సాధారణంగా కుక్కలను పెంచుకునేవారు, వాటిని రోజూ వాకింగ్‌కు తీసుకెళ్తుంటారు. కానీ.. అమెరికాలో మాత్రం ఇప్పుడు ట్రెండ్ మారింది. అక్కడ కుక్కలకు బదులుగా.. రోబో కుక్కలను వాకింగ్‌కు తీసుకెళ్లేందుకు మనుషులను ఉద్యోగంలోకి తీసుకుంటున్నారు. దీనికోసం గంటకు 20 డాలర్లు.. అంటే మన కరెన్సీలో సుమారు రూ.1,900 చెల్లిస్తున్నారు. వినడానికి ఇది కాస్త వింతగా ఉన్నప్పటికీ.. అమెరికాకు చెందిన ఓ స్టార్టప్ నిజంగానే ఇలాంటి ఉద్యోగాలను ప్రకటించింది.
డైమెన్షనల్ (Dimensional) అనే స్టార్టప్ శాన్ ఫ్రాన్సిస్కో నగర వీధుల్లో రోబో కుక్కలను నడిపించేందుకు మనుషుల కోసం వెతుకుతోంది. ది న్యూయార్క్ టైమ్స్ కథనం ప్రకారం.. ఈ ఉద్యోగంలో చేరినవారు రోజుకు నాలుగు నుంచి ఆరు గంటల పాటు రోబో కుక్కలను బయట నడిపించాల్సి ఉంటుంది.
అనుభవం అవసరం లేదు
ఈ ఉద్యోగానికి అప్లై చేయాలంటే రోబోటిక్స్‌లో అనుభవం ఉండాల్సిన అవసరం లేదని కంపెనీ స్పష్టం చేసింది. బయట ఎక్కువసేపు నడవగలగాలి, స్మార్ట్‌ఫోన్ ఉపయోగించడం తెలిసి ఉండాలి. అలాగే సుమారు 15 కిలోల బరువున్న రోబో కుక్కను జాగ్రత్తగా నిర్వహించగలగాలి.
రోబోలను ఎలా ఆపరేట్ చేయాలి?, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?, ఎక్కడ నడిపించాలి?, అనే వివరాలను కంపెనీయే అందిస్తుంది. ఒక్కో షిఫ్ట్ నాలుగు నుంచి ఆరు గంటల పాటు ఉంటుంది. ఇందుకు గంటకు 20 డాలర్లు చెల్లిస్తారు. అంటే.. రోజుకు 6 గంటలు పనిచేస్తే సుమారు రూ.11,400 వరకు సంపాదించవచ్చన్నమాట.
ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. ఈ రోబో కుక్కలను సరదా కోసం వీధుల్లో తిప్పడం లేదు. భవిష్యత్తులో మనుషుల సహాయం లేకుండానే రోడ్లపై తిరిగేలా వాటికి శిక్షణ ఇవ్వడమే కంపెనీ అసలు లక్ష్యం. ఈ రోబో కుక్కల్లో కెమెరాలు, సెన్సార్లు ఉంటాయి. ఇవి చుట్టూ ఉన్న పరిసరాలను గమనిస్తూ సమాచారాన్ని సేకరిస్తాయి. రోడ్లపై ఉన్న అడ్డంకులు, భవనాలు, మనుషులు, ఇతర వస్తువులను గుర్తించడానికి ఈ డేటా ఉపయోగపడుతుంది.
100 రోబో డాగ్స్.. 50 హ్యూమనాయిడ్ రోబోలు!
డైమెన్షనల్ సంస్థ రోబోటిక్స్ రంగంలో పెద్ద ప్రణాళికలతో ముందుకెళ్తోంది. ఇందులో భాగంగా.. చైనా, జర్మనీ, అమెరికా కంపెనీల నుంచి ఏకంగా 100 రోబో కుక్కలు, 50 హ్యూమనాయిడ్ రోబోలను కొనుగోలు చేసింది.
శాన్ ఫ్రాన్సిస్కో వీధుల్లో కనిపిస్తున్న రోబో కుక్కలను చైనాకు చెందిన యూనిట్రీ కంపెనీ నుంచి కొనుగోలు చేశారు. ఒక్కో రోబో కుక్క ధర సుమారు 2,000 డాలర్లు. వీటిని రిమోట్ లేదా మొబైల్ యాప్ ద్వారా కంట్రోల్ చేయవచ్చు.
AIకి కూడా ఇంకా మనుషుల సాయం అవసరమే!
ప్రస్తుతం AI ఏజెంట్లు రోబోలకు ఆదేశాలు ఇవ్వగలుగుతున్నప్పటికీ.. వాటి హార్డ్‌వేర్‌ను పూర్తిస్థాయిలో నియంత్రించడంలో ఇంకా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని, రోబో డాగ్ వాకింగ్ ప్రయోగం ద్వారా AI ఏజెంట్లు ఇప్పటికీ రోబోలను నియంత్రించడంలో చాలా వెనుకబడి ఉన్నాయని డైమెన్షనల్ వ్యవస్థాపకుడు స్టాష్ పొమిచ్టర్ వెల్లడించారు. కాబట్టి AIకి కూడా ఇంకా మనుషుల సాయం అవసరమే అని స్పష్టం చేశారు.
ఇదీ చదవండి: దిగొచ్చిన బంగారం.. కొనేందుకు మంచి తరుణం!


