ఎస్సైకి ఫోన్‌లో వార్నింగ్ ఇస్తున్న ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి
మనసు చంపుకుని నిధులడుగుతున్నా లాభం లేదు
ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి
గట్టుప్పల్: ‘నియోజకవర్గ అభివృద్ధికి నిధులు లేక.. అధికారపక్షంలో ఉన్నా.. నేను ప్రతిపక్ష ఎమ్మెల్యే మాదిరి ప్రభుత్వంపై కొట్లాడుతున్నా..’ అని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి అన్నారు. కాంట్రాక్టర్లు బిల్లులు రాక అప్పులు చేసి ఇబ్బందులు పడుతుంటే, మంత్రి పదవి ఇస్తానని మోసం చేసిన సీఎం రేవంత్‌రెడ్డి దగ్గరకు, అలాగే డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క దగ్గరకు మనసు చంపుకుని వెళ్లినా నేటికీ నిధులు మాత్రం విడుదల చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఆదివారం నల్లగొండ జిల్లా గట్టుప్పల్ మండల కేంద్రంలో బీరప్ప గొర్రెల పెంపకందారుల సహకార సంఘాన్ని ప్రారంభించిన సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు.
ప్రజా జీవితంలో ఎమ్మెల్యేగా గెలి్చందే అభివృద్ధి చేసేందుకని, ఆ అభివృద్ధి చేయలేనప్పుడు ఎమ్మెల్యేగా కొనసాగడం దండగ అని వ్యాఖ్యానించారు. ప్రాజెక్టుల పేరుతో 10 ఏళ్ల పాలనలో కేసీఆర్ చేసిన లక్షల కోట్ల అప్పుల కారణంగానే.. కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుందని చెప్పారు.
బెల్టు షాపులపై చండూరు ఎస్సైకి వార్నింగ్
చండూరు: ‘మండలంలో విపరీతంగా బెల్టు దుకాణాలు నడుస్తుంటే ఏం చేస్తున్నావ్?’ అంటూ ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి.. నల్లగొండ జిల్లా చండూరు ఎస్‌ఐ శివకుమార్‌ను హెచ్చరించారు. శనివారం తుమ్మలపల్లి గ్రామానికి చెందిన ఓ పేద కుటుంబం ఆర్థికంగా ఆదుకోవాలని ఎమ్మెల్యే కోమటిరెడ్డిని హైదరాబాద్ నివాసంలో కలిసి విజ్ఞప్తి చేసింది. మద్యం మహమ్మారి వల్ల ఎన్నో పేద కుటుంబాలు ఛిద్రమైపోతున్నాయని చలించిపోయిన ఆయన, వెంటనే ఎస్సైకి ఫోన్ చేశారు. మండలంలో మొత్తం ఎన్ని బెల్టు షాపులు ఉన్నాయో లెక్కలతో సహా 10వ తేదీలోగా తన వద్దకు రావాలని చెప్పారు. ఈ ఫోన్ సంభాషణను ఎమ్మెల్యే తన అధికారిక సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేయగా వైరల్ అయ్యింది.


