breaking news
Moral lessons
-
అందరికంటే నేనే గొప్ప అనుకుంది.. చివరికి ఇలా అయింది!
పల్లమాల గ్రామంలో చెంగయ్య, బంగారమ్మ అనే రైతు దంపతులు ఉండేవారు. చెరువు కింద ఉన్న మూడు ఎకరాల మాగాణిలో వారు ఎంతో కష్టపడి వ్యవసాయం చేసేవారు. నాగలి, కాడి, పట్ర, పార, కొడవలి వంటి వ్యవసాయ పనిముట్లను పని ముగిసిన తర్వాత శుభ్రం చేసి ఒక గదిలో భద్రంగా ఉంచేవారు.రాత్రిళ్లు ఆ పనిముట్లన్నీ తమ యజమాని గురించి మాట్లాడుకునేవి. ‘మన రైతు కష్టానికి తగిన ఫలితం రావాలి’ అని అన్నీ కోరుకునేవి. కానీ కాడికి మాత్రం గర్వం ఎక్కువ. ‘నాగలి, ఎద్దులు ఉన్నా నేను లేకుండా పొలం దున్నలేరు. అందరిలో ముఖ్యమైనది నేనే!’ అని విర్రవీగేది.అప్పుడు పట్ర నవ్వుతూ, ‘బంగారమ్మ నీకే పసుపు రాసి బొట్టు పెట్టి నమస్కరిస్తుంది. నీ విలువ అందరికంటే ఎక్కువ కదా!’ అని అంది.‘అది నాకిచ్చే గౌరవం కాదు. ఎద్దుల మెడకు గాయాలు కాకూడదనే వారి జాగ్రత్త అంతే!’ అని కాడి నిర్లక్ష్యంగా జవాబిచ్చింది.మిగతా పనిముట్లన్నీ రైతు కష్టం, పంటల గురించి మాట్లాడుతుంటే, కాడి మాత్రం, ‘ఇకపై కష్టపడను. ఎప్పటికీ ఈ గదిలో హాయిగా విశ్రాంతి తీసుకునే ఉపాయం నాకు తెలుసు, తొందరలో చేసి చూపిస్తాను’ అని చెప్పింది.ఒక రోజు కాడి దుక్కి దున్నుతున్న సమయంలో ముందు చెప్పినట్లే చేసింది. కావాలనే రెండుగా విరిగి పోయింది. చెంగయ్య దానిని గదిలో పెట్టి, కొత్త కాడిని తయారు చేయించుకున్నాడు. ‘ఇప్పుడు నాకు శ్రమ లేదు!’ అని కాడి సంతోషపడింది. కానీ మిగతా పనిముట్లు దాని మూర్ఖత్వానికి బాధపడ్డాయి.కొన్ని రోజుల తర్వాత భోగి పండుగ వచ్చింది. భోగి పండుగ రోజు చెంగయ్య, ‘ధనయ్యా! గదిలో ఉండే విరిగిన కాడిని తీసుకురా. భోగి మంటలో వెయ్యి, బాగా మండుతుంది’ అన్నాడు.ధనయ్య కాడిని భోగి మంటల్లో వేశాడు. మంటలు ఎగసి పడుతుండగా, గర్వంతో పని చేయకుండా తప్పించుకోవాలని చూసిన కాడి తన తప్పు తెలుసుకుంది. కానీ అప్పటికే ఆలస్యమైపోయింది. మంటల్లో కాలిపోతున్న దాన్ని చూసి మిగిలిన పనిముట్లన్నీ మౌనంగా బాధపడ్డాయి. అలా కాడి అలిగింది. భోగిలో కాలింది.- పేరూరు బాలసుబ్రమణ్యంఇదీ చదవండి: ఇంటర్వ్యూలో సెలెక్ట్.. కానీ ఉద్యోగం ఇవ్వలేదు! కారణం తెలిస్తే షాకే! -
దైవాన్ని ప్రేమించాలంటే.. ముందు మనిషిని ప్రేమించాలా?
సృష్టికర్త దృష్టిలో మనుషులందరూ ఒకే కుటుంబం. జాతి, వర్ణం, భాష, దేశం, సంపద అనే భేదాలు మనుషులు నిర్మించుకున్న కృత్రిమ గోడలే తప్ప గొప్పతనానికి కొలమానాలు కావు. నిజమైన శ్రేష్ఠత కేవలం సత్ప్రవర్తన, దైవభీతి, పరోపకారంలోనే ఉంది. దివ్య బోధనల్లో ద్వేషానికి తావులేదు, ప్రేమ ఉంది; అహంకారానికి ఆస్కారం లేదు, వినయం ఉంది. ఈ ఉదాత్తమైన సూత్రాలే ధార్మిక మానవతా దృక్పథానికి మూలస్తంభాలు.ఈ మానవీయ దృక్పథానికి శిఖరాగ్రం ఏమిటంటే, ఒక నిరపరాధి ప్రాణాన్ని కాపాడటం సమస్త మానవాళిని రక్షించడంతో సమానమని చాటిచెప్పడమే. ధర్మం మనుషుల మధ్య గోడలు కట్టదు, హృదయాలను కలుపుతుంది. దేవుని ప్రేమను కోరుకునే హృదయమేదైనా మొదట సృష్టిని ప్రేమించడం నేర్చుకోవాలి. మానవత్వం లేని మతం ఊపిరి లేని శరీరమైతే, నైతిక మూల్యాలతో వికసించిన మానవత్వమే ఈ భూమిపై దైవకరుణకు సజీవ సాక్ష్యం.ఈ సత్యం ఆచరణలోకి వచ్చినప్పుడే ఆధ్యాత్మికతకు పరిపూర్ణత్వం చేకూరుతుంది. అందుకే ధర్మం అంటే కేవలం ఆచారాలు, ప్రార్థనలకే పరిమితం కాదు; అది మనిషిలోని మానవత్వాన్ని మేల్కొలిపే జీవన విధానం. నిజమైన ధార్మికత మనిషిని కేవలం ఆరాధనలకే పరిమితం చేయదు; ఆకలితో ఉన్న వారిని, అనాథలను, బలహీనులను ఆడుకునేలా తీర్చిదిద్దుతుంది. స్వార్థానికి అతీతంగా, చివరకు తమకు వ్యతిరేకమైనా సరే న్యాయం వైపే నిలబడే సత్యసంధతను నూరిపోస్తుంది.– ఎం.డి. ఉస్మాన్ ఖాన్ -
‘చిన్న ముల్లుకే ఏడుస్తావా?’.. కోతికి చివర్లో దిమ్మతిరిగే గుణపాఠం!
అనగనగా ఒక అడవిలో ఒక కోతి ఉండేది. ఆ కోతి చాలా తుంటరిది. ఎప్పుడూ చెట్ల మీద గంతులు వేస్తూ అడవిలో ఉన్న జంతువులను వెక్కిరిస్తూ ఉండేది. ఏవైనా జంతువులు కష్టంలో ఉంటే సహాయం చేయకపోగా, వాటిని ఎగతాళి చేస్తూ కాలక్షేపం చేసేది.ఒకరోజు కోతి విహారానికి నడుచుకుంటూ వెళుతుండగా, దారిలో ఒక ఎలుగుబంటికి కాలికి ముల్లు గుచ్చుకొని బాధపడుతూ కనిపించింది. ఎలుగుబంటి ఆ ముల్లును బయటకు తీయడానికి నానా ఇబ్బందులు పడుతోంది. అది చూసిన కోతి, ‘ఛీ! ఇంత చిన్న ముల్లుకి ఎందుకు అంతలా ఏడుస్తున్నావు? నువ్వు చాలా పిరికిదానివి!’ అని ఎలుగుబంటిని చూసి ఎగతాళి చేసింది. ఎలుగుబంటి బాధగా, ‘ఇది నీకు చిన్న విషయంగా అనిపించవచ్చు. కానీ, నొప్పి ఎలా ఉంటుందో తెలిస్తే ఇలా అనవు!’ అని అక్కడి నుండి కుంటుతూ వెళ్లిపోయింది. కోతి మాత్రం నవ్వుకుంటూ ముందుకు వెళ్ళిపోయింది.దారిలో ఒక ఏనుగు గుండ్రంగా తిరుగుతూ, తొండాన్ని ఊపుతూ కనిపించింది. తొండానికి తేలు కుట్టడంతో ఏనుగు నొప్పిని భరించలేక అల్లాడిపోతోంది. అప్పుడు అక్కడికి వచ్చిన కోతి, ‘ఏంటీ? ఒక చిన్న తేలు కుడితేనే కొండలా ఉన్న నువ్వు ఇంతలా విలవిల్లాడిపోతున్నావా? నేనైతే అస్సలు పట్టించుకోను. నువ్వు ఎంత పిరికి దానివి!’ అని ఏనుగును కూడా వెక్కిరించింది. కోతి మాటలకు ఏనుగు ఎంతో బాధపడింది. ఏనుగు బాధను చూసి కోతి ఏమాత్రం కనికరించకుండా తన దారిలో వెళ్ళిపోయింది.మరో రోజు, ఒక నెమలి వర్షంలో తడిసి రెక్కలు బరువెక్కడంతో ఎగరలేక కిందపడి ఇబ్బంది పడుతుంటే, కోతి చెట్టు మీద నుండి పండ్లు విసురుతూ, ‘పురివిప్పి నాట్యం చేయలేని నెమలి దేనికీ పనికిరాదు. రెక్కలు మొద్దుబారిన నువ్వు అడవిలో ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే!’ అని వెక్కిరించింది. ఇలా ఎదుటివారి బాధను చూసి కోతి ప్రతిసారీ నవ్వుకుంటూనే ఉండేది.కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు కదా! ఒకరోజు కోతి చెట్టు మీద నుండి కిందకు దూకుతుండగా, ఒక వేటగాడు పన్నిన వలలో చిక్కుకుంది. ఆ వలలో ఉన్న పదునైన ఇనుప ముళ్లు కోతి కాలికి, తోకకు బలంగా గుచ్చుకున్నాయి. కోతి నొప్పి తట్టుకోలేక, ‘అమ్మో! ఎంత నొప్పి! ఎవరైనా నన్ను కాపాడండి! నేను భరించలేకపోతున్నాను!’ అని పెద్దగా అరుస్తూ ఏడవసాగింది.కోతి అరుపులు దూరంగా ఉన్న ఏనుగుకి, ఎలుగుబంటికి, నెమలికి వినిపించాయి. అవి వెంటనే అక్కడికి పరిగెత్తుకుంటూ వచ్చాయి. కోతి తన కాలికి ముళ్లు గుచ్చుకుని, విలవిల్లాడుతుండటం చూశాయి.అప్పుడు కోతికి అర్థమైంది, ఎదుటివారి బాధను తక్కువ చేసి మాట్లాడటం తప్పు అని. ఎలుగుబంటి, ఏనుగు, నెమలి అన్నీ కలిసి కోతి దగ్గరకు వచ్చాయి. ఆ జంతువులన్నింటినీ చూసి కోతి కళ్లు చెమ్మగిల్లాయి. ఎలుగుబంటి, ఏనుగు జాగ్రత్తగా వల నుండి కోతిని విడిపించి, ఆ ముళ్లను తొలగించి దానికి సహాయం చేశాయి.తను చేసిన తప్పుకు చాలా సిగ్గుపడింది కోతి. ‘మిమ్మల్ని ఇంతకుముందు నేను ఎంతగానో ఆటపట్టించాను. కానీ, మీరు ఇప్పుడు నాకు సహాయం చేశారు. ఎవరి బాధ ఎంతటిదో, అది మనదాకా వస్తేనే తెలుస్తుంది!’ కన్నీళ్లతో అంది కోతి. అప్పటి నుండి కోతి ఏ జంతువునూ తక్కువ చేసి మాట్లాడలేదు. ‘ఎదుటివారి కష్టాన్ని చూసి నవ్వడం కంటే, ఆదుకోవడం మిన్న!’ అని తెలుసుకుంది. హితవచనం..అపకృత్య బుద్ధిమతో దూరస్థోస్మీతి నాశ్వసేత్దీర్ఘా బుద్ధిమతో బాహూ యాభ్యాం హింసతి హింసితః - బుద్ధిమంతుడికి అపకారం చేసి, దూరంగా పారిపోయి, ‘అతడికి దూరంగానే ఉన్నాను కదా, నాకేం భయంలేదు’ అనుకోవడం బుద్ధితక్కువ పని. బుద్ధిమంతుడు తనను హింసించినవాడు ఎక్కడున్నా పట్టుకుని, ప్రతీకారం తీర్చుకోగలడు.- శోభా సురేష్ -
తండ్రిని కాపాడిన 10 ఏళ్ల కూతురు.. కథ తెలిస్తే కన్నీళ్లు వస్తాయి!
ఒక చిన్న గ్రామంలో రాము, అతని పదేళ్ల కూతురు చైత్ర నివసిస్తున్నారు. రాముకు చదువు రాదు. ఊళ్లో చిన్న కిరాణా కొట్టు నడుపుతుంటాడు. కానీ, అతనికి ఒక చెడ్డ అలవాటు ఉంది. రోజంతా సంపాదించిన డబ్బుతో సాయంత్రం కాగానే స్నేహితులతో కలిసి పేకాట ఆడుతూ కూతురు చదువు గురించి అస్సలు పట్టించుకునేవాడు కాదు.కానీ చైత్ర చాలా చురుకైన పిల్ల. ఎలాగైనా చదువుకుని గొప్ప ఆఫీసర్ అవ్వాలని, నాన్నను మార్చాలని అనుకునేది. ఒకరోజు రాము పేకాటలో ఓడిపోయి, ఇంటికి వచ్చాడు. చైత్ర చేతిలో ఒక స్టాంప్ కాగితం పెట్టి, ‘చైతూ.. ఇందులో ఏముందో చదువు. మా స్నేహితుడు దీనిపై సంతకం పెడితే వెయ్యి రూపాయలు ఇస్తానన్నాడు‘ అన్నాడు. చైత్ర ఆ కాగితం చదివి ఒక్కసారిగా షాక్ అయ్యింది. అది వాళ్ల కిరాణా కొట్టును ఆ స్నేహితుడికి రాసిచ్చే పత్రం!చైత్ర నాన్న చేతులు పట్టుకుని, ‘నాన్న! చదువుకోకపోతే సమాజం మనల్ని ఎలా మోసం చేస్తుందో చూశావా? నువ్వు సంతకం పెడితే మనకున్న ఒకే ఒక్క ఆధారం పోయేది. నువ్వు మారాలి నాన్న‘ అంటూ ఏడ్చేసింది. రాముకు ఒక్కసారిగా కళ్లు తెరుచుకున్నాయి. ఆ రోజు నుంచి రాము పేకాట మానేశాడు. ప్రతి సాయంత్రం చైత్ర పక్కన కూర్చుని, కూతురి దగ్గరే అక్షరాలు నేర్చుకోవడం మొదలుపెట్టాడు. కూతురిని బాగా చదివించాడు. కొన్నేళ్ల తర్వాత చైత్ర పెద్ద ఆఫీసర్ అయ్యింది. ఆ రోజు రాము అందరితో, ‘నన్ను దారికి తెచ్చిన నా గురువు నా కూతురే‘ అని గర్వంగా చెప్పుకున్నాడు.ఇవి కూడా చదవండి: నిచ్చెన ఎక్కేప్పుడు కాళ్లు ఎందుకు వణుకుతాయి? -
నీతులు చెప్పే చైనాకు.. బాన్కియావో ఘోరకలి గుర్తుందా?
