ఫేస్‌బుక్‌లో ఒక పిక్ షేర్ చేశాం – అప్పటి నుంచి ఎన్ని లైకులు వచ్చాయనే ఆతృత. వాట్సాప్‌లో ఆరోజు జరుపుకున్న బర్త్ డే వీడియోని ‘స్టేటస్’గా పెట్టాం – ఆ క్షణం నుంచి ఎంతమంది చూశారు, ఫలానా వారెందుకు విష్ చేయలేదనే ఆరాటం. ఇన్‌స్టాలో ఒక వీడియోని పోస్ట్ చేశాం – లైకులు వచ్చాయ్. ఫాలోవర్స్ ఎందుకు పెరగలేదన్న ఆవేదన. ఒక ఇన్‌ఫ్లూయెన్సర్ ఒక గాడ్జెట్ గురించి పదేపదే చెప్తున్నాడు– అందరూ కొనేస్తున్నారు – మరి నా దగ్గర లేదే అని ఆక్రోశం! చేతిలోని ఒక చిన్న తెర – ప్రపంచాన్ని మన ముందుకు తీసుకువచ్చింది. కానీ అదే తెర వెనుక కనిపించని ఒత్తిళ్లు, పోలికలు, ట్రోలింగ్, నకిలీ వార్తలు, గోప్యతకు ముప్పు వంటివి ఎన్నో! కనెక్ట్ చేయాల్సిన సోషల్ మీడియానే కొన్నిసార్లు మనల్ని మనకు దూరం చేస్తోంది. ప్రపంచాన్ని ముందుంచుతూనే, పక్కగదిలో ప్రాణాలు పోయినా పట్టించుకునే తీరిక లేకుండా చేస్తోంది. ఒక్క సెకన్ – ఒక్క స్క్రోల్‌తో మొదలై సమయాన్నంతా మింగేస్తోంది.
అందమైన మాయ!
సోషల్ మీడియాలో కనిపించే ప్రతి ఫొటో నిజమైనది కాదు. ఫిల్టర్లు, ఎడిటింగ్, మేకప్, ఆర్టిఫిషియల్ లైటింగ్, ఏఐ జోడింపు– ఇవన్నీ కలిపి ఒక మాయా ప్రపంచాన్ని చూపిస్తున్నాయి. దాన్నే నిజమని భావిస్తూ, పోల్చుకోవడం మొదలుపెడుతున్నాం. ‘నేను ఎందుకు అలా లేను?’, ఎందుకు వారిలా అందంగా కనిపించడం లేదు?
అనే ప్రశ్నలు మొదలవుతున్నాయి. ఇదే నేడు యువతలో ఆత్మన్యూనతకు, అసంతృప్తికి కారణమవుతోంది.
నేనెందుకు అలా లేను?
మన బంధువులు విదేశీ పర్యటనలో ఉన్నారు. మరొకరు ఖరీదైన కారు కొన్నారు. ఇంకొకరు కొత్త ఇల్లు చూపించారు. వేరొకరు ప్రతిరోజూ తన ఆనందాలను, విజయాలను పంచుకుంటున్నారు. వీటిని చూసినపుడు మనం జీవితంలో వెనుకబడిపోయామేమో అనే భావన కలగవచ్చు. కానీ వారు పంచుకునే ఆనంద క్షణాల వెనుక ఎన్నో కష్టాలు, వైఫల్యాలు, అప్పులు, ఒత్తిళ్లు, కన్నీళ్లు ఉండవచ్చు. అవి మనకు కనిపించకపోవచ్చు. అయినా మనం వారి ‘హైలెట్స్’ని మన రియల్ లైఫ్‌తో పోల్చుకుంటూ కుంగిపోతుంటాం.
వ్యక్తిగతం కాకూడదు!
సోషల్ మీడియా రాజకీయ చర్చలకు పెద్ద వేదికగా మారింది. ఒక వార్త, ఒక వీడియో, ఒక ప్రసంగం.. క్షణాల్లో వేలమందికి చేరుతుంది. ఇది మంచిదే కాని, ఇందులో నిజానికీ అబద్ధానికీ మధ్య ఉండాల్సిన ఒక సన్నని గీత చెరిగిపోతోంది. పూర్తి సమాచారం తెలుసుకోకుండానే ఒక అభిప్రాయానికి వచ్చేస్తున్నాం. ఇందుకు విరుద్ధంగా ఎవరైనా స్పందిస్తే, ఎదురు దాడికి తెగబడుతున్నాం. రాజకీయాంశాలపై చర్చ ఉండాలి. కానీ వ్యక్తులపై దాడిగా, వ్యక్తిగత దాడిగా మారకూడదు. అభిప్రాయ భేదం ఉండొచ్చు కాని, అది శత్రుత్వం కాకూడదు.
కామెంట్లతో పోస్ట్‌మార్టం
సోషల్ మీడియాలో కామెంట్ చేయడం చాలా సులభం. ఎదుటివారి ముఖం కనిపించదు. వారి బాధ మనకు తెలియదు. అందుకే కొందరు నిజ జీవితంలో చెప్పలేని మాటలను ఆన్ లైన్ లో సులభంగా రాసేస్తారు. నైతిక తీర్పులు, వ్యక్తిగత విమర్శలు, అవమానకరమైన వ్యాఖ్యలు– ఇవి ఒక్కోసారి ఒక వ్యక్తి ఆత్మవిశ్వాసాన్నే దెబ్బతీయవచ్చు. ‘కామెంటే కదా’ అనుకునే వ్యక్తికి అది కొన్ని సెకన్ల విషయం కావచ్చు. కాని, ఆ కామెంట్ అందుకున్న వ్యక్తికి మాత్రం అది చాలా కాలం గుర్తుండిపోయే చేదు జ్ఞాపకం.
సైబర్ బుల్లీయింగ్..
కంటికి కనిపించని వేధింపులే ‘సైబర్ బుల్లీయింగ్ ’. స్కూల్, కాలేజీ, ఆఫీస్‌లో జరిగే వేధింపులకు సోషల్ మీడియా మరో రూపాన్ని ఇచ్చింది. ఎగతాళి చేసే పోస్టులు, అవమానకరమైన మీమ్స్, వ్యక్తిగత ఫొటోలపై దూషణలు, నకిలీ ఖాతాలు, బెదిరింపులు, పదేపదే వేధించే సందేశాలు– ఇవన్నీ ఆన్ లైన్ హెరాస్‌మెంట్ రూపాలు. ఇవేవీ కంటికి కనిపించవు, తలుపులు మూసుకున్నా ఆగవు.
ఇన్‌ఫ్లుయెన్స్ కావొద్దు!
సోషల్ మీడియాలో ఓ వ్యక్తి చెప్పిన మాట– ఒక ఉత్పత్తిని కొనిపించగలదు. ఒక ఫ్యాషన్ పోస్టు– మన రూపం గురించి మన ఆలోచనలను మార్చగలదు. ఒక అందమైన లైఫ్ స్టైల్ వీడియో– మన జీవితంతో పోల్చుకునేలా చేయగలదు. అందుకే ఇన్ ఫ్లుయెన్సర్ల ప్రభావం రోజురోజుకూ పెరుగుతోంది. ప్రముఖ బ్రాండ్లు సైతం వీరిని తమ ఉత్పత్తుల ప్రచారానికి ఉపయోగించు కుంటున్నాయి. అయితే సోషల్ మీడియాలో కనిపించే ప్రతి ప్రోడక్ట్ వారు చెప్పినంత గొప్పది కాకపోవచ్చు. ముఖ్యంగా ఆరోగ్యం, అందం, కొనుగోళ్ళ విషయంలో జాగ్రత్త అవసరం.
రాంగ్ జడ్జిమెంట్!
నిజం చెప్పులు తొడుక్కునే లోపు అబద్ధం ప్రపంచం చుట్టి వస్తుందట! ఈ వాక్యం సోషల్ మీడియాకి చక్కగా అతికినట్లుగా సరిపోతుంది. ఒక ఆరోపణ సోషల్ మీడియాలోకి వస్తుంది. క్షణాల్లో అది వందల పోస్టులుగా మారుతుంది. నిజానిజాలు తెలుసుకునేలోపే ఒక కథ సిద్ధమైపోతుంది. ఎవరో చెప్పిన మాటను నిజమని భావించడం, పాత విషయాన్ని కొత్తదిగా ప్రచారం చేయడం వంటి వాటి వల్ల వ్యక్తిగత జీవితాలు, సంబంధాలు, ప్రతిష్ఠ దెబ్బతినే ప్రమాదం ఉంటుంది.
తెలియకుండానే తీర్పులు!
ఒక వీడియోలో కొంత భాగం చూశాం. ఒక పోస్టు చదివాం. ఒక కామెంట్ నచ్చింది. అంతే, మన తీర్పు సిద్ధం! కానీ ఆ సంఘటనకు ముందు ఏమైంది?, తర్వాత ఏమైంది?, సమాచారం ఎక్కడి నుంచి వచ్చింది?, దానికి ఆధారం ఏమిటి?, ఇవేవీ తెలుసుకోకుండానే అభిప్రాయం ఏర్పరచుకోవడం తొందరపాటు నిర్ణయాలకు దారితీయొచ్చు.
సైబర్ మోసాలు
ఎక్కడికి వెళ్తున్నాం, ఏం తింటున్నాం అనే ప్రతి చిన్న విషయాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం ఈరోజుల్లో ఒక ట్రెండ్‌గా మారింది. దీని వల్ల సైబర్ నేరగాళ్లకు మన వివరాలన్నీ సులువుగా చిక్కు తున్నాయి. ఫోటోలను డౌన్‌లోడ్ చేసి మార్ఫింగ్‌లకు పాల్పడి బ్లాక్ మెయిల్‌కు పాల్పడుతున్నారు. కరెంట్ బిల్లు కట్టలేదంటూ, బ్యాంక్ కేవైసీ అప్‌డేట్ చేయాలంటూ వస్తున్న మెసేజ్‌లలోని లింక్‌లు క్లిక్ చేయగానే బ్యాంక్ ఖాతాలు ఖాళీ అవుతున్నాయి. ఈ ఊబిలో చిక్కుకునేది చదువుకోని వారో, లేదంటే టెక్నాలజీ తెలియని వారో అనుకుంటే పొరపాటు. అన్నీ తెలిసిన వారు కూడా ఒక్కోసారి ఇటువంటి ప్రమాదాలను ఎదుర్కోక తప్పడం లేదు. నమ్మకం కలిగించే ఫొటో, పరిచయమైన పేరుతో వచ్చిన ఖాతా నిజమైనదే అని అనుకోవడం ప్రమాదాలకు తెచ్చిపెడుతోంది.
నిజమేదో, నకిలీదేదో?
ఏఐ టెక్నాలజీతో ఒక వ్యక్తి ముఖాన్ని, గొంతును ఉపయోగించి అతను చెప్పని మాటలను చెప్పినట్టుగా, చేయని పనిని చేసినట్టుగా చూపించే నకిలీ కంటెంట్ రూపొందించవచ్చు. ఇలాంటి డీప్‌ఫేక్‌లు వ్యక్తిగత ప్రతిష్ఠ నుంచి ప్రజా చర్చల వరకు ప్రభావం చూపించే అవకాశం ఉంది. అందుకే ఏ వీడియో చూసినా వెంటనే నమ్మకుండా, అది ఎక్కడి నుంచి వచ్చిందో, సందర్భం ఏమిటో వంటివి పరిశీలించడం అవసరం.
చట్టం చుట్టం కాదు!
‘ఆన్ లైన్ లోనే కదా పోస్ట్ చేసింది. ఏమవుతుందిలే’ అని అనుకుంటే పోలీస్ స్టేషన్‌లో కాలుపెట్టక తప్పదు. వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగించడం, బెదిరింపులు, వేధింపులు, మోసాలు, అనుమతి లేకుండా వ్యక్తిగత సమాచారాన్ని పంచుకోవడం, నకిలీ కంటెంట్ సృష్టి్టంచడం వంటి చర్యలకు సందర్భాన్ని బట్టి చట్టపరమైన పరిణామాలు ఉండవచ్చు. అందుకే డిజిటల్ స్వేచ్ఛతో పాటు డిజిటల్ బాధ్యత కూడా తెలుసుకోవాలి.
