ఆదిలాబాద్ రైతు గర్జన సభలో కేటీఆర్ ఫైర్
రాష్ట్రంలో రైతులు వ్యవసాయం చేసుకునే పరిస్థితి లేదు
నీళ్లు, కరెంట్, పరిశ్రమలు, పథకాలు అన్నీ బంద్ చేసిన్రు
కేసీఆర్‌లో.. కే అంటే కాలువలు, సీ అంటే చెరువులు, ఆర్ అంటే రిజర్వాయర్లు.. కాంగ్రెస్ అంటే కరువు, కన్నీళ్లు, వలసలు అని ధ్వజం
సాక్షి, ఆదిలాబాద్: ‘యాసంగి పంట వేస్తే ఆ తప్పు నాది.. ప్రభుత్వానిది కాదంటూ రైతు సెల్ఫ్ డిక్లరేషన్ ఇవ్వాలని కాంగ్రెస్ ప్రభుత్వం చెబుతోంది. రాష్ట్రంలో రైతులు వ్యవసాయం చేసుకునే పరిస్థితి కూడా లేకుండా పోయింది. కేసీఆర్ పాలనలో రైతుల పరిస్థితి బ్రహ్మాండంగా ఉండేది. పుట్లకొద్దీ వడ్లు పండించారు. ఇçప్పుడు దుక్కి దున్నొద్దు.. భూములను పడావు పెట్టుకోవాలని చెప్పే పరిస్థితి వచ్చింది. నీళ్లు బంద్.. పరిశ్రమలు బంద్.. కరెంట్ బంద్.. చివరకు వ్యవసాయం కూడా బంద్..రాజ్యమేలుతున్నది ‘రాబంద్’..’ అని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. మాజీ మంత్రి జోగు రామన్న ఆధ్వర్యంలో ఆదివారం సాయంత్రం ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో నిర్వహించిన రైతు గర్జన సభలో ఆయన ప్రసంగించారు.
కాళేశ్వరం వాడుకుంటే కరువుండదు..!
‘ఎల్ నినో ఉత్త ముచ్చట.. అది వేరేవాళ్లకు ఉండవచ్చు.. కేసీఆర్ కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు నీళ్లను వాడుకుంటే అసలు తెలంగాణలో కరువే ఉండదు.. కే అంటే కాలువలు.. సీ అంటే చెరువులు.. ఆర్ అంటే రిజర్వాయర్లు.. కాంగ్రెస్ అంటే కరువు, కన్నీళ్లు, వలసలు.. అందుకే ఇది కాలం తెచ్చిన కరువు కాదు.. కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిన కరువు. దీనికి రేవంత్‌రెడ్డిదే బాధ్యత..ఎనుకటి రోజులు తెస్తామని సీఎం గతంలో అన్నారు.. అన్నట్టే చేశారు.. కరువు రాక్షసిని మళ్లీ తీసుకొచ్చారు. చంద్రబాబు నాయుడు కుప్పంకు నీళ్లు తీసుకుపోయాడు. పక్కనే ఉన్న పాలమూరుకు రేవంత్ నీళ్లు ఇవ్వలేకపోయాడు. తెలంగాణ కంటే రెండింతల వర్షపాతం లోటు ఉన్న ఏపీ, కర్ణాటకలో లేని కరువు తెలంగాణలో ఎందుకు వచ్చింది? రైతులు ఒక్క సంవత్సరం ధైర్యంగా ఉండాలి. రైతు గర్జన వరుస సభలను నిర్వహిస్తాం. కేసీఆర్ ముఖ్యమంత్రి కాబోతున్నారు. ఆయన నాయకత్వంలో ఆదుకుంటాం..’ అని కేటీఆర్ తెలిపారు.
రాష్ట్రాన్ని నడుపుతున్నది నల్లమల పిల్లి
‘ఎన్నికలకు ముందు రైతు డిక్లరేషన్ పేరుతో కాంగ్రెస్ అనేక హామీలు ఇచ్చింది. అధికారంలోకి వచ్చాక వాటిని అమలు చేయడంలో ప్రభుత్వం విఫలమైంది. 21 లక్షల మంది రైతులకు రైతుబంధు అమలు చేయాలి. 36 వేల మందికి ఇందిరమ్మ ఆత్మీయ భరోసా అందిస్తామన్న హామీ ఏమైంది? ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 108 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకోవడం బాధాకరం. తుమ్మిడిహెట్టిపై మహారాష్ట్ర సీఎంతో మాట్లాడేందుకు రేవంత్‌రెడ్డికి మూడేళ్లు పట్టింది. అయినా అది డ్రామానే. కాళేశ్వరం, పాలమూరు– రంగారెడ్డి ప్రాజెక్టులను సక్రమంగా వినియోగించుకుని ఉంటే తెలంగాణలో ఒక ఎకరం కూడా ఎండిపోయే పరిస్థితి ఉండేది కాదు. నీళ్లిస్తే యూరియా ఇవ్వాలి, పంటలు పండితే కొనుగోలు చేయాలి, రైతులకు అండగా నిలవాలి.. అందుకే కాంగ్రెస్ ప్రభుత్వం సాగునీరు అందించడంలో నిర్లక్ష్యం చేస్తోంది. రాష్ట్రాన్ని నడుపుతున్నది నల్లమల పిల్లి..’ అని కేటీఆర్ ఎద్దేవా చేశారు.
రాహుల్ బంధు మాత్రం ఆగలే..
‘రాష్ట్రంలో రైతుబంధు బంద్ అయ్యింది కానీ.. రాహుల్ బంధు మాత్రం బంద్ కాలేదు.. రైతులకు డబ్బులు ఇవ్వడానికి నిధులు లేవని చెబుతున్న ప్రభుత్వం.. ఢిల్లీకి మాత్రం డబ్బులు క్రమం తప్పకుండా పంపుతోంది. ఢిల్లీకి వెళ్లిన ప్రతిసారీ రేవంత్‌రెడ్డి కప్పం కట్టి వస్తున్నారు. కప్పం కట్టకపోతే ఆయన సీఎం పదవి రెన్యువల్ కాదు. బీజేపీ, కాంగ్రెస్ తోడుదొంగలు.. బడే భాయ్..ఛోటే భాయ్ కలిసి తెలంగాణకు అన్యాయం చేస్తున్నారు...’ అని కేటీఆర్ విమర్శించారు. ఎమ్మెల్యేలు అనిల్ జాదవ్, కోవలక్ష్మి, డాక్టర్ సంజయ్, పలువురు మాజీ ఎమ్మెల్యేలు, తదితరులు పాల్గొన్నారు. కాగా జిల్లాలోని తలమడుగు మండలంలో ఇటీవల మరణించిన రైతు కుటుంబాలను కేటీఆర్ పరామర్శించారు. బీఆర్‌ఎస్ తరఫున ఆర్థిక సాయం అందజేశారు.
హైలైట్ చేయడం కోసం..
కాళేశ్వరం వాడుకుంటే కరువుండదు..పేరాలో.. చంద్రబాబు నాయుడు కుప్పంకు నీళ్లు తీసుకుపోయాడు. పక్కనే ఉన్న పాలమూరుకు రేవంత్ నీళ్లు ఇవ్వలేకపోయాడు. తెలంగాణ కంటే రెండింతల వర్షపాతం లోటు ఉన్న ఏపీ, కర్ణాటకలో లేని కరువు తెలంగాణలో ఎందుకు వచ్చింది?


