‘కోటి దీపోత్సవం’లో ప్రధాని నరేంద్ర మోదీతో... (ఫైల్ ఫొటో)
‘దీపం అంటే ప్రమిద మాత్రమే కాదు మన మనసులను మేల్కొలిపే సాంస్కృతిక వెలుగు’ అంటారు రచనా టెలివిజన్ ప్రైవేట్ లిమిటెడ్ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ రచనా చౌదరి. నవంబర్ 1నుంచి 13 వరకు కోటి దీ పోత్సవ కార్యక్రమం హైదరాబాద్‌లో కన్నుల పండువగా జరగనుంది. ఈ సందర్భంగా ఉత్తర–దక్షిణ భారత దేశాల
కళాసంస్కృతిని ఒకే వేదికమీదకు తీసుకురావడానికి చేస్తున్న కృషి, ఆధ్యాత్మిక సేవ, కోటి దీ పోత్సవ కార్యక్రమం తమలో తీసుకువచ్చిన మార్పుల గురించి రచనా చౌదరి ప్రత్యేకంగా ‘సాక్షి’తో ముచ్చటించారు.
‘‘దీపం జ్యోతి పరబ్రహ్మ, దీపం సర్వతమోపహమ్,
దీపేన సాధ్యతే సర్వం, సంధ్యా దీపం నమోస్తుతే...
చీకటిని తొలగించి జ్ఞానమనే వెలుగును ప్రసాదించే దీపం వల్ల అన్నిపనులు సాధ్యమవుతాయి అన్నది నిజం. ప్రతిరోజూ దీపం వెలిగించడం నా దినచర్యలో భాగం. ఈ దీపం వెనక మా అమ్మ రమాదేవి, నాన్న నరేంద్ర చౌదరిల కృషి ఎంత ఉందో చూస్తూ పెరిగాను. కోటి దీ పాలు ప్రసరించే శక్తి ఎంత దూరం వెళుతుందో ప్రతియేటా చూడటమే కాదు, ఈ కార్యక్రమం విజయవంతం అవడానికి నా వంతు సహకారాన్ని అందిస్తుంటాను.
’ మంచి మార్పులు
అమ్మానాన్న మొదట లక్ష దీ పోత్సవం అనే ఆలోచన చేసే సమయానికి నేను టీనేజ్‌లో ఉన్నాను. శృంగేరీ పీఠాధిపతి జగద్గురు భారతీ తీర్థ స్వామివారి చేతుల మీదుగా 2012లో ఈ కార్యక్రమం మొదలుపెట్టారు. అప్పుడు అమెరికాలో బోర్డింగ్ స్కూల్ లో చదువుకుంటున్నాను. ప్రతియేటా కోటి దీ పోత్సవానికి మాత్రం తప్పనిసరిగా వచ్చి వెళ్లేదాన్ని. ఆధ్యాత్మిక విషయాల్లో పెద్దలను, గురువులను అనుసరించడం ద్వారానే ఎన్నో విషయాలను తెలుసుకోగలం.
ప్రతి యేటా దీక్షగా చేసే ఈ కార్యక్రమం నాలో చాలా మార్పులు తీసుకువచ్చింది. స్టేడియం అలంకరణ, అతిథులను ఆహ్వానించడం, ఏర్పాట్లు చూడటం,.. ఇదంతా అమ్మ చేసే పనులను గమనిస్తూ, తెలుసుకోగలిగాను. దాదాపు నాలుగు సంవత్సరాల నుంచి కోటి దీ పోత్సవంలో చురుకుగా పాల్గొంటున్నాను. ప్రఖ్యాతి గాంచిన శృంగేరి, కంచిపీఠం, మైసూరు దత్త పీఠం.. వంటి పీఠాధిపతులు కోటి దీ పోత్సవ కార్యక్రమానికి హాజరయేవిధంగా సమన్వయం చేస్తున్నాను.
దీపం ద్వారా సమాజంలో ఎంతో మార్పు తీసుకురావచ్చు అని బోధపడింది. ఈ మహా కార్యక్రమంలో ధనిక, పేద అనే తేడా ఉండదు. కళాకారులకు వేదికైన ఈ కార్యక్రమాన్ని ఏదో గొప్ప శక్తి అదృశ్యంగా ఉండి నడిపిస్తోందని నా భావన. ఈ కార్యక్రమానికి వచ్చినవాళ్లు ‘కిందటేడాది వచ్చాం.. మా జీవితంలో మంచి మార్పు జరిగింది’ అని చెబుతుంటారు. అదంతా దైవం ఇచ్చే ఆశీస్సులే అని చెబుతుంటాం. కార్తీకమాసంలో పదమూడు రోజులు ఎన్టీఆర్ స్టేడియంలో మొత్తం పాజిటివ్ వైబ్స్ అనంతంగా వెలువడుతున్నాయా అనిపిస్తుంటుంది.
