నేడు న్యూజిలాండ్‌తో భారత్ చివరి వన్డే
ఉదయం 7:30 నుంచి సోనీ స్పోర్ట్స్, సోనీ లివ్ యాప్‌లో ప్రసారం
మౌంట్ మాంగనూయ్: న్యూజిలాండ్ పర్యటనలో టి20 సిరీస్ కైవసం చేసుకున్న భారత క్రికెట్ జట్టు... ఇప్పుడు వన్డే సిరీస్‌లో అదే ఫలితం రాబట్టేందుకు సిద్ధమైంది. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా నేడు భారత్, న్యూజిలాండ్ మధ్య చివరిదైన ఐదో వన్డే జరగనుంది. తొలి రెండు మ్యాచ్‌ల్లో టీమిండియా సునాయాస విజయాలు సాధించగా... మూడో వన్డే వర్షం కారణంగా రద్దు అయింది. ఇక నాలుగో వన్డేలో బ్యాటర్ల వైఫల్యంతో ఘోర పరాజయం మూటగట్టుకున్న శ్రేయస్ అయ్యర్ సారథ్యంలోని భారత జట్టు... ఇప్పుడు చివరి వన్డే పోరుకు సిద్ధమైంది.
గత మ్యాచ్‌లో కివీస్ స్వింగ్ బౌలింగ్‌ను ఎదుర్కోలేక చేతులెత్తేసిన టీమిండియా... ఈ మ్యాచ్‌లో ఎలాంటి ప్రదర్శన కనబరుస్తుందనేది ఆసక్తికరం. గత ఏడేళ్లుగా సొంతగడ్డపై వన్డే సిరీస్ కోల్పోని న్యూజిలాండ్ జట్టు చివరి మ్యాచ్‌లో గెలిచి సిరీస్‌ను 2–2తో సమం చేయాలని పట్టుదలగా ఉంది. వచ్చే ఏడాది వన్డే ప్రపంచకప్ జరగనున్న దక్షిణాఫ్రికా పిచ్‌లు దాదాపు న్యూజిలాండ్ తరహాలోనే ఉండనున్న నేపథ్యంలో... మనవాళ్ల ప్రదర్శన మెరుగపడాల్సిన అవసరముందని హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ అన్నాడు.
గత మ్యాచ్‌లో భారత పతనాన్ని శాసించిన న్యూజిలాండ్ పేసర్ మ్యాట్ హెన్రీ ఆఖరి వన్డేలో ఆడటం లేదు. ఈ నెల 19 నుంచి ఇరు జట్ల మధ్య రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ జరగనున్న నేపథ్యంలో చివరి వన్డే నుంచి అతడికి విశ్రాంతినిచ్చారు. శుక్రవారం ఆడిన పిచ్‌పైనే ఆఖరి వన్డే జరగనుంది. మ్యాచ్‌కు వర్ష సూచనలేదు.
ఆరంభం అదరాలి!
గత మ్యాచ్‌లో తొలి ఓవర్‌లోనే మూడు వికెట్లు కోల్పోయి తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న టీమిండియా... ఈ సారి మెరుగైన ఆరంభాన్ని ఆశిస్తోంది. రోహిత్‌తో కలిసి రుతురాజ్ గైక్వాడ్ ఇన్నింగ్స్‌ను ఆరంభించనుండగా... విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, ఇషాన్ కిషన్, నమన్ ధీర్, అక్షర్ పటేల్ మిడిలార్డర్‌లో బ్యాటింగ్‌కు రానున్నారు. రోహిత్, కోహ్లి కేవలం వన్డే ఫార్మాట్‌లో మాత్రమే ఆడుతున్న నేపథ్యంలో వారి నుంచి అభిమానులు భారీ ఇన్నింగ్స్‌లు ఆశిస్తున్నారు.
ఈ సిరీస్‌లో ఇప్పటి వరకు బెంచ్‌కే పరిమితమైన హైదరాబాదీ పేసర్ మొహమ్మద్ సిరాజ్ ఈ మ్యాచ్ ఆడటం ఖాయమే. కుల్దీప్ యాదవ్ స్థానంలో గుర్‌నూర్ బ్రార్‌కు భారత టెస్టు జట్టులో స్థానం దక్కిన నేపథ్యంలో బ్రార్ చివరి వన్డేకు దూరమయ్యాడు. దీంతో సిరాజ్, అర్‡్షదీప్, ఆఖిబ్ నబీ పేస్ బాధ్యతలు పంచుకోనున్నారు. గత మ్యాచ్‌లో భారీగా పరుగులు సమర్పించుకున్న కుల్దీప్ యాదవ్‌పై తీవ్ర ఒత్తిడి ఉండనుంది.
హెన్రీ, జెమీసన్ దూరం
ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్‌పై దృష్టి పెట్టిన న్యూజిలాండ్ ఇప్పటికే ఈ సిరీస్‌లో 18 మంది ప్లేయర్లను బరిలోకి దింపింది. ఇప్పుడు హెన్రీ, జెమీసన్ కూడా దూరం అవడంతో వారి స్థానాలను జాకబ్ డఫీ, టిక్నర్ భర్తీ చేసే అవకాశాలున్నాయి. బ్యాటింగ్‌లో విల్ యంగ్, టీమ్ సీఫెర్ట్, నిక్ కెల్లీ, ఫిన్ అలెన్, బ్రాస్‌వెల్ కీలకం
కానున్నారు. కెప్టెన్ సాంట్నర్ అటు బంతితో, ఇటు బ్యాట్‌తో జట్టు విలువ పెంచుతున్నాడు. గత మ్యాచ్‌లో మూడు వికెట్లు తీసిన ఫిషర్, డఫీ, టిక్నర్ పేస్ భారం మోయనున్నారు. స్వింగ్‌కు అనుకూలించే పిచ్‌పై కివీస్ పేస్ దళాన్ని సమర్థంగా ఎదుర్కొంటేనే భారత జట్టు పైచేయి సాధించే అవకాశాలున్నాయి.


