నం చేస్తుంది. 14 ఓవర్ల తర్వాత ఆ జట్టు స్కోర్‌ 57-1గా ఉంది. యంగ్‌ (17), కెల్లీ (20) క్రీజ్‌లో ఉన్నారు. కాగా, ఈ సిరీస్‌లో భారత్‌ 2-1 ఆధిక్యంలో కొనసాగుతున్న విషయం తెలిసిందే.

ఇదీ చదవండి: రూట్‌ మరో చరిత్ర


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement