చనిపోయిన వారిని తలచుకుంటేనే మనసు బాధతో నిండిపోతుంది. వారి జ్ఞాపకాలు కన్నీళ్లు తెప్పిస్తాయి. కానీ మెక్సికోలో మాత్రం మరణించిన తమ ఆత్మీయుల సంస్మరణను అక్కడి ప్రజలు ఎంతో ఆడంబరంగా, ఆనందంగా జరుపుకుంటారు. ఆ వేడుక పేరే ‘డియా డి లాస్ మ్వెర్టోస్’, అంటే ‘డే ఆఫ్ ది డెడ్’. ప్రతి ఏడాది నవంబర్ 1, 2 తేదీల్లో జరుపుకునే ఈ వేడుక మరణాన్ని ఒక భయపడాల్సిన అంశంగా కాకుండా, జీవితంలో అదీ ఒక సహజ పరిణామం స్వీకరించాలనే సందేశాన్ని ఇస్తుంది.
ఈ ‘డే ఆఫ్ ది డెడ్’ వేడుకను నవంబర్ ఆరంభంలో జరుపుకుంటారు కాబట్టి చాలామంది దీనిని ‘మెక్సికన్ హాలోవీన్‌గా’ భావిస్తారు. అయితే హాలోవీన్‌కి, డే ఆఫ్ ది డెడ్‌కి మధ్య ఎంతో తేడా ఉంది. హాలోవీన్‌లో భయంకరమైన వేషాలు, దెయ్యాల ఆకారాలు, అస్థిపంజరాలు, స్వీట్లు ప్రధాన ఆకర్షణ. కానీ ‘డే ఆఫ్ ది డెడ్’లో మరణించిన ఆత్మీయుల జ్ఞాపకాలు, కుటుంబ బంధాలు, ప్రేమ వంటి అంశాలు ఉంటాయి.
మెక్సికోలోని ఆదివాసీ సంస్కృతుల్లో ఈ సంప్రదాయ మూలాలు కనిపిస్తాయి. ముఖ్యంగా అజ్‌టెక్ నాగరికతలో మరణించినవారికి నైవేద్యాలు సమర్పించి, వారితో ఉన్న బంధాన్ని గుర్తుచేసుకునే ఆచారాలు ఉండేవి. మరణంతో జీవితం ముగిసిపోయినప్పటికీ, మన జ్ఞాపకాల్లో ఆత్మీయులు కొనసాగుతూనే ఉంటారనే భావన ఈ వేడుకలో ప్రముఖంగా కనిపిస్తుంది.
అందంగా అలంకరణ
ఈ పండుగలో ప్రధాన ఆకర్షణ ‘ఓఫ్రెండా’ అనే ప్రత్యేక పూజా వేదిక. అంటే స్పానిష్ భాషలో ‘సమర్పించటం’ అని అర్థం. మెక్సికన్‌ల నమ్మకం ప్రకారం నవంబర్ 1, 2 తేదీల్లో చనిపోయిన వారి ఆత్మలు భూమిపై ఉన్న తమ కుటుంబాలను చూడటానికి తిరిగి వస్తాయని నమ్మకం.
అలా వచ్చే ఆత్మలకు స్వాగతం పలకడానికి– మరణించిన వారి పోటోలు, వారికి ఇష్టమైన ఆహార పదార్థాలు, వస్తువులు, జ్ఞాపకాలను గుర్తుచేసే ఇతర వస్తువులతో పూజా వేదికను అలంకరిస్తారు. చక్కెరతో ప్రత్యేకంగా తయారు చేసిన పుర్రెలు, కొవ్వొత్తులు, రంగురంగుల కాగితపు జెండాలు, బంతిపూలను ఆ వేదికపై అమరుస్తారు.
ఈ వేడుకల్లో భాగంగా మరణించిన వ్యక్తికి ఇష్టమైన పాటలను వింటారు. వారితో గడిపిన మధుర క్షణాలను గుర్తుచేసుకుంటారు. ఇలా చేయడం వల్ల తమ ఆత్మీయులు తమ జీవితాల్లో ఇప్పటికీ ఒక భాగంగా ఉన్నారనే భావన కలుగుతుందని అక్కడి వారు చెబుతారు. ‘పాన్‌డి మ్వెర్టో’ అనే ప్రత్యేక రొట్టె కూడా ఈ పండుగలో ముఖ్యమైనది. వీటిని కుటుంబ సభ్యులతో కలిసి పంచుకుంటారు. ఈ అలంకరణలు కేవలం అందం కోసమే కాకుండా, మరణించినవారి జ్ఞాపకాలను ప్రేమతో నిలుపుకోవడానికి ప్రతీకలుగా నిలుస్తాయి.
ఆత్మీయులను కోల్పోయిన బాధను పూర్తిగా తొలగించలేకపోయినా, వారి జ్ఞాపకాలను ప్రేమతో గుర్తుచేసుకోవడం మనసుకు ఓదార్పునిస్తుంది. మరణించినవారిని కన్నీళ్లతో మాత్రమే కాదు, వారు మన జీవితాల్లో పంచిన ఆనందాన్ని గుర్తుచేసుకుంటూ కూడా గౌరవించవచ్చని ‘డే ఆఫ్ ది డెడ్’ చాటి చెబుతుంది.
అందరికీ వర్తిస్తుంది..
‘డే ఆఫ్ ది డెడ్’ మెక్సికన్ సంప్రదాయంలో పుట్టిన వేడుక అయినప్పటికీ, దాని సందేశం అందరికీ వర్తిస్తుంది. ప్రతి ఒక్కరికీ పూర్వీకులు ఉంటారు. తమ జీవితాలపై ప్రభావం చూపిన వ్యక్తులూ ఉంటారు. వారిని గుర్తుచేసుకోవడం, వారి నుంచి నేర్చుకున్న విలువలను కొనసాగించడం ఈ వేడుకలోని అసలైన భావం.


