పాక్‌లో 'ధురంధర్‌'.. అజ్ఞాతంలోకి హఫీజ్ సయీద్, మసూద్ అజార్‌ | Hafiz Saeed, Masood Azhar Moved To Pak Safe Houses | Sakshi
Sakshi News home page

పాక్‌లో 'ధురంధర్‌'.. అజ్ఞాతంలోకి హఫీజ్ సయీద్, మసూద్ అజార్‌

Nov 15 2026 3:30 AM | Updated on Nov 15 2026 3:30 AM

Hafiz Saeed, Masood Azhar Moved To Pak Safe Houses

ఇస్లామాబాద్‌ : భారత్‌ మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టులుగా ప్రకటించిన లష్కరే తోయిబా వ్యవస్థాపకుడు హఫీజ్ సయీద్, జైషే మహ్మద్ చీఫ్ మసూద్ అజార్‌లకు పాకిస్తాన్‌లో కొత్త భయం పట్టుకుంది.

కొద్దికాలంగా పాకిస్తాన్‌లోని వివిధ ప్రాంతాలలో పలువురు అజ్ఞాత వ్యక్తుల చేతిలో ఉగ్రవాదులు హతమవుతుండటంతో.. వారిద్దరూ ప్రాణభయంతో తమ స్థావరాలను మార్చినట్లు నిఘా వర్గాలు వెల్లడించాయి.

పాకిస్తాన్ గడ్డపై ఆశ్రయం పొందుతున్న ప్రముఖ ఉగ్రవాద మూకల అధిపతులు హఫీజ్ సయీద్, మసూద్ అజార్‌లపై గత కొంతకాలంగా అజ్ఞాత వ్యక్తుల హత్యల పరంపర కలవరం రేపుతోంది. ఇటీవల కాలంలో భారత్‌లో మోస్ట్ వాంటెడ్‌గా ఉన్న పలువురు ఉగ్రవాదులు పాకిస్తాన్‌లో అనుమానాస్పద రీతిలో హత్యకు గురయ్యారు. ఈ పరిణామాలు ఉగ్రవాద శిబిరాల్లో తీవ్ర వణుకు పుట్టిస్తున్నాయి.

ఈ నేపథ్యంలో తమకు ఎప్పుడు, ఎక్కడి నుంచి ప్రమాదం ముంచుకొస్తుందోనన్న భయంతో హఫీజ్ సయీద్ మరియు మసూద్ అజార్‌లు తాము సాధారణంగా ఉండే ప్రాంతాలను విడిచిపెట్టారు. పాకిస్తాన్ గూఢచార సంస్థ ఐఎస్‌ఐ కంట్రోల్‌లో ఉన్న అత్యంత పటిష్టమైన, రహస్య సురక్షిత ప్రాంతాలకు వీరు తమ మకాం మార్చినట్లు ఇంటెలిజెన్స్ వర్గాలు పక్కా సమాచారాన్ని సేకరించాయి. అంతర్జాతీయ ఒత్తిళ్లు, అలాగే గుర్తుతెలియని వ్యక్తుల దాడుల నుంచి ఈ ఉగ్రవాద నేతలను కాపాడుకోవడానికి పాక్ సైన్యం,ఐఎస్‌ఐ  ప్రత్యేక రక్షణ కల్పిస్తున్నట్లు తెలుస్తోంది.

హఫీజ్ సయీద్‌ను లాహోర్ సమీపంలోని పటిష్టమైన సురక్షిత ప్రాంతానికి, అలాగే మసూద్ అజార్‌ను బహావల్‌పూర్‌లోని అత్యాధునిక భద్రతా వలయం ఉన్న రహస్య గృహానికి మార్చినట్లు సమాచారం.

ఈ ఉగ్రనేతలు ప్రస్తుతం బాహ్య ప్రపంచానికి పూర్తిగా దూరంగా ఉంటున్నారని, వారి కదలికలపై అత్యంత కఠినమైన నిఘా ఉంచినట్లు నిఘా వర్గాలు పేర్కొంటున్నాయి.భారత్‌పై నిరంతరం ఉగ్రవాద కుట్రలు పన్నే ఈ కిరాతక మూకల అధిపతులు.. ఇప్పుడు తమ ప్రాణాలను కాపాడుకోవడానికి బిక్కుబిక్కుమంటూ బతుకుతుండటం చర్చాంశనీయంగా మారింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement