మరణం అక్కడ.. ధ్రువీకరణ ఇక్కడ! | - | Sakshi
Sakshi News home page

మరణం అక్కడ.. ధ్రువీకరణ ఇక్కడ!

Nov 2 2026 2:05 AM | Updated on Nov 2 2026 2:05 AM

ఫిర్యాదు చేస్తే వాస్తవాలు తేలుస్తాం

నల్లగొండ టూటౌన్‌ : నీలగిరి నగరపాలక సంస్థలో కొందరు ఉద్యోగులు సర్టిఫికెట్ల దందా చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. వైద్య ఆరోగ్య శాఖలో పనిచేసి సూర్యాపేట జిల్లా కేంద్రంలో అనారోగ్యంతో మృతిచెందిన ఓ రిటైర్డ్‌ ఉద్యోగికి నీలగిరి కార్పొరేషన్‌ నుంచి మరణ ధ్రువీకరణ పత్రం జారీ చేసినట్లు విశ్వనీయవర్గాల ద్వారా తెలిసింది. ఒక వ్యక్తి ఎక్కడ చనిపోతే అదే ప్రాంతంలోని మున్సిపల్‌ కార్పొరేషన్‌, లేదా గ్రామ పంచాయతీ పరిధిలో మరణ ధ్రువీకరణ పత్రం పొందాల్సి ఉంటుంది. కానీ ఇక్కడ రిటైర్డ్‌ ఉద్యోగి విషయంలో ప్రభుత్వ నిబంధనలను అధికారులు పూర్తిగా తుంగలో తొక్కినట్లు సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సదరు రిటైర్డ్‌ ఉద్యోగి 2025 నవంబర్‌ 17వ తేదీన అనారోగ్యంతో మృతి చెందాడు. కాగా నీలగిరి నగరంలో 2025 మే 28న ఆయన మృతి చెందినట్లు మరణ ధ్రువీకరణ పత్రం జారీ చేశారు. చనిపోయిన తేదీ కన్నా దాదాపు 4 నెలల 19 రోజులు తక్కువ చేసి ధ్రువపత్రం జారీ చేయడం కలకలం రేపుతోంది. తప్పుడు తేదీల్లో మరణ ధ్రువీకరణ పత్రం జారీ చేసి పెద్ద మొత్తంలో ముడుపులు పొందినట్లు తెలిసింది. కారుణ్య ఉద్యోగ నియామకం కోసం ఈ తతంగం నడిపించినట్లు చర్చ జరుగుతుంది.

ఓ కమిషనర్‌.. ఇద్దరు ఉద్యోగుల పాత్ర...!

నీలగిరి మున్సిపల్‌ కార్పొరేషన్‌ కార్యాలయంలో గతంలో కూడా ఓసారి ఎల్‌ఐసీ డబ్బుల కోసం ఓ ఉద్యోగికి ఇదే తరహాలో తప్పుడు మరణ ధ్రువీకరణ పత్రం జారీ చేయడంతో సీబీఐ అధికారులు తనిఖీలు చేసి అరెస్ట్‌ చేశారు. తాజాగా మరోసారి తప్పుడు మరణ ధ్రువీకరణ పత్రం జారీ వ్యవహారం తెరమీదికి వచ్చింది. సర్టిఫికెట్ల జారీ వ్యవహారంలో 2025లో పనిచేసిన ఓ కమిషనర్‌, మరో ఇద్దరు ఉద్యోగుల పాత్ర కీలకంగా ఉన్నట్లు తెలిసింది. సదరు కుటుంబంతో రూ.3 లక్షలకు ఒప్పందం కుదుర్చుకొని తప్పుడు మరణ ధ్రువీకరణ పత్రం జారీ చేశారనే చర్చ జరుగుతోంది. అప్పటి కమిషనర్‌, ఆ ఇద్దరు ఉద్యోగుల పాత్ర, అప్పట్లో జారీ చేసిన ధ్రువపత్రాలపై పూర్తి విచారణ జరిపిస్తే విస్తుపోయే విషయాలు వెలుగు చూస్తాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికై నా జిల్లా ఉన్నతాధికారులు ఈ మరణ ధ్రువపత్రాల మాయజాలంపై విచారణ జరిపించి అక్రమార్కులపై కఠినచర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

వేరే ప్రాంతంలో చనిపోయిన రిటైర్డ్‌ ఉద్యోగికి ఇక్కడి మున్సిపల్‌ కార్పొరేషన్‌ కార్యాలయం నుంచి మరణ ధ్రువీకరణ పత్రం జారీ చేసినట్లు తన దృష్టికి రాలేదు. ఫిర్యాదు వస్తే విచారణ జరిపించి వాస్తవాలను తేలుస్తాం.

– వంశీకృష్ణ, మున్సిపల్‌ కార్పొరేషన్‌ కమిషనర్‌

ఫ నీలగిరి కార్పొరేషన్‌లో సర్టిఫికెట్ల దందా

ఫ ఓ రిటైర్డ్‌ ఉద్యోగికి అక్రమంగా

మరణ ధ్రువీకరణ ఇచ్చిన అధికారులు

ఫ ఓ కమిషనర్‌, ఇద్దరు ఉద్యోగుల కీలక పాత్ర ఉన్నట్లు ఆరోపణలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement