మిల్లర్లతో అధికారుల మిలాఖత్.. రూ.వేల కోట్ల ప్రజాధనం హాంఫట్
డీసీఎస్‌ఓలు, సంస్థ డీఎంల అండతోనే రూ.వేల కోట్లు లూటీ చేసిన మిల్లర్లు
రూ.3,960 కోట్ల సీఎంఆర్ బకాయిలు.. వసూళ్ల కోసం సర్కార్ తంటాలు
సీఐడీ, విజిలెన్స్ దాడులతో బయటపడుతున్న బాగోతం
నిజామాబాద్ డీఎస్‌ఓ శ్రీకాంత్‌రెడ్డి అరెస్టు, సస్పెన్షన్‌తో బహిర్గతమైన అక్రమ మూలాలు
త్వరలో మరికొందరు జిల్లా అధికారుల సస్పెన్షన్, అరెస్టులకు రంగం సిద్ధం
సాక్షి, హైదరాబాద్: పేదల పళ్లెంలోకి చేరాల్సిన బియ్యం.. మిల్లర్ల గోదాముల నుంచి బహిరంగ మార్కెట్‌కు వెళుతోంది. రైతుల నుంచి మద్దతు ధరకు కొన్న ప్రభుత్వ ధాన్యాన్ని కస్టమ్ మిల్లింగ్‌కు తీసుకున్న కొందరు రైస్ మిల్లర్లు, వారికి కాపలాగా ఉండాల్సిన పౌరసరఫరాల అధికారులు కలిసి రాష్ట్ర ఖజానాకు భారీగా గండి కొట్టారు. రాష్ట్రంలోని 32 జిల్లాల్లో పౌరసరఫరాల శాఖ నుంచి జిల్లా పౌర సరఫరాల అధికారి (డీసీఎస్‌ఓ), పౌరసరఫరాల సంస్థ నుంచి జిల్లా మేనేజర్ (డీఎం) ధాన్యం కొనుగోళ్లు, మిల్లులకు కేటాయింపు, సీఎంఆర్ ఎఫ్‌సీఐకి అప్పగించడం వరకు పర్యవేక్షిస్తారు.
ఇక్కడే అక్రమాలకు తెరలేస్తోంది. మిల్లర్లు డీసీఎస్‌ఓలు, డీఎంలతో మిలాఖత్ కావడంతోనే మిల్లర్లు వేల కోట్ల రూపాయలను దిగమింగినట్లు తెలుస్తోంది. కేవలం 2022–23 సీజన్‌కు సంబంధించే 360 మందికి పైగా మిల్లర్లు ఇంకా రూ.3,960 కోట్ల మేర బకాయి పడ్డారని ఇప్పటికే ప్రభుత్వమే హైకోర్టుకు నివేదించింది. ఒక్కో మిల్లు రూ.1 కోటి నుంచి రూ.100 కోట్ల వరకు బకాయి ఉండటం అక్రమాల తీవ్రతకు అద్దం పడుతోంది. కామారెడ్డి, నిజామాబాద్, నల్లగొండ, పెద్దపల్లి, సూర్యాపేట, కరీంనగర్, ములుగు, మంచిర్యాల, భూపాలపల్లి తదితర జిల్లాలు ఈ జాబితాలో అగ్రస్థానంలో ఉన్నాయి. నిజామాబాద్ జిల్లా డీసీఎస్‌ఓ శ్రీకాంత్‌రెడ్డిని పౌరసరఫరాల శాఖ కమిషనర్ సస్పెండ్ చేయడంతో శాఖలో వేళ్లూనుకుపోయిన అధికారుల అవినీతి త్వరలోనే వెలుగు చూడనుంది.
పదేళ్లలో రూ.13,399 కోట్ల తేడా!
రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి సీఎంఆర్ ప్రక్రియలో 59.96 లక్షల టన్నుల బియ్యానికి సంబంధించి రూ.13,399 కోట్ల విలువైన లెక్కల తేడాలు ఉన్నట్లు పౌరసరఫరాల శాఖ లెక్కల్లో తేలింది. ఇందులో ఇప్పటివరకు రూ.6,365 కోట్ల విలువైన 30.16 లక్షల టన్నుల బియ్యాన్ని, దానికి సమానమైన మొత్తాన్ని మాత్రమే తిరిగి రాబట్టగలిగారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోనే 130 మందికి పైగా మిల్లర్లు రూ.859 కోట్ల బియ్యం ఇంకా తిరిగి ఇవ్వలేదు.
ప్రభుత్వ ధాన్యాన్ని బహిరంగ మార్కెట్‌లో, ఇతర రాష్ట్రాల్లో ఎక్కువ ధరకు అమ్ముకోవడం..రేషన్ దుకాణాల నుంచి పీడీఎస్ బియ్యాన్ని తక్కువ ధరకు కొని రీసైక్లింగ్ చేసి సీఎంఆర్‌గా తిరిగి అప్పగించడం..సన్నబియ్యం స్థానంలో దొడ్డుబియ్యం సరఫరా చేయడం.. ఇవీ మిల్లర్ల ప్రధాన ఎత్తుగడలు. మిల్లుల్లో నిల్వలు, రికార్డులు, నాణ్యత, రవాణాను తనిఖీ చేయాల్సిన డీఎస్‌ఓలు, జిల్లా మేనేజర్లు పూర్తిస్థాయిలో మిల్లర్లకు సహకరించడంతోనే ఈ దందా నిరాటంకంగా సాగిందనే ఆరోపణలున్నాయి. ధాన్యం కేటాయింపు నుంచి లారీ బియ్యం నాణ్యత పాస్ చేయడం వరకు ప్రతి దశకూ ఓ ‘రేటు’ఉందని, ఓ జిల్లా స్థాయి అధికారికి ఏటా కోట్లలో ఆదాయం వస్తోందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
తనిఖీలకు వెళ్లకుండా..
