టెక్నాలజీ సాయంతో జెన్‌జీ ఉద్యోగాన్వేషణ
రెజ్యూమే రూపకల్పన నుంచి ఇంటర్వ్యూల వరకు..
అభ్యర్థుల ఎంపికలో ఏఐ టూల్స్ వాడుతున్న కంపెనీలు
సాక్షి, హైదరాబాద్: ప్రస్తుతం గ్లోబల్ జాబ్ మార్కెట్ సరికొత్త సాంకేతిక విప్లవాన్ని చవిచూస్తోంది. ఒకప్పుడు ఖాళీ పోస్టుల భర్తీ అంటే కంపెనీలకు నెలల తరబడి సాగే ఒక పెద్ద ప్రహసనం. అభ్యర్థులకు కూడా నచ్చిన ఉద్యోగం సంపాదించడం అగమ్యగోచర ప్రయాణం. ఇప్పుడు కృత్రిమ మేధ (ఏఐ) సాంకేతికత రిక్రూట్‌మెంట్ ప్రక్రియను మూలాల నుంచి మార్చేస్తోంది. అటు ఉద్యోగార్థులకు, ఇటు కార్పొరేట్ కంపెనీలకు ఈ సాంకేతికత ఒక వేగవంతమైన వరంలా మారింది. అయితే ఈ సాంకేతికత రిక్రూట్‌మెంట్‌ను ఎంతలా సరళతరం చేసిందో, అదే స్థాయిలో అల్గారిథమిక్ బయాస్, మానవీయ స్పర్శ కరువవ్వడం వంటి సరికొత్త సవాళ్లను కూడా విసురుతోంది.
టెక్నాలజీ వాడుకలో ముందు...
ప్రస్తుత యువతరం సాంకేతికతను వాడుకోవ డంలో అందరికంటే ముందుంది. వీరు కేవలం పాత పద్ధతుల్లో రెజ్యూమే పంపి ఊరుకోవడం లేదు. ఉద్యోగ వేటను సులభతరం చేసుకోవడానికి కృత్రిమ మేధ సాధనాలను విస్తృతంగా వాడుతోంది. కంపెనీల ఆటోమేటెడ్ వడపోత యంత్రాలను దాటి తమ ప్రొఫైల్ ముందంజలో ఉండేలా, ఈ సాంకేతికత సాయంతో రెజ్యూమేను ఆకర్షణీయంగా తీర్చిదిద్దుకుంటోంది. కంప్యూటర్ ఆధారిత నమూనా ఇంటర్వ్యూల ద్వారా సాధన చేస్తూ, మాట్లాడే నైపుణ్యాన్ని, ఆత్మవిశ్వాసాన్ని మెరుగుపరుచుకుంటోంది. కంపెనీ అవసరాలకు, వారు కోరే అర్హతలకు తగినట్లుగా నిమిషాల వ్యవధిలోనే ప్రత్యేకమైన కవర్ లెటర్లను తయారు చేసుకుంటోంది.
వడపోత నుంచి ఎంపిక వరకు..
కంపెనీల హెచ్‌ఆర్ విభాగాలు కూడా అభ్యర్థుల ఎంపిక కోసం ఏఐపైనే ఎక్కువగా ఆధారపడుతున్నాయి. దీనిద్వారా వేల సంఖ్యలో వచ్చే దరఖాస్తులను మానవ శ్రమ లేకుండా పరిశీలిస్తోంది. అభ్యర్థి నైపుణ్యాలు ఉద్యోగ అర్హతలకు సరిపోతాయో లేదో ఈ సాంకేతికత క్షణాల్లో గుర్తిస్తుంది. ఒక అభ్యర్థి కంపెనీలో ఎంతకాలం కొనసాగగలడు, వారి గత రికార్డు ఆధారంగా భవిష్యత్తులో ఎలా రాణించగలడు అనేది ఈ సాఫ్ట్‌వేర్ అంచనా వేస్తుంది. అభ్యర్థుల ప్రాథమిక వివరాల సేకరణ, ఇంటర్వ్యూల సమయాన్ని ఖరారు చేయడం వంటి పనులను చాట్‌బాట్స్ చూసుకుంటున్నాయి.
సమతూకంలో వాడుకున్నప్పుడే..
