ఫ అదనపు కలెక్టర్ శ్రీనివాస్
నల్లగొండ : జిల్లాలో బియ్యం విక్రయించే వ్యాపారులు ప్రభుత్వం నిర్ణయించిన ధరలకే విక్రయించాలని, బియ్యం ధరలు పెంచవద్దని అదనపు కలెక్టర్ శ్రీనివాస్ ఆదివారం ఒక ప్రకటనలో ఆదేశించారు. వినియోగదారుల నుంచి అధిక ధరలు వసూలు చేయడం, తూకంలో తేడాలు చూపించడం, నాణ్యతా ప్రమాణాలకు విరుద్ధంగా బియ్యం విక్రయించడం వంటి అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రభుత్వం నిర్ణయించిన ధరల ప్రకారం తెలంగాణ బీపీటీ, కేఎన్‌ఎం రకం బియ్యం కిలో రూ.66, ఆర్‌ఎన్‌ఆర్, తెలంగాణ సోనా రకం రూ.74, హెచ్‌ఎంటీ, జేఎస్‌ఆర్ రకం బియ్యం కిలో రూ.79గా నిర్ణయించారు. ఈ ధరలకు మించి విక్రయించడానికి వీల్లేదని స్పష్టం చేశారు. వ్యాపారులు ధరల వివరాలతో కూడిన బ్యానర్లు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. నిర్ణయించిన ధరల కంటే అధికంగా వసూలు చేస్తున్నా, తూకంలో మోసాలకు పాల్పడుతున్నా వినియోగదారులు సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేయాలని పేర్కొన్నారు.
వట్టికోట ఆళ్వార్ స్వామి జయంతి
రామగిరి (నల్లగొండ): నల్లగొండలోని గ్రంథాలయంలో ఆదివారం గ్రంథాలయ ఉద్యమ స్ఫూర్తిప్రదాత వట్టికోట ఆళ్వార్ స్వామి జయంతి నిర్వహించారు. ఈ సందర్భంగా ఆళ్వార్ స్వామి విగ్రహానికి సంస్థ కార్యదర్శి బి.బాలమ్మ పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో గ్రంధాలయ సంస్థ మాజీ చైర్మన్ గాదె వినోద్ రెడ్డి, కవులు మేరెడ్డి యాదగిరి రెడ్డి, పున్న అంజయ్య, కోమటిరెడ్డి బుచ్చిరెడ్డి, గ్రంథాలయ సిబ్బంది, పాఠకులు, సాహిత్యాభిమానులు పాల్గొన్నారు.
యాదగిరీశుడికి విశేష పూజలు
యాదగిరిగుట్ట: యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలో ఆదివారం ఉదయం నుంచి రాత్రి వరకు నిత్య కై ంకర్యాలు పాంచరాత్ర ఆగమశాస్త్రానుసారంగా నిర్వహించారు. వేకువజామున శ్రీస్వామి అమ్మవార్లకు సుప్రభాతం నిర్వహించి, గర్భాలయంలో స్వయంభూ మూర్తులకు అభిషేక పూజ జరిపించారు. అనంతరం తులసీ దళాలతో సహస్ర నామార్చన, కుంకుమార్చన వంటి పూజలు చేపట్టారు. ఆలయ ముఖ మండపంలో అష్టోత్తరం, సువర్ణ పుష్పార్చన నిర్వహించారు. ప్రథమ ప్రకార మండపంలో శ్రీసుదర్శన నారసింహ హోమం, గజ వాహన సేవ, నిత్య కల్యాణం జరిపించారు. సాయంత్రం జోడు సేవలను ఆలయ వీధుల్లో ఊరేగించారు.
29న హనుమాన్ విగ్రహ ప్రతిష్ఠ
మిర్యాలగూడ టౌన్ : పట్టణంలోని అద్దంకి–నార్కట్‌పల్లి బైపాస్ రామచంద్రాగూడెం చౌరస్తా వద్ద నూతనంగా నిర్మించిన శ్రీ అభయాంజనేయ స్వామి దేవాలయం ప్రారంభోత్సవంతో పాటు 54 అడుగుల భారీ హనుమాన్ విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవాన్ని ఈనెల 29న వైభవంగా నిర్వహించనున్నట్లు హనుమాన్ భక్తమండలి ఒక ప్రకటనలో తెలిపింది. ఈ పవిత్ర కార్యక్రమాన్ని పురస్కరించుకుని 29వ తేదీన పట్టణ ప్రజలు మాంసాహారం స్వీకరించవద్దని కోరింది. అలాగే, ఆ రోజు పట్టణంలోని మాంసం దుకాణాలను సైతం స్వచ్ఛందంగా మూసివేసి సహకరించాలని దుకాణదారులకు విజ్ఞప్తి చేసింది. పట్టణ ప్రజలు, భక్తులు పెద్ద ఎత్తున హాజరై విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవాన్ని విజయవంతం చేయాలని భక్తమండలి కోరింది.
ధాన్యం కొనుగోళ్లు ప్రారంభించాలి
నల్లగొండ టూటౌన్ : నెల రోజులు గడుస్తున్నా ధాన్యం కొనుగోళ్లు ప్రారంభం కాలేదని, కలెక్టర్ వెంటనే స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు నాగం వర్షిత్‌రెడ్డి ఒక ప్రకటనలో కోరారు. కొనుగోలు కేంద్రాల్లో నెల రోజులుగా ఎదురుచూస్తున్న రైతుల ధాన్యానికి కాంటాలు వేయాలని, కొనుగోలు చేసిన ధాన్యాన్ని ఎలాంటి జాప్యం లేకుండా వెంటనే మిల్లులకు తరలించాలని ఆయన డిమాండ్ చేశారు.