హిమాలయ ప్రాంతంలో ఆకస్మిక వరదలు బీభత్సం సృష్టిస్తున్న వేళ.. చైనా తీరు వివాదాస్పదంగా మారింది. ఫ్లాష్‌ఫ్లడ్స్ గురించి సమాచారం ఉన్నప్పటికీ చైనా తమను హెచ్చరించలేదని నేపాల్ ఆరోపించింది. అయితే చైనా మాత్రం ఆ ఆరోపల్ని ఖండించింది. ఇలాంటి సమయంలో ఆరోపణలు కాదని.. ఇరు దేశాలు పరస్పర సహకారంతో పనిచేయాలని.. ప్రజల ప్రాణాలను కాపాడటమే లక్ష్యంగా ఉండాలని సూచించింది. దీంతో చైనా చెబుతున్న సహకార నీతుల నేపథ్యంలో గతంలో అదే గడ్డపై జరిగిన అతిపెద్ద డ్యామ్ విపత్తు మరోసారి చర్చకు వచ్చింది.బుధవారం నేపాల్‌లోని పలు జిల్లాలను ఆకస్మిక వరద ముంచెత్తింది. ఇళ్లు, దుకాణాలు, రహదారులు, వంతెనలు.. ఊర్లకు ఊళ్లే వరద ఉధృతికి కొట్టుకుపోయాయి. టిబెట్ సరిహద్దులోని చైనా రీజియన్‌లో మంచు ఫలకాలు కూలిపోవడం వల్ల భారీగా నీరు ఒక్కసారిగా దిగువకు వచ్చిందని ఓ అంచనాకు వచ్చారు. అదే సమయంలో సరిహద్దు ప్రాంతాల్లో చైనా చేపడుతున్న మౌలిక వసతుల నిర్మాణాలపై కూడా నేపాల్‌లోని కొందరు నిపుణులు, జర్నలిస్టులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.వాస్తవానికి హిమాలయ ప్రాంతంలో హిమానీనదాలు, హిమ సరస్సులు, కొండచరియలు, భారీ వర్షాలు, నదీ ప్రవాహాలపై ఎప్పటికప్పుడు సమాచారం ఉండటం దిగువ దేశాలకు అత్యంత కీలకం. టిబెట్‌లో చోటుచేసుకునే ప్రకృతి పరిణామాలు నేపాల్‌లోని నదులపై తక్కువ సమయంలోనే ప్రభావం చూపే అవకాశం ఉంటుంది. అందుకే ప్రమాదకర పరిస్థితి ఏర్పడిన వెంటనే దిగువ ప్రాంతాలకు హెచ్చరికలు పంపాల్సిన అవసరం ఉంది. ఇదే విషయంలో నేపాల్ ప్రధానంగా ప్రశ్నలు లేవనెత్తుతోంది.చైనా చరిత్రలో మాయని మచ్చనేపాల్ ఆరోపణల నేపథ్యంలో.. 1975లో చైనాలో జరిగిన బాన్కియావో డ్యామ్(Banqiao Tragedy) విపత్తు మళ్లీ గుర్తుకొస్తోంది. హెనాన్ ప్రావిన్స్‌లోని రు నదిపై నిర్మించిన బాన్కియావో డ్యామ్‌ను వరద నియంత్రణ, సాగునీరు, విద్యుత్ ఉత్పత్తి కోసం నిర్మించారు. నిర్మాణం పూర్తయిన కొద్దికాలానికే డ్యామ్, గేట్లలో పగుళ్లు కనిపించడంతో సోవియట్ ఇంజినీర్ల సాయంతో మరమ్మతులు చేపట్టారు. అయితే ఆ తర్వాత అది ‘ఐరన్ డ్యామ్’గా పేరుపొందింది.కానీ 1975 ఆగస్టులో టైఫూన్ నినా కారణంగా హెనాన్‌లో ఊహించని స్థాయిలో వర్షపాతం నమోదైంది. కేవలం మూడే రోజుల్లో.. ఏడాది మొత్తంలో కురిసే వర్షపాతం రికార్డైంది. దీంతో బాన్కియావో రిజర్వాయర్‌లోకి తీవ్ర ఉధృతిలో నీరు వచ్చి చేరింది. అయితే అప్పటికే పరిస్థితి పూర్తిగా అదుపు తప్పింది.ఒక రాత్రిలో 62 డ్యామ్‌లు!1975 ఆగస్టు 8 అర్ధరాత్రి దాటిన కొద్దిసేపటికే బాన్కియావో డ్యామ్ తెగిపోయింది. భారీగా నీరు దిగువ ప్రాంతాలపైకి దూసుకొచ్చింది. బాన్కియావోకు సుమారు 32 కిలోమీటర్ల దూరంలో ఉన్న షిమాంటన్ డ్యామ్ కూడా దెబ్బతింది. అనంతరం వరుసగా అనేక చిన్న రిజర్వాయర్లు, డ్యామ్‌లు నాశనం అవుతూ వచ్చాయి. వాటిలో కొన్నింటిని వరద నీటి మల్లింపు కోసం కావాలనే ధ్వంసం చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. అలా మొత్తం 62 దాకా డ్యామ్‌లు నాశనం అయినట్లు తర్వాత వివిధ నివేదికలతో వెలుగులోకి వచ్చింది. 2 లక్షల మందికిపైనే..ఈ విపత్తులో మృతుల సంఖ్యపై ఇప్పటికీ ఓ స్పష్టత లేదు. ఆ టైంలో చైనా మీడియా తీవ్రమైన గోప్యత ప్రదర్శించింది. అయితే వరదల కారణంగా 26 వేల మంది మరణించినట్లు 2017లో ప్రిన్స్టన్, సింఘువా విశ్వవిద్యాలయ పరిశోధకుల అధ్యయనం పేర్కొంది. కరువు, ఆకలి, అంటువ్యాధుల కారణంగా మరో లక్ష మందికి పైగా మరణించి ఉండొచ్చని ఆ అధ్యయనం అంచనా వేసింది.అయితే మరికొన్ని అంచనాలు మాత్రం ఆ మరణాల సంఖ్య 2.3 లక్షల వరకు ఉండొచ్చని పేర్కొన్నాయి. ఈ సంఖ్యను కొందరు చైనా నిపుణులు అంచనా వేసినట్లు హ్యూమన్ రైట్స్ వాచ్ నివేదికలు ప్రస్తావించాయి. మరణాల సంఖ్యను పక్కన పెడితే.. దాదాపు కోటి మంది ఈ విపత్తు ప్రభావానికి గురైనట్లు అంచనాలు ఉన్నాయి.