నీటి సమస్యలను అధిగమిస్తాం
నీటి సంరక్షణపనులకు ప్రాధాన్యం
సాక్షి ప్రతినిధి, నల్లగొండ : ఎల్‌నినో ప్రభావం నేపథ్యంలో గ్రామీణ ప్రాంతాల్లో కూలీలకు ఉపాధి కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా వీబీజీ రాంజీ పథకం కింద నల్లగొండ జిల్లాకు అదనంగా 75.88 లక్షల పని దినాలను కేటాయించింది. వచ్చే ఏడాది మార్చి వరకు ఈ పనులు కల్పించనున్నారు. ఇప్పటికే ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి 63 లక్షల పని దినాల లక్ష్యంగా ఇచ్చింది. అందులో మిగిలినవి కలుపుకొని మార్చి వరకు మొత్తంగా 87.98 లక్షల పని దినాలు కల్పించనున్నారు. ఈ అదనపు పనిదినాలతో గ్రామీణ ప్రాంతాల్లో కూలీలకు మరింత ఉపాధి లభించే అవకాశం ఏర్పడింది.
పనులకు 38 వేల మంది కూలీలు
జిల్లాలో ఉపాధి హామీ పథకం కింద సుమారు 3.48 లక్షల జాబ్ కార్డులు ఉన్నాయి. ప్రస్తుతం సుమారు 38 వేల మంది కూలీలు పనులకు వస్తున్నారు. పేదలకు ఉపాధి కల్పించడమే లక్ష్యంగా.. జాబ్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికీ పని కల్పిస్తామని అధికారులు చెబుతున్నారు. అందులో భాగంగా క్షేత్రస్థాయిలో కూలీలను సమీకరించే కార్యక్రమాన్ని చేపట్టారు. ప్రతి నెలా మండలాల వారీగా నిర్దిష్ట పని దినాలను కేటాయించి, అందుకు అనుగుణంగా కూలీలను పనుల్లోకి తీసుకురానున్నారు.
మార్చి వరకు 87.98 లక్షల పని దినాలు లక్ష్యం
వచ్చే ఏడాది మార్చి వరకు జిల్లాలోని 33 మండలాల్లో 87,98,625 పని దినాలు కల్పించేలా అధికారులు కార్యాచరణ రూపొందించారు. మొత్తం 869 గ్రామ పంచాయతీలు, 1,326 ఆవాసాలను ఈ ప్రణాళికలో చేర్చారు. నెలవారీగా పని దినాల లక్ష్యాన్ని పెంచుతూ వెళ్లనున్నారు. అక్టోబర్‌లో ఒక్కో గ్రామ పంచాయతీకి రోజుకు 30 పని దినాలు, నవంబర్‌లో 55, డిసెంబర్‌లో 60, జనవరిలో 70, ఫిబ్రవరిలో 75, మార్చిలో 100 పని దినాల చొప్పున లక్ష్యంగా నిర్దేశించారు. నెలల వారీగా నవంబర్‌లో 11,94,875, డిసెంబర్‌లో 14,07,780, జనవరిలో 15,81,580, ఫిబ్రవరిలో 15,64,200, మార్చిలో 23,46,300 పని దినాలు కల్పించాలని ప్రణాళిక రూపొందించారు.
మిర్యాలగూడ మండలానికి ఎక్కువగా..
మండలాల వారీగా పని దినాల లక్ష్యాలను పరిశీలిస్తే మిర్యాలగూడ మండలానికి అత్యధికంగా 4,65,750 పని దినాలు కేటాయించారు. దేవరకొండకు 4,15,125, గుండ్లపల్లికి 3,94,875, గుర్రంపోడుకు 3,84,750, చింతపల్లికి 3,64,500 పని దినాల లక్ష్యాలు నిర్దేశించారు. నల్లగొండ మండలానికి 3,13,875, నాంపల్లికి 3,24,000, త్రిపురారానికి 3,24,000, కనగల్‌కు 3,13,875 పని దినాల లక్ష్యాలు కేటాయించారు. అత్యల్పంగా గట్టుప్పల్ మండలానికి 70,875 పని దినాల లక్ష్యం ఉంది.
ప్రతి 30 జాబ్ కార్డులకు ఒక మేట్
పనుల నిర్వహణలో కూలీలను సమీకరించడం, వారికి పనులు చూపించడం, నిర్ణీత సమయంలో పనులు పూర్తయ్యేలా చూడడం కోసం ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నారు. ప్రతి 30 జాబ్ కార్డులకు ఒక మేట్‌ను నియమించనున్నారు. వీరు కూలీలను పనులకు తీసుకురావడం, పని ప్రదేశాల్లో వారికి అవసరమైన సూచనలు ఇవ్వడం, పనులు పూర్తయ్యేలా పర్యవేక్షించడం వంటి బాధ్యతలు నిర్వహిస్తారు. ఇందుకోసం జిల్లాలో 3,600 మందిని ఇప్పటికే గుర్తించారు. వీరికి రోజుకు రూ.308 చొప్పున పారితోషికం చెల్లించనున్నారు.
రైతు పొలాల్లో సేద్యపు కుంటలు
వ్యవసాయ భూముల్లో వర్షపు నీటిని నిల్వ చేసుకునేందుకు రైతుల పొలాల్లో సేద్యపు కుంటలు, ఫామ్ పాండ్స్ నిర్మించనున్నారు. గ్రామాల్లో సామూహిక ప్రాంతాల్లో కమ్యూనిటీ సోక్‌పిట్లు, ప్రభుత్వ భవనాలపై పడే వర్షపు నీటిని ఒడిసిపట్టేందుకు రూఫ్‌టాప్ వాటర్ హార్వెస్టింగ్ నిర్మాణాలు చేపట్టనున్నారు. అంతేకాకుండా మురుగు కాలువల చివర డ్రెయిన్ ఎండ్ సోక్‌పిట్లను ఏర్పాటు చేయనున్నారు. ఈ పనులన్నీ ఉపాధి కూలీల భాగస్వామ్యంతో చేపట్టడం ద్వారా ఒకవైపు గ్రామాల్లో నీటి సంరక్షణకు బాటలు వేయడంతోపాటు మరోవైపు కూలీలకు ఉపాధి కల్పించనున్నారు.
ఫ కరువు పరిస్థితుల్లో పేదలకు ఉపాధి కల్పించేలా చర్యలు
ఫ వచ్చే ఏడాది మార్చి వరకు పనుల కల్పన
ఫ జాబ్ కార్డులు ఉన్న ప్రతి ఒక్కరికి పని కల్పించడమే లక్ష్యం
జిల్లాలో కూలీలకు పని కల్పించే చర్యలు చేపట్టాం. క్షేత్రస్థాయిలో కూలీలను సమీకరించి పనులు చేపట్టేందుకు చర్యలు తీసుకుంటున్నాం. కూలీలకు పని కల్పించడంతోపాటు నీటి సంరక్షణ నిర్మాణాలను పూర్తిచేసి రానున్న వేసవిలో గ్రామాల్లో నీటి సమస్య తీవ్రం కాకుండా చూడటమే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశం.
– శేఖర్‌రెడ్డి, డీఆర్‌డీఓ
ఉపాధి పనుల ద్వారా కూలీలకు ఆదాయం కల్పించడంతోపాటు నీటి సంరక్షణకు సంబంధించిన పనులకు ప్రాధాన్యం ఇవ్వనున్నారు. ప్రతి ఇంట్లో ఇంకుడు గుంత నిర్మించే కార్యక్రమాన్ని చేపట్టనున్నారు. ఒక్కో ఇంకుడు గుంత నిర్మాణానికి రూ.6,500 చెల్లించనున్నారు. ఇందులో రూ.1,100 కూలీలకు, మిగిలిన మొత్తం నిర్మాణ సామగ్రికి వినియోగించనున్నారు.