కామారెడ్డి జిల్లా పౌరసరఫరాల కార్యాలయంపై ఈ ఏడాది జనవరిలో ఏసీబీ జరిపిన దాడి అధికారుల నిర్లక్ష్యాన్ని బట్టబయలు చేసింది. పలు ఖరీఫ్ సీజన్లలో మిల్లర్లు బియ్యం ఎగ్గొట్టినా చర్యలు శూన్యమని, 2025 సెపె్టంబర్ నుంచి డీఎస్‌ఓ, జిల్లా మేనేజర్ కనీసం ఒక్క మిల్లునూ, ఎంఎల్‌ఎస్ పాయింట్‌నూ తనిఖీ చేయలేదని ఏసీబీ గుర్తించింది. దీనివల్ల ఖజానాకు రూ.44.14 కోట్ల నష్టం వాటిల్లినట్లు తేలి్చంది. ఓ డేటా ఎంట్రీ ఆపరేటర్ అనుమానాస్పద లావాదేవీలపైనా విచారణ జరుగుతోంది.
అలాగే మహబూబాబాద్ జిల్లా పౌరసరఫరాల సంస్థ మేనేజర్ వాసంశెట్టి నరసింహారావుకు సంబంధించి ఖమ్మం, మహబూబాబాద్, సూర్యాపేట, హైదరాబాద్‌లోని ఏడు చోట్ల ఏసీబీ ఏకకాలంలో సోదాలు నిర్వహించింది. ప్రభుత్వ లెక్కల ప్రకారమే రూ.9.41 కోట్ల అక్రమాస్తులు గుర్తించి ఆయనను అరెస్టు చేసింది. బహిరంగ మార్కెట్ విలువ ప్రకారం ఇవి రూ.100 కోట్లకు పైనే ఉంటాయని అంచనా. ఖమ్మంలో విలాసవంతమైన ఇళ్లు, భార్య పేరిట ఖరీదైన ప్లాట్లు బయటపడ్డాయి.
నిజామాబాద్‌లో వరుస సస్పెన్షన్లు
పీడీఎస్ బియ్యం మళ్లింపు, బకాయి మిల్లర్లపై పర్యవేక్షణ లోపం, నెలవారీ క్షేత్ర తనిఖీలు చేయకపోవడంపై విజిలెన్స్ నివేదిక ఆధారంగా నిజామాబాద్ డీఎస్‌ఓ కె.శ్రీకాంత్‌రెడ్డిని కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర శనివారం సస్పెండ్ చేశారు. ఇదే జిల్లాలో గతంలో రూ.75 కోట్ల బియ్యం కుంభకోణంలో డీఎస్‌ఓ చంద్రప్రకాశ్, డీఎం జగదీశ్‌కుమార్ సస్పెండయ్యారు. తాజాగా రూ.200 కోట్ల సీఎంఆర్ అక్రమాల్లో సీఐడీ నలుగురు మిల్లర్లను అరెస్టు చేయగా, మరో ఇద్దరు పరారీలో ఉన్నారు.
2025–26 ఖరీఫ్‌లో ఎఫ్‌సీఐకి పంపాల్సిన సన్నబియ్యం స్థానంలో దొడ్డుబియ్యం, అదీ కొంత ఇతర రాష్ట్రాల నుంచి తెచ్చి సరఫరా చేసినట్లు సీఐడీ గుర్తించింది. మూడు కేసులు నమోదు చేసి 14 మంది మిల్లర్లను అరెస్టు చేసింది. 45,414 టన్నుల కేటాయింపుల్లో రూ.242 కోట్ల బోనస్ ప్రభావం ఉండొచ్చని అంచనా. అయితే పౌరసరఫరాల శాఖ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర 7 జిల్లాల్లోని 48 మిల్లులపై సీఐడీకి సమాచారం ఇవ్వగా కేవలం మూడు జిల్లాల్లోని 16 మిల్లులపైనే సీఐడీ అధికారులు దాడులు చేశారు. మిగతా జిల్లాల్లోని మిల్లులపై కూడా దాడులు సాగనున్నాయి.
త్వరలోనే మరికొందరి అరెస్టు
మిల్లర్లతో మిలాఖత్ అయి రూ. వేలకోట్ల ధాన్యాన్ని, బియ్యం మాయం కావడానికి పరోక్షంగా కారకులైన జిల్లాల సీఎస్‌ఓ, మేనేజర్‌లపై చర్యలకు కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర రంగం సిద్ధం చేశారు. జిల్లాల వారీగా బకాయిల వివరాలతో పాటు ఏయే మిల్లర్లతో ఏ మేరకు కుమ్మక్కయ్యారనే ఆధారాలను సేకరించి, శాఖ పరమైన చర్యలతో పాటు స్థానిక పోలీస్‌స్టేషన్‌లలో కేసులు నమోదు చేయించే ఆలోచనతో ఉన్నట్లు సమాచారం. అలాగే మిల్లర్ల నాయకులుగా చెలామణి అవుతూ రూ.వందల కోట్లు ఎగవేసిన కొందరు మిల్లర్లపై ప్రత్యేక దృష్టి పెట్టారు.


