పట్టెడన్నం దొరక్క.. ఆకలికి తట్టుకోలేక కుక్క కళేబరం పీక్కుతిన్నాడు | Destitute Man Eating Dead Dog Flesh on Odisha Highway | Sakshi
Sakshi News home page

పట్టెడన్నం దొరక్క.. ఆకలికి తట్టుకోలేక కుక్క కళేబరం పీక్కుతిన్నాడు

Nov 15 2026 12:54 AM | Updated on Nov 15 2026 12:54 AM

Destitute Man Eating Dead Dog Flesh on Odisha Highway

భువనేశ్వర్‌ : ఒడిశాలోని సంబల్‌పూర్ జిల్లాలో దయనీయ ఘటన వెలుగులోకి వచ్చింది. తీవ్ర ఆకలి, మానసిక వైకల్యంతో  బాధపడుతున్న  ఓ వ్యక్తి రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన కుక్క కళేభరాన్ని తింటున్న హృదయ విదారక  దృశ్యాలు స్థానికులను,చూపరులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేశాయి.

ఒడిశాలోని సంబల్‌పూర్ జిల్లా, మనేశ్వర్ చౌక్ సమీపంలో రోడ్డు దాటుతున్న కుక్కను వాహనం ఢీకొట్టింది. దీంతో ఆ కుక్క అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. అదే సమయంలో అటుగా వెళ్తున్న స్థానికులకు కుక్క కళేబరం వద్ద ఓ వ్యక్తి కూర్చొని ఉండటాన్ని గమనించారు. రోడ్డుపై చనిపోయి ఉన్న కుక్క కళేబరం దగ్గర కూర్చుని, దాని మాంసాన్ని పీక్కు తింటున్న భయానక దృశ్యాన్ని చూసి ప్రయాణికులు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు.

ఆ వ్యక్తి శారీరక రూపురేఖలు, మానసిక ప్రవర్తనను గమనించిన స్థానికులు.. ఆకలి, ఆహారం దొరక్క అత్యంత దయనీయమైన స్థాయికి దిగజార్చేలా చేసిందని భావిస్తున్నారు.

స్థానికులు కొందరు అతన్ని ఆపే ప్రయత్నం చేసినప్పటికీ, అతను వారి మాటలను పట్టించుకోకుండా అలాగే తింటూనే ఉన్నాడు. ఈ అమానుష ఘటన సమాజంలో నెలకొన్న పేదరికం, ఆకలి కేకలు, నిరాశ్రయుల దుస్థితిని కళ్లకు కడుతోంది.

ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రోడ్లపై నివసించే నిరాశ్రయులకు కనీస ఆహార భద్రత, రక్షణ కల్పించడంలో అధికార యంత్రాంగం వైఫల్యంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

ఈ దయనీయ ఘటనపై స్థానిక యంత్రాంగం తక్షణమే స్పందించి, ఆ వ్యక్తిని గుర్తించాలని స్థానికులు కోరుతున్నారు. అతనికి సురక్షితమైన ఆశ్రయం, కడుపు నిండా ఆహారం అందేలా చూడటంతో పాటు, తగిన వైద్య పరీక్షలు,  పునరావాసం కల్పించాలని కోరుతూ అధికారులు, స్వచ్ఛంద సంస్థలకు విజ్ఞప్తి చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement