
తాత్త్వికథ
ఒక ఊర్లో గాడి తప్పిన యువకుడు ఒకడుండేవాడు. ఇతరులతో అకారణంగా గొడవ పడేవాడు. అందరినీ కొట్టి తిట్టేవాడు. వాడి అకృత్యాలకు గ్రామస్తులు ఎందరో విసిగిపోయారు. అతనికి బుద్ధి చెప్పడానికి తగిన మార్గం కానరాక సమయం కోసం ఎదురు చూస్తున్నారందరూ!
ఒకరోజు ఓ వృద్ధురాలు తన ఇంటి ముందర ఉడకబెట్టిన వడ్లను ఆరబెడుతోంది. దారిన పోతున్న ఆ యువకుడు వడ్లను తన్ని వెళ్ళిపోయాడు. కన్నీళ్లు పెట్టుకుంటూ ఆ వృద్ధురాలు ‘‘కండ బలం కొన్నాళ్ళే. దాన్ని చూసి మురిసిపోవద్దు. అతి సమీప బంధువు వచ్చిన రోజున తెలుస్తుంది నీకు అసలు విషయం’’ అని తిట్టి పోసింది.
అక్కడినుంచి అయితే ఆ యువకుడు వచ్చేశాడు కానీ అతి సమీప బంధువు ఎవరో తెలుసుకో వాలనిపించింది. తనను ‘డీ’ కొట్టేంత మొనగాడు ఎవడో కళ్ళారా చూడాలనిపించింది. పక్క ఊర్లో ఉన్న తమ దాయాదుల ఇళ్లకు వెళ్ళాడు. ‘నాకు అతి దగ్గర బంధువు ఎవరు’ అని ఆరా తీశాడు.
దగ్గరి బంధువులు ఉన్నారు కానీ, నీతో తలపడేంత గట్టి మనుషులు ఎవ్వరూ లేరని వారు సర్ది చెప్పి పంపారు. అతడి అహం సంతోషించింది కానీ, శత్రు శేషం ఉండరాదని గట్టిగా భావించిన అతడు శపించిన వృద్ధురాలినే అడిగి తెలుసుకుందా మనుకున్నాడు. ఆ వృద్ధురాలి ఇంటికి వెళ్ళాడు. అతడి రాక విషయం తెలిసి ఆమె అప్పటికే ఊరు విడిచి వెళ్ళి పోయింది.
తిన్నగా తన ఇంటికి వెళ్ళాడు. అమ్మ అన్నం తినమని పిలిచింది. వద్దన్నాడు. ఆకలి కాలేదన్నాడు. కారణమేమిటని అడిగింది. విషయం చెప్పాడు. ఆమె చిన్నగా అతడి భుజం తట్టుతూ ‘‘ఎవ్వరికైనా అతి సమీప బంధువు మృత్యువు. అది మన నీడ లాగా మనతోనే ఉంటుంది. ఎప్పుడు మనల్ని కబళిస్తుందో మనకు తెలియదు. చనిపోయే సమయంలో మనం చేసిన ΄ాపపుణ్యాలు గుర్తుకు వస్తాయని పెద్దలు చెబుతారు. ఆ విషయమే ఆమె నిన్ను హెచ్చరిక చేసింది’’ అన్నాడు.
‘‘ఆ బంధువు ఎప్పుడు వచ్చేదీ మనకు తెలియదా? తెలిస్తే ఆ బంధువుని మూడు చెరువుల నీళ్ళు తాగించాలని ఉంది’’ అని గర్వంగా అన్నాడు. ఆమె నవ్వి ‘‘ఎప్పటికీ ఎవ్వరికీ అర్థం కానిది మృత్యువు. అది ఎప్పుడు వస్తుందో, ఎప్పుడు వెళ్తుందో తెలుసుకోవడం ఎవ్వరి తరం కాదు. వచ్చినప్పుడు తప్పించుకోవడానికి కూడా ఎవ్వరికీ సాధ్యం కాదు. అందుకే అది వచ్చేలోగా మనం మంచి పనులు చేయాలని చెబుతారు. ఒకర్ని నొప్పించే పనులు చేయవద్దని అంటారు’’ అని వివరించింది.
ఏ క్షణాన అయినా వచ్చే అతి సమీప బంధువు గురించి అవగాహన వచ్చింది అతడికి. క్షమాపణలు చెబుదామని ఆ వృద్ధురాలిని వెదకడం కోసం బయలుదేరాడు.
– ఆర్.సి. కృష్ణస్వామి రాజు