సమాచారం ఇవ్వక.. విషాదాన్ని దాచి!బాన్కియావో విషాదంలో చైనాపై మరో తీవ్రమైన ఆరోపణ ఉంది. హెచ్చరికలు సరిగా చేరకపోవడం, అధికారుల నిర్ణయాల్లో జాప్యం, కమ్యూనికేషన్ వ్యవస్థలు దెబ్బతినడం కూడా విపత్తు తీవ్రతను పెంచినట్లు తరువాతి అధ్యయనాలు వెల్లడించాయి. అటుపై ఈ విపత్తు పూర్తి స్థాయిని ప్రపంచానికి వెల్లడించలేదని పలు నివేదికలు పేర్కొన్నాయి. దీంతో డ్యామ్‌ల వైఫల్యం, ప్రాణనష్టం, సహాయక చర్యల దుస్థితి వంటి అంశాలు విస్తృతంగా బయటకు రావడానికి చాలా సంవత్సరాలే పట్టింది. ప్రస్తుతం నేపాల్–టిబెట్ సరిహద్దులో జరుగుతున్న పరిణామాలు ఈ పాత ఘటనతో ఈ పాతగాయం మళ్లీ తెరపైకి వచ్చింది. అయితే నైతిక పాఠాలు చెప్పే చైనా.. తన పౌరుల భద్రతతో పాటు పొరుగు దేశాల ప్రజల ప్రాణాల విషయంలోనూ అదే పారదర్శకత, బాధ్యతను ప్రదర్శించాల్సిన అవసరం ఉంది. ప్రకృతి విపత్తులు సరిహద్దులు చూడవు.. అలాంటి సమయంలో సమాచారం దాచడం కంటే, ముందస్తు హెచ్చరికలు ఇవ్వడం, సహకారంతో వ్యవహరించడమే నిజమైన మానవత్వం. గత విషాదాల నుంచి పాఠాలు నేర్చుకుని.. భవిష్యత్తు ప్రమాదాలను తగ్గించడమే ప్రతి దేశం ముందున్న అసలైన బాధ్యత.ఇదీ చదవండి: ఇరాన్ కళ్లుగప్పి అమెరికా అంత పని చేసిందా? -
కండ బలం కొన్నాళ్ళే.. అతి సమీప బంధువు
ఒక ఊర్లో గాడి తప్పిన యువకుడు ఒకడుండేవాడు. ఇతరులతో అకారణంగా గొడవ పడేవాడు. అందరినీ కొట్టి తిట్టేవాడు. వాడి అకృత్యాలకు గ్రామస్తులు ఎందరో విసిగిపోయారు. అతనికి బుద్ధి చెప్పడానికి తగిన మార్గం కానరాక సమయం కోసం ఎదురు చూస్తున్నారందరూ! ఒకరోజు ఓ వృద్ధురాలు తన ఇంటి ముందర ఉడకబెట్టిన వడ్లను ఆరబెడుతోంది. దారిన పోతున్న ఆ యువకుడు వడ్లను తన్ని వెళ్ళిపోయాడు. కన్నీళ్లు పెట్టుకుంటూ ఆ వృద్ధురాలు ‘‘కండ బలం కొన్నాళ్ళే. దాన్ని చూసి మురిసిపోవద్దు. అతి సమీప బంధువు వచ్చిన రోజున తెలుస్తుంది నీకు అసలు విషయం’’ అని తిట్టి పోసింది.అక్కడినుంచి అయితే ఆ యువకుడు వచ్చేశాడు కానీ అతి సమీప బంధువు ఎవరో తెలుసుకో వాలనిపించింది. తనను ‘డీ’ కొట్టేంత మొనగాడు ఎవడో కళ్ళారా చూడాలనిపించింది. పక్క ఊర్లో ఉన్న తమ దాయాదుల ఇళ్లకు వెళ్ళాడు. ‘నాకు అతి దగ్గర బంధువు ఎవరు’ అని ఆరా తీశాడు.దగ్గరి బంధువులు ఉన్నారు కానీ, నీతో తలపడేంత గట్టి మనుషులు ఎవ్వరూ లేరని వారు సర్ది చెప్పి పంపారు. అతడి అహం సంతోషించింది కానీ, శత్రు శేషం ఉండరాదని గట్టిగా భావించిన అతడు శపించిన వృద్ధురాలినే అడిగి తెలుసుకుందా మనుకున్నాడు. ఆ వృద్ధురాలి ఇంటికి వెళ్ళాడు. అతడి రాక విషయం తెలిసి ఆమె అప్పటికే ఊరు విడిచి వెళ్ళి పోయింది.తిన్నగా తన ఇంటికి వెళ్ళాడు. అమ్మ అన్నం తినమని పిలిచింది. వద్దన్నాడు. ఆకలి కాలేదన్నాడు. కారణమేమిటని అడిగింది. విషయం చెప్పాడు. ఆమె చిన్నగా అతడి భుజం తట్టుతూ ‘‘ఎవ్వరికైనా అతి సమీప బంధువు మృత్యువు. అది మన నీడ లాగా మనతోనే ఉంటుంది. ఎప్పుడు మనల్ని కబళిస్తుందో మనకు తెలియదు. చనిపోయే సమయంలో మనం చేసిన ΄ాపపుణ్యాలు గుర్తుకు వస్తాయని పెద్దలు చెబుతారు. ఆ విషయమే ఆమె నిన్ను హెచ్చరిక చేసింది’’ అన్నాడు.‘‘ఆ బంధువు ఎప్పుడు వచ్చేదీ మనకు తెలియదా? తెలిస్తే ఆ బంధువుని మూడు చెరువుల నీళ్ళు తాగించాలని ఉంది’’ అని గర్వంగా అన్నాడు. ఆమె నవ్వి ‘‘ఎప్పటికీ ఎవ్వరికీ అర్థం కానిది మృత్యువు. అది ఎప్పుడు వస్తుందో, ఎప్పుడు వెళ్తుందో తెలుసుకోవడం ఎవ్వరి తరం కాదు. వచ్చినప్పుడు తప్పించుకోవడానికి కూడా ఎవ్వరికీ సాధ్యం కాదు. అందుకే అది వచ్చేలోగా మనం మంచి పనులు చేయాలని చెబుతారు. ఒకర్ని నొప్పించే పనులు చేయవద్దని అంటారు’’ అని వివరించింది.ఏ క్షణాన అయినా వచ్చే అతి సమీప బంధువు గురించి అవగాహన వచ్చింది అతడికి. క్షమాపణలు చెబుదామని ఆ వృద్ధురాలిని వెదకడం కోసం బయలుదేరాడు.– ఆర్.సి. కృష్ణస్వామి రాజు -
Moral Story: ఆ పక్షులు నవ్వాయి.. పెద్దల మాట వినాలి!
అనగా అనగా ఒక అడవిలో పక్కపక్కనే రెండు రావిచెట్లు ఉండేవి. వాటి మీద పక్షులు గూళ్లు కట్టుకొని నివసిస్తున్నాయి. వాటిల్లో ఒక గుడ్లగూబ కూడా ఉండేది. అక్కడున్న పక్షుల్లో అదే పెద్ద వయసున్న పక్షి కావడంతో అప్పుడప్పుడూ మిగిలినవాటికి సలహాలు, సూచనలు ఇచ్చేది. ఆ మాటల్ని కొన్ని పక్షులు వినేవి. మరికొన్ని మాత్రం లక్ష్యపెట్టేవికావు. రెండు రావిచెట్లు గుబురుగా పెరగడంతో ఒకదాని కొమ్మలు మరొక చెట్టుతో రాసుకుంటూ ఉండేవి. భారీ గాలివానలొచ్చినప్పుడు చెట్లు కూలిపోతాయేమో అన్నంతగా కదిలి΄ోయేవి. ఆ పరిస్థితి చూసిన గుడ్లగూబ ‘ఈ చెట్లు చాలా ఏళ్ల నాటివి. ఎప్పుడైనా ఇవి కూలి΄ోయే ప్రమాదం ఉంది. మనందరం కొత్త చెట్టు చూసుకోవాలి’ అని చెప్పేది. కొన్ని పక్షులు బద్దకంతో ‘తర్వాత చూసుకుందాం’ అన్నాయి. మరికొన్ని పక్షులు ‘నీదంతా చాదస్తం. మరో వందేళ్లయినా ఈ చెట్టుకు ఏమీ కాదు’ అని చెప్పాయి. వానాకాలం మొదలైంది. కొద్దిగా జల్లులు కురుస్తున్న సమయంలో గుడ్లగూబ మరోసారి రెండు చెట్ల మీదున్న పక్షుల వద్దకు వెళ్లి–‘వానలు మొదలయ్యాయి. ఈ రెండు చెట్లు ఇప్పటికే బలహీనంగా తయారయ్యాయి. వాటి వేర్లు భూమిలోనుంచి బయటకు వచ్చేశాయి. వెంటనే మనమంతా మరో చెట్టు చూసుకుందాం’ అని చెప్పింది. కానీ ఎవరూ ఆ మాట లక్ష్యపెట్టలేదు. దీంతో చేసేదిలేక గుడ్లగూబ దగ్గర్లో ఉన్న మరో చెట్టు మీద కొత్తగా గూడు కట్టుకుని అక్కడికి వెళ్లిపోయింది. గుడ్లగూబ కొత్తగూడును చూసి కొన్ని పక్షులు నవ్వుకున్నాయి.మరో నెల రోజుల తర్వాత వానలు ఉధృతంగా కురిశాయి. పక్షులు గూళ్లు వదిలి బయటకు రాలేని పరిస్థితి ఏర్పడింది. హోరుగాలికి రావిచెట్లు బలంగా ఊగి, వేర్లతో సహా కూలిపోయాయి. దీంతో చెట్టు మీదున్న పక్షుల గూళ్లన్నీ నీటిలో కొట్టుకుపోయాయి. ఆ కొమ్మల కిందపడి ఎన్నో పక్షులు మరణించాయి. మిగిలిన పక్షులు గూడ్లగూబ ఉన్న చెట్టు మీదకు చేరాయి. ఆ వర్షంలో గూడు కట్టుకునే వీలు లేక వానకు తడుస్తూ ఇబ్బంది పడ్డాయి. ముందే గుడ్లగూబ మాటలు విని ఉంటే తమకు ఈ అవస్థ వచ్చి ఉండేది కాదని, తమ మిత్రులు బతికేవారని అనుకొని బాధపడ్డాయి. -
పిల్లలు స్కూల్ నుంచి రాగానే..వారికి ఏం నేర్పిస్తున్నారు?
పిల్లలు జీవితంలో సక్సెస్ సాధించాలంటే.. వారికి చిన్న వయసులోనే మంచి విలువలు అందించాలి. బాల్యంలో నేర్పించిన విలువలు వారిని జీవితంలో ఉన్నత స్థానంలో నిలబెడతాయి. స్కూల్ నుంచి వచ్చిన తర్వాత పిల్లలకు కచ్చితంగా నేర్పించాల్సిన అలవాట్లు కొన్ని ఉన్నాయి. వాటిని నేర్పిస్తే పిల్లలు పెద్దయ్యాక కూడా మంచి విలువలతో బతుకుతారు. ఆ అలవాట్లు ఏంటో తెలుసుకుందాం.పిల్లలు స్కూల్ నుంచి రాగానే వారి బ్యాగుల్ని, వస్తువుల్ని చక్కగా సర్దుకునే అలవాటు నేర్పించాలి. చక్కగా సర్దుకోవడం నేర్చుకుంటే వారి వస్తువుల్ని ఎక్కడ పెట్టారో అన్న క్లారిటీ వారికి ఉంటుంది. మార్నింగ్ స్కూల్ వెళ్లే టైమ్‌లో హడావిడి పడుకుండా తమ వస్తువుల్ని సులభంగా కనుగొంటారు. అంతేకాకుండా వారి పనుల్ని స్వయంగా చేసుకోవడం అలవాటు చేసుకుంటారు. రేపు భవిష్యత్తులో దూర్రప్రాంతాలకు వెళ్లి అక్కడ ఉండాల్సినప్పుడు ఈ అలవాటు ఎంతగానో ఉపయోగపడుతుంది. అందుకే పిల్లలు స్కూల్ నుంచి రాగానే బ్యాగు, వారి వస్తువులను సరైన స్థలంలో పెట్టేలా వారికి నేర్పండి.కాళ్లు, చేతులు, ముఖం కడుక్కోవడం...పిల్లలు ఆరోగ్యంగా ఉండాలంటే వ్యక్తిగత పరిశుభ్రత ఎంతో ముఖ్యం. పిల్లలు స్కూల్ నుంచి వచ్చిన వెంటనే చేతులు, ముఖం కడుక్కోవడం గురించి చెప్పండి. ఇది వారిని ఆరోగ్యంగా ఉంచడమే కాకుండా వ్యాధులను దూరంగా ఉంచుతుంది. పిల్లలు స్కూల్ నుంచి రాగానే వారి యూనిఫామ్ తీసివేయమని చెప్పండి. ఆ తర్వాత చేతులు, ముఖం వాష్ చేసుకోమని వారికి చెప్పండి. ఈ అలవాటు నేర్చుకోవడం వల్ల పరిశుభ్రత ఎంతో కీలకమని తెలుసుకుంటారు. ఈ అలవాటు వారిని భవిష్యత్తులో మంచి ఆరోగ్యవంతులుగా తీర్చిదిద్దుతుంది.సమయాన్ని తెలివిగా ఉపయోగించడం...పిల్లలకు తమ సమయాన్ని సరిగ్గా ఉపయోగించుకునే అలవాటును నేర్పించండి. టైమ్ మేనేజ్మెంట్ స్కిల్ వారికి ఎంతగానో సాయపడుతుంది. సకాలంలో వారి పనులు చేసుకోవడం, ఆటలు ఆడుకోవడం, చదువు, హోం వర్క్ వంటి పనులు చేయడం నేర్పించండి. దానికి తగ్గ టైమ్ టేబుల్ వేసి దాని ఫాలో అయ్యేలా ప్లాన్ చేయండి. దీంతో.. వారు సమయాన్ని ఎలా ఉపయోగించుకోవాలో తెలుసుకుంటారు.చదువు, హోం వర్క్...స్కూల్ నుంచి వచ్చిన తర్వాత కాసేపు పిల్లల్ని ఆడుకోనివ్వండి. ఆటల తర్వాత స్నానం చేసేలా ప్రోత్సహించండి. ఆ తర్వాత హోం వర్క్, చదువుకు టైం కేటాయించేలా వారికి అలవాటు చేయండి. ఆటలతోపాటు చదువు ప్రాముఖ్యత వారికి తెలపండి. సబ్జెక్ట్‌ల్లో ఏమైనా డౌట్లు ఉంటే దగ్గరుండి హెల్ప్ చేయండి. హోం వర్క్ పెండింగ్ పెట్టకుండా పూర్తిగా ఫినిష్ చేసేలా ప్లాన్ చేయండి. ఈ అలవాటు వల్ల వారు చదువుల్లో మెరుగ్గా రాణిస్తారు. (చదవండి: వృథాని జీరో చేద్దాం..వేస్ట్‌ని రీయూజ్ చేసేద్దాం..! ది బెస్ట్‌గా..) -
‘ఇసుక తక్కెడ - పేడ తక్కెడ‘ : ఇది ఎలా వచ్చిందంటే!
