మర్రిగూడ : డిండి, రాచకొండ ఎత్తిపోతల పథకాలను ప్రభుత్వం తక్షణమే పూర్తిచేసి మునుగోడు ప్రాంతానికి సాగు, తాగునీరు అందించాలని సీపీఎ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు జూలకంటి రంగారెడ్డి డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆదివారం మర్రిగూడ మండలంలోని శివన్నగూడెం రిజర్వాయర్ నుంచి సీపీఎం ఆధ్వర్యంలో మూడు రోజులపాటు సాగే పాదయాత్రను ఆయన ప్రారంభించి మాట్లాడారు. ఫ్లోరైడ్ పీడిత ప్రాంతమైన మునుగోడు నియోజకవర్గానికి సాగు, తాగునీరు అందించాలని గతంలో సీపీఎం చేపట్టిన పోరాటాల ఫలితంగానే డిండి ఎత్తిపోతల పథకాన్ని చేపట్టారని గుర్తు చేశారు. డిండి ఎత్తిపోతల పథకంలో భాగంగా 9 రిజర్వాయర్లకు గాను ప్రస్తుతం ఏడు రిజర్వాయర్లు వివిధ నిర్మాణ దశల్లో ఉన్నాయని, మరో రెండు రిజర్వాయర్ల పనులు ఇప్పటి వరకు ప్రారంభం కాలేదన్నారు. వీటన్నింటిని తక్షణమే యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. ప్రస్తుతం ఏదుళ్ల నుంచి డిండికి నీళ్లు తీసుకురావద్దంటూ మహబూబ్‌నగర్ ప్రాంతానికి చెందిన కొందరు నాయకులు అడ్డుకునే ప్రయత్నం చేయడం ఎంతమాత్రం సరికాదని ఆక్షేపించారు. శివన్నగూడెం నుంచి రాచకొండ ఎత్తిపోతల పథకాన్ని తక్షణమే మంజూరు చేసి నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. డిండి, రాచకొండ ప్రాజెక్టు సాధన కోసమే సీపీఎం పాదయాత్ర చేపట్టిందన్నారు. కార్యక్రమంలో సీపీఎం నల్లగొండ, యాదాద్రి జిల్లా కార్యదర్శులు తుమ్మల వీరారెడ్డి, ఎండీ.జహంగీర్, నాయకులు గుంటోజు శ్రీనివాస్‌చారి, మాటూరు బాలరాజు, బండా శ్రీశైలం, కృష్ణారెడ్డి, పాలడుగు నాగార్జున, యాదిరెడ్డి, నర్సిరెడ్డి, సురకంటి శ్రీనివాస్‌రెడ్డి, లలిత, ముత్యాలు, నర్సింహ, రాములు, గాలయ్య, మల్లేష్, మారయ్య, రామలింగం, రైతు సంఘం నాయకులు పాల్గొన్నారు.
ఫ మాజీ ఎమ్మెల్యేజూలకంటి రంగారెడ్డి


