మనిషి మనసు ఇంత విచిత్రమా? | Love Hate Relationship Human Emotions Story | Sakshi
Sakshi News home page

మనిషి మనసు ఇంత విచిత్రమా?

Nov 1 2026 11:15 AM | Updated on Nov 1 2026 11:15 AM

Love Hate Relationship Human Emotions Story

ఫండే

కథాకళి

నా జీవితంలో ఆశ్చర్యం కలిగించే వాటిలో మొదటిది మనిషి నైజం. నా పధ్నాలుగో ఏట ఆ దంపతులు మా ఇంటి ఎదురుగా రెండు గదుల పోర్షన్‌ లోకి అద్దెకి వచ్చారు. వారికి పెళ్ళై మూడు నెలలే ఐందని, వాళ్ళు ఇంకెక్కడో ఇల్లు ఖాళీ చేసి వచ్చారని పెద్దల మాటలబట్టి తెలుసుకున్నాను.

శతావధాని అసిస్టెంట్‌ గోడౌన్‌ కీపర్‌గా పనిచేసేవాడు. అప్పట్లో ఆడవాళ్ళు ఉద్యోగాలు చేయటం తక్కువ కాబట్టి దయాన్విత ఇంట్లోనే ఉండేది. అనేకసార్లు వాళ్ళ కీచులాటలు మాకు వినిపించేవి. నాకు వాటికి కారణం తెలిసేది కాదు. కీచులాటల తర్వాత శతావధాని డాబా మీద విలపించటం చాలాసార్లు చూశాను.

‘అతను లవ్, హేట్‌ రిలేషన్‌ షిప్‌తో నరకయాతన పడుతున్నాడు’ అని మా నాన్నగారు అనేవారు. ‘దయాన్విత తిరుగుబోతు. తన వంక ఎవరైనా ఆసక్తిగా చూస్తే అది పొగడ్తగా భావించి అతన్ని ప్రోత్సహిస్తుంద’ని మా అమ్మ ఎవరితోనో చెప్తూంటే విన్నాను.
దయాన్విత తరచూ ఇల్లు తాళం పెట్టి ఎటో వెళ్ళేది. ఒక్కోసారి శతావధాని తిరిగి వచ్చేలోగా వచ్చేది కాదు. వచ్చాక అతని అరుపులు వినపడేవి. నాలుగు నెలల తర్వాత ఓ రోజు మధ్యాహ్నం శతావధాని ఆఫీస్‌ నుంచి తిరిగి వచ్చేసరికి ఆమె ఇంట్లో లేదు. ఇరవై ఏడేళ్ళ అతను మా ఇంటికి వచ్చి మా అమ్మని కోరాడు.

‘‘మీ అబ్బాయిని ఓ గంట పంపుతారా? ఇల్లు ఖాళీ చేస్తున్నాను. సామాను తీసుకెళ్ళడానికి సాయం కావాలి.’’
వారి ఇంటి తాళంకప్పని డూప్లికేట్‌తో తెరిచాడు. ఫోల్డింగ్‌ మడత మంచం మీది పరుపుని చుట్టి తాడుతో కట్టాడు. వంటగదిలోని సామానంతా మేము కొనే పచారి దుకాణానికి తీసుకెళ్ళాం. దాని యజమాని వాటికి లెక్క కట్టి కొంత డబ్బు ఇచ్చాడు. ఖాళీ  సీసాలని, డబ్బాలని వాళ్ళ పనిమనిషికి ఇవ్వమని చెప్పాడు. మిగిలిన అతి తక్కువ సామానుని దుప్పట్లో కట్టాడు. వాటిని రెండు ఆటోల్లో వేసుకుని, చెరో ఆటోలో శతావధాని అక్కయ్య ఇంటికి చేరుకున్నాం. వారి మాటలని బట్టి దయాన్వితలో పొగరు అధికమని, ఎవరి మాటా వినదని, చెడిపోయిందని తెలిసింది. అతను నాకు ఏభై రూపాయల నోటుని ఇచ్చాడు.

దయాన్విత ఐదున్నరకి తిరిగి వచ్చి ఇంటిని చూసి నిర్ఘాంతపోయింది. మా అమ్మ నన్ను పిలిస్తే సామాను ఎక్కడికి తీసుకెళ్ళామో చెప్పాను. ఆమె ఉగ్రంగా అరిచింది. కళ్ళల్లోంచి నీటి చుక్క కూడా రాలకపోవడం మా అమ్మనాన్నలకి ఆశ్చర్యాన్ని కలిగించింది.
నేను యువకుడిని అయ్యాక జరిగింది అర్థం చేసుకోగలిగాను. శతావధాని తిరుగుబోతు భార్యని భరించలేక ఆమెకి దూరమయ్యాడు.
నేను మంగళూరులోని కేఎంసీలో ఎంబీబీఎస్‌ చదివాక పాండిచ్చేరిలోని జిప్‌మర్‌లో ఆర్థోపెడిక్స్‌లో పోస్ట్రుగాడ్యుయేషన్‌ చేశాను. ఆ తర్వాత జర్మనీలో రుమటాయిడ్‌ ఆర్థరైటిస్‌ మీద పైచదువు చదివాను.

ఒకటి, రెండుసార్లు మాటల్లో మా అమ్మ దయాన్విత గురించి ప్రస్తావించింది. నేటి భాషలో మర్యాదగా చెప్పాలంటే, ఆమె ఓ కలెక్టర్‌కి గర్ల్‌ఫ్రెండ్‌గా వెళ్ళింది. తర్వాత ఓ మంత్రితో పరిచయమై ఆతని ఇలాకాలోకి వెళ్ళింది. ఆమెకి సివిల్‌ సప్లైస్‌ శాఖలో డైరెక్టర్‌ పోస్ట్‌ లభించిందని పేపర్లో చదివాను. ఆమె గురించి తెలిసిన మా అమ్మ చెప్పింది. ‘‘శతావధాని ఓ అమ్మాయి జీవితాన్ని నాశనం చేశాడని తిట్టుకున్నాం. కాని అతను చేసింది సబబే. తన జీవితం తను చూసుకోవడంలో తప్పు లేదు.’’
శతావధాని రెండో పెళ్ళి చేసుకున్నాడని, ఇద్దరు పిల్లలు పుట్టారని తెలిసింది.
నాకు మళ్ళీ దయాన్విత కనబడటానికి ఇరవై రెండు ఏళ్ళు పట్టింది.
∙∙ 
నా ముప్ఫై ఆరో ఏట ప్రైవేట్‌ ప్రాక్టీస్‌ ఆరంభించాను. దయాన్విత రోగిగా నా క్లినిక్‌కి వచ్చింది. నలభై ఎనిమిదేళ్ళ ఆమె నన్ను గుర్తుపట్టలేదు. నేనూ గుర్తు చేయలేదు. తన అన్నయ్యతో సనత్‌నగర్‌లో ఓ రెండు గదుల రేకుల షెడ్‌లో జీవిస్తోందని తెలిసింది. కాని దయాన్వితలో పొగరు, గర్వం ఇంకా పోలేదు.
రుమటాయిడ్‌ ఆర్థరైటిస్‌ వల్ల ఆమె చేతివేళ్ళు వంకరపోయి, పనులు చేసుకోవటం కష్టంగా ఉంది. మంత్రి ఇలాకాలో ఉండగా చేసిన అక్రమార్జనని నిలుపుకోలేకపోయింది. నేటి ఇన్‌ ఫ్లేషన్‌ వల్ల ఆర్థికంగా చాలా అవస్థపడుతోందని తెలిసింది.

ఓ రోజు ఆమె హార్ట్‌ ఎటాక్‌తో పోయిందని ఫోన్‌ వస్తే వెళ్ళాను. అక్కడ ఉండి ఏర్పాట్లు చూసే అతనికి తెల్ల జుట్టు, పొట్ట, దళసరి కళ్ళద్దాలు, ఉబ్బిన మొహం. ఆ ఇంట్లోని శతావధానిని గుర్తుపట్టాను. ఆయన ఆమె ఇంటికి రావటం నన్ను ఆశ్చర్యపరిచింది.
నేనెవరో చెప్పి ఆయన్నో ప్రశ్న అడిగాను. శతావధాని కన్నీరు కారుస్తూ జవాబు చెప్పాడు.

‘‘ఒకప్పుడు మనం ద్వేషించిన మనిషి అవస్థలో ఉందని తెలిస్తే మరుగున ఉన్న ప్రేమ బయటికి వస్తుంది అనుకుంటాను. ఆమె దుస్థితి గురించి తెలిశాక ఆమెకి ఆసరాగా ఉండకుండా ఉండలేకపోయాను. నాది ప్రేమా? ప్రేమ కాదు. దయా? దయ కాదు. మరేమిటి? ఈ రెండూనూ. మానాన్న, పెదనాన్న ఆస్తి కోసం ఇరవై ఏడేళ్ళు కోర్టులో తప్ప ఒకరి మొహం మరొకరు చూసుకోనంతగా ద్వేషించుకున్నారు. మా పెదనాన్న పోయారని తెలిశాక మా నాన్న బాగా విలపించారు. ఆయన శవాన్ని శ్మశానానికి మోసుకెళ్ళారు.

‘‘మనిషి మృగం కాదు. అతనిలో అనేక భావోద్వేగాలు ఉంటాయి. ఓ భావోద్వేగం మరోదాన్ని తాత్కాలికంగా తప్ప ఎక్కువకాలం అణచి ఉంచలేదు. కాలం గడిచేకొద్దీ ప్రతీ భావోద్వేగం పలచబడటంతో చివరికి అన్నీ సమానమవుతాయి.’’
ఆశ్చర్యంగా అంత విచ్చలవిడి జీవితం గడిపిన ఆమె చివరి పదేళ్ళు అమ్మవారి పూజల్లో మునిగిపోయిందని, మధ్యాహ్నం మూడు దాకా పూజలో కూర్చుని, ఆ తర్వాత వండుకుని తినేదని శతావధాని చెప్పాడు. ఇది నా జీవితంలోని రెండో ఆశ్చర్యం.
- మల్లాది వెంకట కృష్ణమూర్తి

ఇదీ చదవండి: చనిపోయిన కొడుకు తిరిగొచ్చాడు.. కానీ అసలు ట్విస్ట్‌ ఏంటంటే?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement