గ్లామర్ పాత్రలతో వెండితెరపై తనదైన ముద్ర వేసిన డింపుల్ హయతి ప్రయాణం– కేవలం పాటలూ, పాపులారిటీతోనే సాగలేదు! రంగు విషయంలో వివక్ష, వరుస తిరస్కారాలు– ఇలా ఎన్నో అవమానాలు ఎదురైనా తన కలను వదలకుండా ముందుకు సాగింది. ఆ తెరవెనుక దాగిన ఆసక్తికరమైన సంగతులన్నీ ఆమె మాటల్లోనే...
కలే నా బలం!
నేను పుట్టింది విజయవాడ, పెరిగింది హైదరాబాద్. చిన్నప్పటి నుంచే హీరోయిన్ కావాలనేది నా కల. నాలుగో తరగతిలో ఉన్నప్పుడే ఆ కలను మనసులో బలంగా నాటుకున్నా. అద్దం ముందు నిలబడి డైలాగులు చెప్తూ సంబరపడిపోయేదాన్ని. అప్పుడు అది సరదాగా అనిపించినా, అదే కోరిక నన్ను నటన వైపు నడిపించింది.
కుటుంబ నేపథ్యం సినిమానే!
ప్రముఖ దర్శకుడు దాసరి నారాయణరావుగారు నాకు తాత అవుతారు. మా తాతకు ఆయన కజిన్. అయితే ఈ విషయం చాలామందికి తెలీదు. మా నానమ్మ ప్రభ. ఆమె కూడా హీరోయిన్‌గా ఎన్నో సినిమాలు చేశారు. అలానే మా అమ్మ, వాళ్ల అక్కచెల్లెళ్లు అందరూ నటులే. తెలుగుతో పాటు మలయాళంలోనూ మూవీస్ చేశారు. అలాంటి కుటుంబ నేపథ్యం ఉండటం ప్రత్యేకమే అయినా, నా ప్రయాణాన్ని నేను నా కష్టంతోనే నిర్మించుకోవాలనుకున్నా.
రాకీ.. నా రియల్ హీరో!
రాకీ నా జీవితంలో ప్రత్యేకమైన స్థానం సంపాదించుకున్న కుక్క. కష్టమైన సమయంలో పెంపుడు జంతువులు ఇచ్చే తోడు మాటల్లో చెప్పలేనిది. అవి మనల్ని ప్రశ్నించవు, తీర్పు చెప్పవు, మన దగ్గర ఉంటాయి, అంతే! అందుకే వాటితో గడిపే క్షణాలు నాకు ఎంతో విలువైనవి.
ఫిట్‌నెస్.. ఫుడ్ ఫ్రెండ్‌షిప్!
పని, వ్యాయామం, ప్రయాణాలు– వీటన్నింటి మధ్య నాకు నచ్చిన చిన్న చిన్న ఆనందాల కోసం సమయం కేటాయిస్తుంటాను. ఆరోగ్యం కోసం జాగ్రత్తలు తీసుకుంటున్నానని ఇష్టమైన ఆహారాన్ని పూర్తిగా వదిలేయలేను. అందుకే, బిర్యానీ, పిజ్జా, దోసె కనిపిస్తే మనసు అటువైపే వెళ్తుంది.
రంగు కాదు... ప్రతిభ!
కెరీర్ ఆరంభంలో ఎన్నో తిరస్కారాలు ఎదురయ్యాయి. ముఖ్యంగా నా ఒంటిరంగు విషయంలో కొందరు చేసిన వ్యాఖ్యలు బాధించాయి. హీరోయిన్ కావాలనే కలతో వెళ్లినప్పుడు, రూపం ఆధారంగా అవకాశాలు నిరాకరించడం అంత సులభంగా తీసుకోలేపోయాను. అయితే ఆ అనుభవాలే నాలో పట్టుదలను పెంచాయి. ఈ రోజు ప్రేక్షకులు నన్ను ఆదరిస్తున్నారంటే, వారి ఆదరణ వెనుక నాకు ఎదురైన కష్టాలూ ఒక భాగమే!
‘జర్రా జర్రా’... జోష్ పెంచింది!
నేను ‘గల్ఫ్’ మూవీతో హీరోయిన్గా పరిచయమైనప్పటికీ, ‘గద్దలకొండ గణేష్’ సినిమాలోని ‘జర్రా జర్రా’ పాట నా కెరీర్‌కు జోష్ పెంచింది. అప్పటివరకు ఎదురైన నిరాశల మధ్య వచ్చిన ఆ అవకాశం నాలో కొత్త ఉత్సాహాన్ని నింపింది. ఆ తర్వాత ‘ఖిలాడి’, ‘రామబాణం’ వంటి సినిమాలతో పాటు ‘అట్రాంగి రే’తో హిందీ ప్రేక్షకులకూ పరిచయమయ్యా.
గ్లామర్ మాత్రమే కాదు!
తెరపై గ్లామరస్ పాత్రల్లో కనిపించినంత మాత్రాన నటనకు అవే పరిమితులు కావు. మంచి కథ, బలమైన పాత్ర దొరికితే భిన్నమైన రూపంలోనూ కనిపించాలనుకుంటా. నటిగా కొత్త విషయాలు నేర్చుకోవడం, నన్ను నేను పరీక్షించుకోవడం ఇష్టం. ప్రతి పాత్రలోనూ ఏదో కొత్తదనం ఉండాలి. అందుకే అవకాశాల విషయంలో తొందరపడకుండా, నాకు నచ్చిన పాత్రల కోసం ఎదురుచూస్తుంటాను.