ఒక ఊరిలో ఇద్దరు దొంగలు వుండేవాళ్ళు. ఒకని ఇల్లేమో ఉత్తరం వైపు, మరొకని ఇల్లేమో దక్షిణం వైపు. వాడు దొంగని వీనికి తెలీదు. వీడు దొంగని వానికి తెలీదు. ఇద్దరూ ఎదుటి వాళ్ళను మాటలతో బోల్తా కొట్టించి మోసం చేయడంలో ఆరితేరినవాళ్లే. ఒకసారి వాళ్ళలో ఒకడు ఒక కావడి తీసుకొని దానికి రెండు వైపులా రెండు ఇసుక కుండలు పెట్టి, అవి కనబడకుండా చిరిగిపోయిన బట్టలు కట్టి భుజానికి తగిలిచ్చుకోని ఎవరిని మోసం చేద్దామా అని వెదుక్కుంటా పోసాగాడు.సరిగ్గా అదే సమయానికి ఇంకొకడు కూడా ఒక కావడి తీసుకోని రెండు వైపులా రెండు పెండతో నింపిన కుండలు పెట్టి, అవి కనబడకుండా ఒక పాత మసిబట్ట కట్టి భుజానికి తగిలిచ్చుకోని మోసం చేయడానికి ఎవరు దొరుకుతారా అని వెదుక్కుంటా బైలు దేరాడు.వాళ్ళిద్దరూ అనుకోకుండా ఒక సత్రం వద్ద కలుసుకున్నారు. వాని మొహం వీడు గానీ, వీని మొహం వాడు గానీ ఎప్పుడూ చూల్లేదు. దాంతో ఇద్దరూ ఎదుటోడు చాలా మంచోడు అని అనుకున్నారు. ఒకరితో ఒకరు మాటల్లో పడ్డారు. మధ్యలో ఇసుక దొంగ ‘అనా.. .. అనా... ఎక్కడికి పోతావున్నావు. ఏముంది నీ కావడిలో అన్నాడు.అప్పుడు వాడు. ‘ఆ... ఏం లేదు. నేను పెద్ద రత్నాల వ్యాపారిని. ఈ రెండు కుండలనిండా మేలు జాతి రత్నాలు వున్నాయి. దారిలో దొంగల భయం ఎక్కువ గదా... అందుకని కుండలకు పాత బట్టలు కట్టినాను. మాపాప పెళ్ళీడు కొచ్చింది. ఈ రత్నాలు అమ్మి బంగారం కొని పాపకు నగలు చేపియ్యాల‘ అన్నాడు.ఆ మాటలు వినగానే ఇసుక దొంగ ‘అబ్బ... వెదకబోయిన తీగ కాలికి తగిలినట్లు వీడు కనబన్నాడు. ఎట్లాగయినా వీన్ని మోసం చేయాలి‘ అనుకున్నాడు. అంతలో పేడ దొంగ ‘అవును... నువ్వేమి చేస్తా వుంటావు. నీ కుండల్లో ఏమున్నాయి‘ అన్నాడు. దానికా ఇసుక దొంగ చిరునవ్వుతో ‘అనా... నేను నీ లాగే వ్యాపారినే. కాకపోతే నగల వ్యాపారిని. మంచి మేలు జాతి రత్నాలు కొని వాటిని బంగారంలో పొదిగి విలువైన హారాలు తయారు చేసి అమ్ముతుంటాను. ఈ రెండు కుండలనిండా బంగారం వుంది. దాన్ని అమ్మి విలువయిన రత్నాలు కొనాలని పోతున్నాను‘ అన్నాడు.ఆ మాటలినగానే పేడదొంగ ‘అబ్బ.... దొరికినాడురా కావలసినోడు. వీన్ని ఎట్లాగయినా మోసం చేసి వీని దగ్గరున్న బంగారం కొట్టేయ్యాలి‘ అనుకున్నాడు. వెంటనే ‘అరెరే... మనిద్దరినీ ఆ దేవుడు ఒక్క చోట కావాలనే కలిపినట్టున్నాడు. నీకు కావలసిన బంగారం నా దగ్గరుంది. నాకు కావలసిన మేలు జాతి రత్నాలు నీ దగ్గరున్నాయి. మనం ఒకరి కావడి మరొకరు మార్చుకుంటే సరి‘ అన్నాడు. ఆ మాటలకు ఇసుకదొంగలోపల్లోపల ‘పడిందిరా పిట్ట‘ అని నవ్వుకుంటా ‘అలాగే నువ్వెలా చెప్తే నేనలాగే‘ అన్నాడు. నీ కావడిలో ఏముందో చూపించు అంటే అవతలి వాడు కూడా నీ కావడిలో ఏముందో నువ్వూ చూపించు అంటారు గదా... అందుకని ఇద్దరు గూడా మారు మాట్లాడకుండా.. ఎదుటివాన్ని మోసం చేస్తున్నాం అనుకుంటా సంబరంగా ఒకరి కావడి మరొకరు మార్చుకున్నారు.మార్చుకున్నాక మరుక్షణం గూడా ఆలస్యం చేయకుండా ఇసుకదొంగ ‘అనా... జాగ్రత్త. దారిలో దొంగలుంటారు. నీ దగ్గరున్నది బంగారం అని తెలిస్తే అంతే.. చీకటి పడకముందే తొందరగా ఇంటికి చేరుకో’’ అన్నాడు. దానికి వాడు ‘తమ్ముడూ నువ్వు కూడా రత్నాలను జాగ్రత్తగా ఇంటికి తీసుకొని పో’ అంటూ వాడు బైలు దేరాడు.ఇద్దరూ సంబరంగా పరుగు పరుగున ఇంటికి చేరుకొని కావడి మీద వున్న బట్ట తీసి చూస్తే ఇంకేముంది ఇసుక దొంగ చేతికి పేడ అంటుకుంది. పేడ దొంగ చేతికి ఇసుక వచ్చింది. ‘అమ్మో నేనే పెద్ద దొంగను అనుకుంటే, ఆవతలోడు నా కన్నా నాలుగాకులు ఎక్కువే చదివినట్లున్నాడే‘ అనుకుంటా ఇద్దరూ గమ్మున నోరుమూసుకున్నారు. ఇదీ కథ.కథ విన్నారుగా... ఈ కథ నుంచే అంతా మోసం అనే అర్థంలో... ‘ఇసుక తక్కెడ – పేడ తక్కెడ‘ అనే జాతీయం వచ్చింది.– డా.ఎం. హరికిషన్ -
‘మా అమ్మాయికి బుద్ధి చెప్పండి స్వామీ’
Moral Story: చాలా సంవత్సరాల క్రితం ఒక ఊరిలో ఒక అమ్మాయి ఉండేది. ఆ అమ్మాయి రోజంతా గాలి కబుర్లు చెప్పుకుంటూ గడిపేసేది. ఇక్కడ మాట అక్కడా, అక్కడి మాట ఇక్కడా చెబుతూ వుంటే చూసి వాళ్ళమ్మ చాలా బాధ పడేది. ఇలా గాలి కబుర్లు చెప్పడం తప్పని ఎంత చెప్పినా ఆ అమ్మాయి మట్టుకు పట్టించుకునేది కాదు. ఈ గాలి కబుర్ల వల్ల లేనిపోని తగాదాలు కూడా వచ్చేవి.ఒక రోజు ఆ ఊరికి ఒక సాధువు వచ్చాడు. ఆయన దర్శనానికి వెళ్లిన ఆ అమ్మాయి వాళ్ల అమ్మ తన బాధ చెప్పుకుంది. ‘మా అమ్మాయికి బుద్ధి చెప్పండి స్వామీ’ అని కోరుకుంది. సాధువు మర్నాడు అమ్మాయిని తన దగ్గరికి తీసుకురమ్మని చెప్పాడు.మర్నాడు పొద్దున్నే అమ్మ తన కూతురుని సాధువు వద్దకు తీసుకుని వెళ్ళింది. సాధువు చారుమతికి ఒక కోడిని చూపించి ‘రోజంతా ఆ కోడి ఈకలు తీసి వూరు మొత్తం చల్లమ్మా’ అని చెప్పాడు.ఎక్కడ తిడతాడో అని భయపడుతూ వచ్చిన అమ్మాయి ‘ఇంతేనా?’ అనుకుంటూ కోడి ఈకలతో వూరంతా తిరుగుతూ కనిపించిన వారందరికి కబుర్లు చెపుతూ ఇక్కడో ఈక, అక్కడో ఈక విసిరేసింది. సాయంత్రం సూర్యాస్తమయం అవుతుంటే ఆ అమ్మాయిని తల్లి మళ్ళీ ఆ సాధువు దగ్గిరకు తీసుకెళ్లింది.‘ఈ రాత్రి నిద్రపోయి మళ్ళి తెల్లవారగానే రండి’ అని పంపాడు సాధువు.మర్నాడు పొద్దున్నే వాళ్లు వెళితే సాధువు అమ్మాయితో, ‘నిన్న రోజంతా విసిరేసిన కోడి ఈకలు వెతికి తీసుకు రామ్మా’ అన్నాడు.అమ్మాయి సరేనని ఊరంతా వెతకడం మొదలెట్టింది. సాయంత్రం దాక ఊరిలో ప్రతి అంగుళం వెతికినా ఒక్క ఈక కనిపించలేదు. దిగాలుగా సాయంత్రానికి ఆ సాధువు దగ్గరకు వెళ్ళి ‘స్వామి, నన్ను క్షమిచండి. నాకు ఒక్క ఈక కూడ దొరకలేదు’ అని చెప్పింది.చదవండి: ‘నలుగురు కూతుళ్లేనా..’ కాదు డాక్టర్ డాటర్స్..!అప్పుడు సాధువు ‘చూశావా... మన మాటలు కూడా ఆ ఈకల లాంటివే. ఒక్క సారి నోరు జారితే ఆ మాటలను మనం యెన్నటికీ తిరిగి తీసుకోలేము’ అని చెప్పాడు. ‘నోరు అదుపులో ఉంటే సమయం వృధా కాదు. చేయవలసిన పనులు పూర్తవుతాయి. జీవితంలో పెట్టుకున్న లక్ష్యాన్ని సాధించవచ్చు’ అన్నాడు.ఆ రోజు నుంచి ఆ అమ్మాయి గాలి కబుర్లు మానేసి చక్కగా చదువుకుని వాళ్ల అమ్మను సంతోషపెట్టింది. -
కళ్లు తెరిచి చూడవయ్యా.. మీ గమ్యస్థానం కనిపిస్తుంది
ఈ భూమి మీద పుట్టిన ప్రతి జీవికి ఒక లక్ష్యం ఉంటుంది. చాలా జీవులు ఆ విషయాన్ని తెలుసుకోకుండానే తమ జీవితాన్ని పూర్తి చేస్తాయి. అడవిలో ఉన్న జంతువుకు దాని ప్రాణాలు కాపాడుకోవడమే అతి పెద్ద లక్ష్యం. ఆకాశంలో తిరిగే పక్షులకు, నీళ్లలో ఈదే చేపలకు ఆ పూట కడుపు నింపుకోవడమే తమ ముందున్న లక్ష్యం. మరి మెదడున్న మనిషికి మాత్రం అంతకంటే పెద్ద లక్ష్యాన్ని దేవుడు నిర్ణయించాడు. జంతువులా కాకుండా.. భిన్నంగా కొంతైనా సమాజానికి ఉపయోగపడాలని నిర్దేశించాడు. ఆ కర్తవ్య బోధను అర్థం చేసుకున్న వాడు గొప్పవాడయ్యాడు. అది అర్థమయ్యేందుకు చిన్న కథలు రెండు. మొదటి కథ ఒక కుక్క కాశీకి వెళ్దామని బయలు దేరింది. ఎలాగైనా విశ్వనాథుడిని దర్శించుకోవాలన్నది దాని లక్ష్యం. బ్రహ్మండమైన పట్టుదలతో బయల్దేరింది. దారి మధ్యలో ఒక బొక్క కనిపించింది. కాశీకి తర్వాత పోదాంలే.. ముందు బొక్క సంగతి చూద్దామనుకుంది. ఆ బొక్క నోట కరుచుకున్నాక.. పరవశమయింది. కాశీకి పోయే దారి వదిలేసి బొక్క నాకడం మొదలుపెట్టింది. ఆ తర్వాత కథ షరా మామూలే. మనిషి పాత్ర అలాగే… మనిషి పాత్ర కూడా అంత గొప్పేమీ కాదు. జీవుడు తల్లి గర్భంలో ఉన్నప్పుడు ‘దేవుడి వద్దకు చేరాలి ఈ బాధ నేను భరించలేను’ అని నిర్ణయించుకుంటాడు. తన లక్ష్యం అదే అని ఎంచుకుంటాడు. కానీ జన్మించిన తర్వాత.. భౌతిక ప్రపంచాన్ని చూస్తూ తను లక్ష్యాన్ని వదిలేస్తాడు. సుఖదుఃఖ జనన మరణాలలోనే ఉండి పోతున్నాడు. ఇలా ఎన్నో జన్మలు అనుకుంటూనే ఉన్నాడు. జన్మించిన తర్వాత మర్చిపోతూనే ఉన్నాడు. అదృష్టవంతులు కొందరు మాత్రమే దైవాన్ని చేరుకుంటున్నారు. వారే ధన్యజీవులు. రెండో కథ చదివితే మీకు మరింత స్పష్టంగా అర్థమవుతుంది. ఒక ఆవు గడ్డి మేయడానికి అడవిలోకి వెళ్లిoది. పాపం దానికి సమయం తెలియలేదు. ఇంతలో సాయంత్రం అయ్యింది చీకటిపడేలా ఉంది. ఇంతలో ఓ పులి తనవైపు పరిగెత్తుకుంటూ రావడం చూసింది. పులి నుంచి తప్పించుకోవడం కోసం అటూ ఇటూ పరుగెత్తింది. పులి కూడా అంతే వేగంగా వెంబడిస్తోంది. చివరికి ఆవుకు ఎదురుగా ఒక చెరువు కనిపించింది. పులి నుంచి తప్పించుకునే కంగారులో చెరువులోకి దూకేసింది. పులి ఆకలి మీదుంది. ఎలాగైనా ఆవుని పట్టుకోవాలన్న తాపత్రయంలో అది కూడా చెరువులోకి దూకేసింది. క్షణాల్లో మారిన ప్రాధాన్యతలు ఆ చెరువులో నీళ్ళు తక్కువగా ఉన్నాయి, పైగా అందులో లోతైన బురద ఉంది. ముందు వెనకా చూసుకోకుండా దూకడం వల్ల ఆవు పీకల్లోతున బురదలో కూరుకుపోయింది. ఆవుని చంపాలని వచ్చిన పులి కూడా అదే బురదలో చిక్కుకుంది. ఇప్పుడు రెండింటి లక్ష్యాలు మారిపోయాయి. ఆ క్షణం వరకు పులి నుంచి తప్పించుకోవాలనుకున్న ఆవుకు ఇప్పుడు బురదనుంచి బయటపడడం ముఖ్యం. పులి సంగతి కూడా అంతే. ఆవు కాకపోతే మరేదైనా తినొచ్చు కానీ ఈ బురద బారి నుంచి ఎలా బయటపడాలన్నది