ఏఐ అనేది ఉద్యోగ ఎంపికను కేవలం ఒక సాంకేతిక ప్రక్రియగా మార్చడమే కాకుండా, అభ్యర్థులు తమ నైపుణ్యాలను నిరంతరం పెంచుకోవాల్సిన అవసరాన్ని గుర్తుచేస్తోంది. టెక్నాలజీ ఎంత పెరిగినా, చివరి దశలో మానవ పరిశీలన తప్పనిసరి. సాంకేతికతను, మానవ మేధస్సును సమతూకంలో వాడుకున్నప్పుడే కంపెనీలకు సరైన అభ్యర్థులు లభిస్తారు. భవిష్యత్ ఉద్యోగ మార్కెట్‌లో నిలదొక్కుకోవాలంటే సాంకేతికతను వ్యతిరేకించడం కాదు, దానిని ఉపయోగించుకోవడంలో నైపుణ్యం సాధించడమే ఏకైక మార్గం.
ఇవీ ప్రయోజనాలు..
⇒ నియామక ప్రక్రియకు పట్టే సమయం దాదాపు 60 శాతం వరకు తగ్గింది.
⇒ కంపెనీలకు అభ్యర్థుల వేటలో, ప్రకటనలలో అయ్యే ఖర్చులు భారీగా తగ్గాయి.
⇒ లింగ, ప్రాంతీయ భేదాలు లేకుండా కేవలం ప్రతిభ, నైపుణ్యాల ఆధారంగానే ప్రాథమిక ఎంపిక జరుగుతుంది.
⇒ ఉద్యోగార్థులకు తమ అర్హతలకు సరిపోయే ఉద్యోగాల సమాచారం కంప్యూటర్ల ద్వారా ఆటోమేటిక్‌గా లభిస్తోంది.
పొంచి ఉన్న ఇబ్బందులు..
⇒ ఈ సాంకేతికతకు నేరి్పంచే డేటాలో లోపాలు ఉంటే, అది తప్పుడు లేదా పక్షపాతంతో కూడిన నిర్ణయాలు తీసుకునే ప్రమాదం ఉంది. కొన్ని నిర్దిష్ట పదాలు దరఖాస్తు పత్రంలో లేకపోతే ప్రతిభ ఉన్న అభ్యర్థుల దరఖాస్తులు తిరస్కరణకు గురవుతున్నాయి.
⇒ ఉద్యోగార్థుల వ్యక్తిగత సమాచారం ఇతరుల చేతుల్లోకి వెళ్లే అవకాశం ఉంది.
⇒ సాంకేతికత సాయంతో కొందరు అభ్యర్థులు తప్పుడు సమాచారంతో ఆకర్షణీయ పత్రాలతో కంపెనీలను తప్పుదోవ పట్టిస్తున్నారు.
దిగ్గజ కంపెనీల వ్యూహాలు
గూగుల్: తమ అంతర్గత నియామక ప్రక్రియల్లో అభ్యర్థుల నైపుణ్యాలను కచ్చితత్వంతో అంచనా వేయడానికి అధునాతన ఏఐ నమూనాలను
వాడుతోంది. ఇది ప్రతిభ గల అభ్యర్థులను వేగంగా గుర్తిస్తుంది.
అమెజాన్: భారీ ఎత్తున వచ్చే దరఖాస్తుల పరిశీలన కోసం స్వయంచాలక సాఫ్ట్‌వేర్‌ను వాడుతోంది. ఇది రిక్రూటర్ల సమయాన్ని భారీగా ఆదా చేస్తుంది.
మైక్రోసాఫ్ట్: వృత్తిపర సామాజిక మాధ్యమ వేదికల్లో ఉన్న స్మార్ట్ టూల్స్ ద్వారా కంపెనీలకు సరిగ్గా సరిపోయే నిపుణుల సమూహాన్ని సులభంగా
ఫిల్టర్ చేస్తోంది.
యూనిలీవర్: అభ్యర్థుల డిజిటల్ ఇంటర్వ్యూలను విశ్లేషించడానికి ఏఐను వాడుతోంది. అభ్యర్థి మాట్లాడే విధానం, ముఖ కవళికలను బట్టి వారి వ్యక్తిత్వ నైపుణ్యాలను ఇది అంచనా వేస్తుంది.
టీసీఎస్: ఏటా లక్షలాది మంది కొత్త గ్రాడ్యుయేట్లను విధుల్లోకి తీసుకునేందుకు స్మార్ట్ పరీక్షా విధానాలను, ఏఐ ఆధారిత వడపోతను పెద్ద ఎత్తున ఉపయోగిస్తోంది.


