గచ్చిబౌలి జీఎంసీ బాలయోగి అథ్లెటిక్ స్టేడియంలో నిర్వహణ
అగ్నివీర్ జనరల్ డ్యూటీ, టెక్నికల్, ట్రేడ్స్‌మెన్ విభాగాల్లో ఎంపికలు
సాక్షి, హైదరాబాద్: భారత సైన్యంలో అగ్నివీరుల నియామకానికి సంబంధించి ఈనెల 13 నుంచి 24 వరకు ఆర్మీ రిక్రూట్‌మెంట్ ర్యాలీ నిర్వహించనున్నారు. గచి్చబౌలిలోని జీఎంసీ బాలయోగి అథ్లెటిక్ స్టేడియంలో ఈ ర్యాలీ జరగనుంది. తెలంగాణలోని మొత్తం 33 జిల్లాలకు చెందిన అభ్యర్థులు ఈ ఎంపిక ప్రక్రియలో పాల్గొనేందుకు అవకాశం కల్పించారు. అగ్నివీర్ జనరల్ డ్యూటీ, అగ్నివీర్ టెక్నికల్, అగ్నివీర్ ట్రేడ్స్‌మెన్ (10వ తరగతి ఉత్తీర్ణత), అగ్నివీర్ ట్రేడ్స్‌మెన్ (8వ తరగతి ఉత్తీర్ణత) విభాగాల్లో అభ్యర్థులను పరీక్షించనున్నారు.
2027 నియామక సంవత్సరానికి సంబంధించిన ర్యాలీ నోటిఫికేషన్ ప్రకారం అడ్మిట్ కార్డులు పొందిన అభ్యర్థులు తమ ఒరిజినల్ ధ్రువపత్రాలన్నింటినీ వెంట తీసుకురావాలని ఆర్మీ అధికారులు ఆదివారం ఒక ప్రకటనలో సూచించారు. ఆర్మీ నియామక ప్రక్రియ పూర్తిగా ఆటోమేటెడ్, నిష్పక్షపాతంగా, పారదర్శకంగా జరుగుతుందని స్పష్టం చేశారు.
ఉద్యోగం ఇప్పిస్తామని, ఎంపిక చేయిస్తామని చెప్పే దళారులు, మోసగాళ్ల మాటలు నమ్మొద్దని హెచ్చరించారు. నియామక ప్రక్రియలో ఏజెంట్లు, మధ్యవర్తుల ప్రమేయం ఉండదన్నారు. నియామకాలకు సంబంధించిన సందేహాల నివృత్తి కోసం సికింద్రాబాద్ ఆర్మీ రిక్రూట్‌మెంట్ కార్యాలయాన్ని 040–27740059 ఫోన్ నంబర్‌లో సంప్రదించాలని సూచించారు. మరిన్ని వివరాలకు www.joinindianarmy.nic.in వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చని తెలిపారు.