అర్థం కావడం లేదు. ఆవులో ఆలోచన, పులిలో ఆహంకారం ఇప్పుడు ఆవు, పులీ రెండూ ఒక దానికి ఒకటి ఎదురు ఎదురుగా కదలలేని స్థితిలో నిలబడిపోయాయి. ఇక్కడే ఆవులో ఆలోచన ప్రకాశవంతమయింది. పులి నుంచి తప్పించుకున్నానన్న ఉత్తేజం, ఈ దుస్థితి నుంచి బయటపడతానన్న నమ్మకం దానిలో ఉన్నాయి. అందుకే పులితో మాట్లాడడం మొదలెట్టింది. "నీకెవరైనా యజమాని గానీ గురువు గానీ ఉన్నారా.?” అని అడిగింది. ఎప్పుడు చస్తానో తెలియని పులికి ఇంకా బింకం పోలేదు. "నేనే ఈ అడవి అంతటికీ యజమానిని, నాకు మళ్లీ వేరేగా ఎవరు యజమాని ఉంటారు?” అంది గొప్పగా. అప్పుడు ఆవు ఇలా అంది, “నీ గొప్పదనం, నీ శక్తి ఇవేవీ కూడా ఇప్పుడు నిన్ను ఈ స్థితిలో రక్షించలేక పోయాయికదా..”అంది. అప్పుడు ఆ పులి, ఆవుతో ఇలా అంది, “నీ పరిస్థితి కూడా నాలాంటిదే కదా, నువ్వు కూడా నాలాగే పీకల్లోతులో మునిగిపోయావు, చావుకు దగ్గరలో ఉన్నావు మరి ఇప్పుడు నిన్ను ఎవరు రక్షిస్తారు.?” అంది. అప్పుడు ఆవు చిరునవ్వుతో ఇలా అంది.. “చాలా తప్పు. నాకు ఒక యజమాని ఉన్నాడు, సాయంత్రం అయ్యేసరికి నేను ఇంటికి చేరకపోతే నన్ను వెతుక్కుంటూ, ఎంత దూరమైనా వచ్చి నన్ను ఈ బురదనుంచి బయటకు లాగి క్షేమంగా ఇంటికి తీసుకెళతాడు. మరి నిన్ను ఎవరు బయటకు లాగుతారు.?” అంది. ఇలా అన్న కొద్దిసేపటికే ఆ ఆవు యజమాని నిజంగానే వచ్చాడు. వచ్చీ రాగానే పరిస్థితి గమనించాడు. జాగ్రత్తగా ఓ తాడును కట్టి ఆవుని అతి కష్టం మీద ఆ బురదగుంట నుంచి బయటకు లాగాడు. ఆ ఆవు తన యజమాని కేసి ఎంతో కృతజ్ఞతా పూర్వకంగా చూసింది. ఇక్కడ గమనించాల్సిన విషయమేంటంటే.. తలుచుకుంటే ఆ ఆవు, మరియు దాని యజమాని.. వాళ్లిద్దరూ కలిస్తే ఆ పులిని బయటకు లాగగలరు, కానీ అది వాళ్ళ ప్రాణాలకు ముప్పు అని గ్రహించి, ఆ పులిని బురదలో వదిలేసి వెళ్లిపోయారు. ఈ కథలో... ఆవు - సర్వసమర్పణ చేసిన సాధకుని హృదయo. పులి- అహంకారం నిండి ఉన్న మనస్సు. యజమాని - సద్గురువు/పరమాత్మ బురదగుంట - ఈ సంసారం/ప్రపంచం ఆవు-పులి యొక్క సంఘర్షణ : నలుగురిలో మనం మన ఉనికిని చాటుకోవడం కోసం చేసే జీవన పోరాటం. ఇందులో నీతి ఏంటేంటే.. ఎవరిమీదా ఆధార పడకుండా జీవించడం అనేది మంచి ఉద్దేశ్యమే. కానీ, “నేనే అంతా, నా వల్లే అంతా జరుగుతోంది, నేను లేకపోతే ఏమీ లేదు.. నాకు ఎవరి అవసరం లేదు, రాదు." అనే భావన ఎన్నడూ మనలో కలగరాదు. దీనినే 'అహంకారము' అంటారు. మన వినాశనానికి ఇదే బీజం అవుతుంది. ఈ జగత్తులో పరమాత్మను మించిన హితాభిలాషి , మన మంచిని కోరుకునే వారు వేరే ఉండరు. వారే అనేక రూపాల్లో వచ్చి, ఆయా సమయాల్లో మనల్ని నిరంతరం అనేక ఆపదల నుంచి రక్షిస్తూ ఉంటారు. లోకా సమస్తా సుఖినోభవన్తు! -
అమిత్‌షా వ్యాఖ్యలపై సీఎం సిద్ధు అసహనం
సాక్షి, బెంగళూరు : క్రిమినల్ కేసుల్లో సీబీఐ విచారణ ఎదుర్కొని, చివరకు వారి కరుణాకటాక్షాలతో నిర్దోషిగా బయటికొచ్చిన బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా నుంచి నీతి పాఠాలు నేర్చుకోవాల్సి న అవసరం కాంగ్రెస్ పార్టీకి లేదని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అన్నారు. బెంగళూరులో ఏర్పాటు చేసిన ‘చిత్రసంతె’ను ఆయన ఆది వారం ప్రారంభించి, మాట్లాడారు. అవినీతి దా హంతో రాష్ర్టంలో అధికారంలో కోల్పోయిన బీ జేపీ ఏనాడో నైతికతను కోల్పోయిందని అన్నారు. బీజేపీ ప్రభుత్వ హయాంలో ముఖ్యమంత్రితో సహా చాలా మంది మంత్రులు అవినీతి ఆరోపణల్లో చిక్కుకుని జైలుకు వెళ్లివచ్చారని గుర్తు చేశారు. ఏడాదిన్నరగా రాష్ర్టంలో కాంగ్రెస్ పాలన సాగుతోందని, ఈ సమయంలో ఒక్క కుంభకోణం కూడా జరగలేదని స్పష్టం చేశారు. పాలనలో అవినీతికి పునాదులు వేసిన బీజేపీకి కాంగ్రెస్ పార్టీకి నీతులు చెప్పాలన్సిన అవసరం ఎంత మాత్రం లేదని అన్నారు. కళాకారులకు పూర్తి సహాయ సహకారాలు.... ఇక ఇదే సందర్భంలో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య మాట్లాడుతూ...చిత్రకళా పరిషత్‌తో పాటు కళాకారులకు ప్రభుత్వం నుంచి పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని భరోసా ఇచ్చారు. అనేక రాష్ట్రాలకు చెందిన చిత్రకారులు తమ తమ చిత్రాలను ప్రజలకు పరిచయం చేసేందుకు ‘చిత్రసంతె’ ఓ ఉత్తమ వేదిక అని పేర్కొన్నారు. ఈ వేదికను కళాకారులందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో మంత్రులు రామలింగారెడ్డి, శ్రీనివాసప్రసాద్, సాహితీవేత్తలు మరళుసిద్ధప్ప, కమలా హంపన తదితరులు పాల్గొన్నారు.


