source: X
టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లికి న్యూజిలాండ్ వన్డే సిరీస్ నిరాశాజనకంగా ముగిసింది. ఈ సిరీస్‌లో మొత్తం నాలుగు ఇన్నింగ్స్‌లు ఆడిన అతడు కేవలం 86 పరుగులు మాత్రమే చేశాడు. తొలి వన్డేలో అద్భుత ఇన్నింగ్స్ (74) మినహా మిగతా మూడు మ్యాచ్‌ల్లోనూ (7, 0, 5) ఘోరంగా విఫలమయ్యాడు. ఇవాళ జరుగుతున్న ఐదో వన్డేలో 7 బంతుల్లో ఒక్క బౌండరీ కూడా లేకుండా 5 పరుగులు మాత్రమే చేసి ఫిషర్ బౌలింగ్‌లో అనవసర షాట్ ఆడి వికెట్ సమర్పించుకున్నాడు.
అత్యంత చెత్త ప్రదర్శన
వన్డే క్రికెట్‌లో పరుగుల యంత్రంగా పేరొందిన విరాట్ కోహ్లి.. న్యూజిలాండ్ సిరీస్‌లో మూడు సార్లు సింగిల్ డిజిట్ స్కోరుకే పరిమితమయ్యాడు. ద్వైపాక్షిక వన్డే సిరీస్‌లో కోహ్లీ ఇలా మూడు సార్లు సింగిల్ డిజిట్ స్కోరుతో ఔటవడం ఇది రెండోసారి మాత్రమే.
2012-13లో పాకిస్తాన్‌తో భారత్‌లో జరిగిన ద్వైపాక్షిక వన్డే సిరీస్‌లో కోహ్లీ వరుసగా 0, 6, 7 పరుగులు చేశాడు. మళ్లీ 14 ఏళ్ల తర్వాత ప్రస్తుత న్యూజిలాండ్ సిరీస్‌లో ఇలాంటి పరిస్థితి ఎదురైంది. ఈ రెండు సిరీస్‌లు మినహా ద్వైపాక్షిక వన్డే సిరీస్‌లో కోహ్లీ మూడుసార్లు సింగిల్ డిజిట్ స్కోరుకు ఔటైన సందర్భం మరొకటి లేదు.
వన్డేల్లో కోహ్లీ అత్యధికంగా సింగిల్ డిజిట్ స్కోరుకు ఔటైన టోర్నీలు/ సిరీస్‌లు
- 3 సార్లు - 2011 వన్డే ప్రపంచకప్
- 3 సార్లు - పాకిస్తాన్‌తో భారత్‌లో (2012-13)
- 3 సార్లు - కార్ల్టన్ మిడ్ వన్డే ట్రై సిరీస్ (2014-15)
- 3 సార్లు - ప్రస్తుత న్యూజిలాండ్ సిరీస్ (2026)
మ్యాచ్ విషయానికొస్తే.. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన భారత్ కనీసం 200 పరుగులు కూడా చేసేలా కనిపించడం లేదు. 38 ఓవర్ల అనంతరం జట్టు స్కోర్ 168-8గా ఉంది. విరాట్ కోహ్లితో పాటు స్టార్ ప్లేయర్లు రోహిత్ శర్మ (7), రుతురాజ్ (18), శ్రేయస్ (22) తక్కువ స్కోర్లకే ఔటయ్యారు. నమన్ ధిర్ (22), అక్షర్ పటేల్ (46) ఓ మోస్తరు పోరాటం చేయగా.. ఆకిబ్ నబీ (5), యశ్ ఠాకూర్ (0) నిరాశపరిచారు. ఇషాన్ కిషన్ (34), సిరాజ్ క్రీజ్‌లో ఉన్నారు. సాంట్నర్ (3-32), ఫిషర్ (2-28) టీమిండియాను దెబ్బకొట్టారు.
ఇదీ చదవండి: రోహిత్ శర్మ చెత్త రికార్డు


