ఫండే
భక్త విజయం
విష్ణువర్మ వృత్తాంతం
పూర్వం మిథిలా నగరాన్ని విష్ణువర్మ అనే రాజు పరిపాలించేవాడు. ఆయన పండితుడు, శాస్త్రకోవిదుడు, ధర్మపరాయణుడు. అనేక యజ్ఞయాగాదులు చేశాడు. భూరి దానాలు చేశాడు. ప్రజల ఉపయోగం కోసం వాపీ కూప తటాకాదులను తవ్వించాడు. రాజ్యమంతటా ఉద్యానవనాలను, ధర్మసత్రాలను ఏర్పాటు చేశాడు. ఆయన ప్రజారంజకంగా పరిపాలన సాగించేవాడు. సుదీర్ఘకాలం రాజ్యపాలన చేశాక వార్ధక్యం వల్ల విష్ణువర్మ కాలధర్మం చెందాడు.
విష్ణువర్మ మరణించిన వెంటనే యమభటులు వచ్చి, అతడిని తమ వెంట నరకానికి తీసుకుపోయారు. యమభటులతో విష్ణువర్మ నరకంలో అడుగుపెట్టే సమయానికి అక్కడ ఉన్న పాపులు యమభటుల చేత శిక్షలు అనుభవిస్తూ, హాహాకారాలు చేస్తున్నారు. బాధలు తాళలేక కొందరు బిగ్గరగా రోదిస్తున్నారు. వారిలో కొందరు మిథిలాపుర ప్రజలు కూడా ఉన్నారు. వారు విష్ణువర్మను గుర్తించి, ‘రాజా! మమ్మల్ని నువ్వే రక్షించాలి’ అంటూ ఏడుస్తూ కేకలు వేశారు.
నరకంలోని దృశ్యాలను చూసి విష్ణువర్మ కలత చెందాడు. తనను వెంటబెట్టుకు వచ్చిన యమభటులతో ‘నన్నెందుకు ఇక్కడకు తీసుకొచ్చారు? నేనే పాపమూ చేయలేదే! ఎన్నడూ అధర్మానికి పాల్పడలేదే! నేను అనేక యజ్ఞయాగాదులను కూడా చేశాను. ప్రజలను కష్టపెట్టకుండా పరిపాలన చేశాను’ అన్నాడు.
‘రాజా! నువ్వు చెప్పినవన్నీ వాస్తవాలే, అందులో సందేహం లేదు. కాని, నీ ఇద్దరు భార్యలలో నువ్వు నీ రెండో భార్యపై మోహాధిక్యాన్ని ప్రదర్శించావు. మొదటి భార్యను కొంత నిర్లక్ష్యం చేశావు. ఇది కూడా పాపం కిందకే వస్తుంది. అందుకే నిన్ను నరకానికి తీసుకువచ్చి, ఇక్కడి పాపుల బాధలను చూపవలసి వచ్చింది’ అని యమభటులు బదులిచ్చారు.
వారి సమాధానానికి విష్ణువర్మ ఆలోచనలో పడ్డాడు.
‘నువ్వు నరకంలోకి ప్రవేశించావు. కొద్దిసేపు ఉన్నావు. ఇక్కడ పాపులు పడుతున్న బాధలను కళ్లారా చూసి, కలత చెందావు. ఇక్కడితో నీ పాపం ముగిసింది. ఇక నిన్ను దేవదూతకు అప్పగిస్తాం’ అని చెప్పారు యమభటులు.
‘యమభటులారా! ఏయే పాపాలు చేసిన వారు ఎలాంటి నరకాలను అనుభవించాల్సి ఉంటుందో చెప్పండి’ అని అడిగాడు విష్ణువర్మ.
‘రాజా! ఎవరు చేసిన పాపాలను వారు అనుభవించక తప్పదు. భూలోకంలో ‘పరోపకారాయ పుణ్యాయః పాపాయ పరపీడనం’ అనేదే పరమసూత్రం. మనోవాక్కాయ కర్మలతో పరులను పీడించే పని ఏది చేసినా అది పాపమే అవుతుంది. ఎంత పాపానికి అంత శిక్షను ఈ నరకంలో అనుభవించాల్సిందే!’ అని చెబుతూ, పాపాల వివరాలను, వాటికి నరకంలో విధించే శిక్షలను యమభటులు విశదీకరించారు.
ఇంతలో దేవేంద్రుడు, యమధర్మరాజు దేవదూతలతో కలసి విష్ణువర్మ వద్దకు వచ్చారు.
‘రాజా! నీ పాపాలన్నీ సమసిపోయాయి. ఇక్కడ అనుభవించాల్సిందేమీ లేదు’ అన్నాడు యమధర్మరాజు.
‘నువ్వు అనేక పుణ్యాలు చేశావు. అందుకు నిన్ను స్వర్గానికి తీసుకువెళ్లడానికి వచ్చాను’ అని చెప్పాడు ఇంద్రుడు.
‘ఓ దేవేంద్రా! ఓ యమధర్మరాజా! నా ప్రజలు ఇక్కడ నరకబాధలు అనుభవిస్తుంటే, నేనొక్కడినే స్వర్గానికి వెళ్లి అక్కడి సౌఖ్యాలను అనుభవించడం సమంజసం కాదు. రక్షించమని కోరిన ప్రజలను వారి మానాన వదిలేసి, తన సౌఖ్యం చూసుకునేవాడు రాజుగా ఉండతగడు. నా ప్రజలను కూడా నరక విముక్తులను చేయండి. లేకుంటే, నేను కూడా వీరితో పాటే ఇక్కడే ఉండిపోతాను’ అన్నాడు విష్ణువర్మ.
‘రాజా! పాపాలు చేసిన వారు నరక బాధలను, పుణ్యాలు చేసిన వారు స్వర్గ సుఖాలను అనుభవించక తప్పదు. ఇది బ్రహ్మ విధించిన నియమం. దీనిని ఎవరూ తప్పించలేరు’ చెప్పాడు యమధర్మరాజు.
‘నన్ను చూసి, రక్షించమంటూ ఏడుస్తున్న నా ప్రజలను విడిచి నేను స్వర్గానికి రాలేను. మీరు నా కోరిక నెరవేర్చలేకపోతే నేను ఇక్కడ ఈ నరకంలోనే ఉండిపోతాను’ కచ్చితంగా చెప్పాడు విష్ణువర్మ.
విష్ణువర్మ ప్రజల పట్ల చూపుతున్న నిబద్ధతకు దేవేంద్రుడు, యమధర్మరాజు నివ్వెరపోయారు. ‘రాజా! నీ పట్టుదల ముచ్చటగా ఉంది. ప్రజల పట్ల నీ అనురక్తి శ్లాఘనీయం. నీ మాటను తోసిపుచ్చితే మా కీర్తి నశిస్తుంది. నువ్వు కోరుతున్నట్లుగానే నీ ప్రజలు నరక విముక్తి పొంది, నీతో పాటు స్వర్గానికి వస్తారు. సరేనా!’ అని పలికారు దేవేంద్రుడు, యముడు.
వారి నిర్ణయానికి విష్ణువర్మ సంతోషించాడు. ఇంద్రుడితో వచ్చిన దేవదూతలు విష్ణువర్మతో పాటు అతడి ప్రజలను కూడా తమతో పాటు స్వర్గానికి తీసుకుపోయారు.
- సాంఖ్యాయన
పురావిశేషం..
అష్టదిక్పాలకులలో ఒకరైన కుబేరుడి ఆలయం ఉత్తరాఖండ్‌లోని అల్మోరా సమీపంలోని జగేశ్వర్ లోయలో ఉంది. ఈ ఆలయం క్రీస్తుశకం ఏడో శతాబ్ది నాటిదని అంచనా. ఈ ఆలయంలో కుబేరుడు ఏకముఖ శివలింగ రూపంలో దర్శనమిస్తాడు. ధనప్రాప్తికి, రాజయోగప్రాప్తికి, వ్యాపారాభివృద్ధికి భక్తులు ఇక్కడ ప్రత్యేక పూజలు జరిపించుకుంటూ ఉంటారు. కుబేరుడికి పసుపు రంగులో ఉండే శనగపిండి లడ్డూలు తదితర మిఠాయిలు, కుంకుమపువ్వు కలిపిన పాలు నైవేద్యంగా సమర్పిస్తారు. పసుపు వస్త్రాలను కానుకగా సమర్పిస్తారు.
ఇదీ చదవండి: డాగ్ ఫెస్టివల్: కుక్కకి ఓ రోజు వస్తుంది అంటే ఇదే..!