సోషల్ మీడియా మంచిదా, చెడ్డదా అని కాదు; తప్పా, ఒప్పా కాదు; ఇక్కడ మనం ఎలా వాడుతున్నామనేదే అసలు ముచ్చట. సోషల్ మీడియా జ్ఞానాన్ని అందించగలదు, దూరాన్ని తగ్గించగలదు. ప్రతిభకు వేదిక కాగలదు, సమస్యలను ప్రపంచం దృష్టి్టకి తీసుకువెళ్లే ఒక శక్తిమంతమైన సాధనంగా మారగలదు. అదే సమయంలో పోలికలు, తప్పుడు సమాచారం, సైబర్ వేధింపులు, మోసాలు, నకిలీ కంటెంట్, అనవసర చర్చలు, టైమ్ వేస్ట్‌కి కూడా కారణం కాగలదు.
అందుకే ‘సోషల్ మీడియాను మనం నడుపుతున్నామా లేక సోషల్ మీడియానే మనల్ని నడుపుతోందా?’ అనే సందిగ్ధతలో చిక్కుకుపోకుండా, విచక్షణతో ముందుకు సాగడమే అసలైన డిజిటల్ తెలివి. చివరగా తెలుసుకోవాల్సిందేమిటంటే, చూసేవన్నీ నిజాలు కావు. ఏది నిజమో, ఏది అవసరమో, దేన్ని కొనాలో, దేన్ని దాటవేయాలో ఆలోచించి సోషల్ మీడియాని సంయమనంతో వినియోగిస్తే లాభం లేకపోయినా నష్టం నుంచి దూరంగా ఉండవచ్చు.
10 సూత్రాలతో పదిలం!
1. చూసిన ప్రతిదాన్ని నిజమని నమ్మకండి. మూలం తెలుసుకోండి.
2. ప్రతి విషయానికీ స్పందించాల్సిన అవసరం లేదు. కొన్నింటికి మౌనమే మంచి సమాధానం.
3. ఇతరులతో పోల్చుకోవద్దు. స్క్రీన్ పై కనిపించేది పూర్తి జీవితం కాదు.
4. లైక్‌లు మీ విలువను నిర్ణయించవు. అవి వ్యక్తిగత విలువకు కొలమానం కావు.
5. వ్యక్తిగత సమాచారం జాగ్రత్త. ఫొటోలు, ఫోన్ నంబర్లు, అడ్రస్‌లు, పాస్‌వర్డ్‌లు వంటి వివరాల్లో అప్రమత్తంగా ఉండాలి.
6. కోపంలో కామెంట్‌లు వద్దు. పోస్ట్ చేయడానికి ముందు ఒక్క క్షణం ఆలోచించండి.
7. ప్రతి వైరల్ వీడియో నిజం కాదేమో! ముందు పరిశీలించండి.
8. ఫోన్ కు టైమ్ లిమిట్ తప్పనిసరి. నోటిఫికేషన్లు మీ సమయాన్ని తినేయవద్దు.
9. డీప్‌ఫేక్‌లు, నకిలీ ఖాతాలు, లింకుల విషయంలో జాగ్రత్త. గుడ్డిగా నమ్మేయవద్దు.
10. నిజ జీవితాన్ని మర్చిపోవద్దు. కుటుంబం, స్నేహితులు, చదువు, పని, నిద్ర, ఆరోగ్యం– ఇవన్నీ స్క్రీన్ బయటే ఉన్నాయి.
లైఫ్ అంటే లైక్స్ కాదు!
ఒక ఫొటో పెట్టాం. ఎన్ని లైక్‌లు వచ్చాయి?, ఎవరు కామెంట్ చేశారు?, ఎంతమంది షేర్ చేశారు? లైక్‌లు ఎక్కువైతే ఆనందం. తక్కువైతే నిరాశ. స్పందన రాకపోతే మరో పోస్టు. ఇలా ఇతరుల స్పందనతో మన ఆనందాన్ని కొలిచే అలవాటు సహజమైపోతోంది. ఫోన్ ను కాసేపు పక్కన పెట్టినా.. ‘ఏదైనా మెసేజ్ వచ్చిందా?’, ‘ఎవరైనా కామెంట్ చేశారా?’, ‘కొత్తగా ఏమైనా జరిగిందా?’’ అనే ఆలోచన మళ్లీ ఫోన్ వైపు తీసుకెళ్తుంది.
స్వీయ నియంత్రణ
సోషల్ మీడియాలో పెద్ద సమస్యల్లో ఒకటి సెల్ఫ్ అసెస్‌మెంట్ కోల్పోవడం. ఏది చూడాలి?, ఎంతసేపు చూడాలి?, దేనిని ఫాలో అవ్వాలి?, దేనిని పట్టించుకోకూడదు?, ఏ కామెంట్‌కు స్పందించాలి?, ఏ విషయాన్ని వదిలేయాలి? ఈ హద్దులు మనమే నిర్ణయించుకోవాలి. కానీ నిరంతరం వస్తున్న కంటెంట్ మధ్య మనకు అవసరమైనది, మనకు హాని చేసేది గుర్తించడం కష్టమవుతోంది.
⇒ పొద్దున్న లేవగానే కళ్లు కూడా పూర్తిగా తెరవకుండానే చేతులు మొట్టమొదట వెతికేది ఫోన్‌నే! అయితే, మనల్ని ఇంతలా అడిక్ట్ చేస్తున్న ఈ డిజిటల్ ప్రపంచం వెనుక కొన్ని సరదా, విచిత్రమైన రీసెర్చ్ నిజాలు దాగున్నాయి.
⇒ మీ జేబులో ఫోన్ లేకపోయినా, అసలు మెసేజ్ రాకపోయినా ‘ఫోన్ వైబ్రేట్ అయిందేమో‘ అనిపించిందా?. దానినే ఫాంటమ్ వైబ్రేషన్ సిండ్రోమ్ అంటారు. సర్వేల ప్రకారం 90% పైగా స్మార్ట్‌ఫోన్ వినియోగదారులు ఈ ఫాంటమ్ వైబ్రేషన్ ని అనుభవిస్తారు. మన మెదడు నోటిఫికేషన్ల కోసం ఎంతగా ఆరాటపడుతుందంటే, చిన్న కండరాల కదలికను కూడా ఫోన్ వైబ్రేషన్ అనుకుని భ్రమపడుతుంది!
⇒ ఫోన్ చార్జింగ్ అయిపోతుందేమో, లేదంటే నెట్‌వర్క్ పోతుందేమో అని కలిగే భయాన్ని ‘నోమో ఫోబియా’ అని పిలుస్తారు. అంటే మనం రోజులో చాలాసార్లు ఈ ఫోబియా బారిన పడుతుంటాం.
⇒ ఆన్ లైన్ లో 90% మంది కేవలం లర్కర్స్. అంటే వీరు సోషల్ మీడియా పోస్టులను సైలెంట్‌గా చూసి వెళ్లిపోతారు.
⇒ రీసెర్చ్ ప్రకారం, ఫోన్ పోయినా లేదా చార్జింగ్ ఐపోయినా మనుషుల్లో పెరిగే హార్ట్‌బీట్ రేట్, భయం... ఎదురుగా ఒక పాము వచ్చినప్పుడు కలిగే భయంతో సమానమట!
⇒ సోషల్ మీడియాలో ‘పర్ఫెక్ట్ లైఫ్’ చూపించడం ఒక పెద్ద టాస్క్. ఒక అధ్యయనం ప్రకారం, 30% కంటే ఎక్కువ మంది తాము వెళ్లని ప్రదేశాల్లో ఉన్నట్టు, లేదా కొనని వస్తువులను కొన్నట్టు సోషల్ మీడియాలో బిల్డప్ ఇవ్వడానికి అబద్ధాలు చెప్తారట!
⇒ ఇన్ స్ట్రాగామ్‌లో ఫొటో పెట్టడానికి ప్లేట్ ముందు పెట్టుకుని, పది నిమిషాలు యాంగిల్స్ వెతికే అలవాటు మీకూ ఉందా? ఒక అధ్యయనం ప్రకారం, సోషల్ మీడియా లవర్స్ తమ జీవితంలో సగటున కనీసం ఆరు నెలల కాలాన్ని కేవలం ఫొటోలు తీయడానికి, పర్ఫెక్ట్ ఫిల్టర్ ఎంచుకోవడానికే కేటాయిస్తారు.
రమా జంబుల