’ ఉత్తర–దక్షిణాల కలబోత
ఈసారి కోటిదీ పోత్సవం పాన్ ఇండియా అయ్యిందని చెప్పవచ్చు. దక్షిణ భారతదేశంతో పాటు ఉత్తరాదిలో ఉన్నటువంటి ప్రముఖ పుణ్యక్షేత్రాల ఉత్సవ విగ్రహాలను కోటి దీ పోత్సవ వేదికపైకి తీసుకొచ్చి తెలుగు ప్రజలకు దర్శనం కల్పించేవిధంగా కృషి చేస్తున్నాం. గత ఏడాది నుంచి దేశంలోని అన్ని ప్రాంతాల నుంచి ప్రధాన దేవతామూర్తులు తరలివస్తున్నారు. అక్కడి అర్చకులే స్వయంగా వచ్చి పూజలు నిర్వహిస్తున్నారు.
ఇలా అన్ని దేవాలయాల నుంచి వచ్చిన ఉత్సవమూర్తులకు కోటిదీ పోత్సవంలో దర్శన భాగ్యం కల్పించడం ఎంతో సంతృప్తిని ఇస్తుంది. చాలామంది జీవితంలో దర్శించదగిన దేవాలయాల జాబితా దగ్గర పెట్టుకుంటారు. కానీ, వెళ్లలేని కారణాలేవో ఉంటాయి. అలాంటివారు ఇక్కడకు వచ్చి, ఈ కార్యక్రమంలో ఆ దేవతామూర్తులను దర్శించుకుని, పూజలలో పాల్గొని, గుండెలనిండా ఆ దివ్యానుభూతులను నింపుకుని వెళుతుంటారు.
’ యువతలో సేవాగుణం
ఇటీవలి కాలంలో యువతలో మన సంస్కృతి పట్ల ఉన్న గౌరవాన్ని, భక్తిని, ఆసక్తిని ఎక్కువగా గమనిస్తున్నాను. అయితే, చాలామంది సెలబ్రేషన్స్ వైపు ఎక్కువ మొగ్గుచూపుతుంటారు. మన దేశీయ వారసత్వం అంతర్గతంగా ఉంటుంది. ఈ కార్యక్రమంలో యువత స్వచ్ఛందంగా వచ్చి సేవ చేస్తుంటారు. సంప్రదాయంగా ముస్తాబై, వచ్చి, ఈ కార్యక్రమంలో ఫొటోలు దిగుతుంటారు. దీ పాలు వెలిగించి, ఫొటోలు తీసుకొని, సోషల్‌మీడియాలో పోస్ట్‌లు పెడుతుంటారు. పూజ ఒక్కటే కాదు ఈ దేశ ఆధ్యాత్మిక శక్తి సందేశం వారి మెదళ్లకు చేరుతుంది. అందుకే, యువత చాలా ఉత్సాహంగా పాల్గొంటారు.
మా అందరికీ దీపోత్సవం కార్యక్రమంలో ప్రతిరోజూ ఒక మారథాన్‌లా ఉంటుంది. పూర్తయ్యాక ఇంకొన్ని రోజులు ఉంటే బాగుండు అనిపిస్తుంది. ఒక తరం మరో తరాన్ని అనుసరిస్తూ ఉంటుంది. ఆధ్యాత్మిక ప్రయాణాన్ని మా జనరేషన్ కూడా అనుసరిస్తుంది. మంచి ఎక్కడ ఉన్నా దానిని ఫాలో అవడం సహజమే. తెలంగాణలోని పల్లె ప్రాంతాలే కాదు ఆంధ్ర, తమిళనాడు, కేరళ, కర్ణాటక నుంచి కూడా ఈ కార్యక్రమానికి హాజరవుతుంటారు.
దాదాపుగా తొంభైశాతం మంది తమ వంతు దీపం వెలిగించి హడావుడిగా వెళ్లి పోవాలని కాకుండా మహా నీరాజనం అయ్యేవరకు ఉండి, భక్తితో కళ్లకద్దుకుని వెళుతుంటారు. వయసు పైబడినవారు తమ కుటుంబసభ్యులతో వచ్చి, కార్యక్రమంలో పాల్గొని సంతృప్తితో వెళుతుంటారు. ఈ సమయంలో యువత పెద్దవారికి ఇచ్చే చేయూత గమనించినప్పుడు ఎంతో సంతోషంగా అనిపిస్తుంది. ఈ కార్యక్రమానికి మాజీ ముఖ్యమంత్రి కె. చంద్ర శేఖరరావు, ప్రస్తుత ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌రెడ్డి, కేంద్రమంత్రి జి.కిషన్‌రెడ్డి, బి.జె.పి. సీనియర్ నేత డాక్టర్ ఎ. లక్ష్మణ్ అనూహ్య సహకారం అందిస్తున్నారు.
’ రక్షణ చర్యలూ ప్రధానమే!
పీఠాధిపతులు, సద్గురువులు, ప్రవచనకారులు.. అందరి సమక్షంలో జరిగే ఈ దీక్షా కార్యక్రమంలో సామూహికంగా ప్రతిరోజూ దాదాపు పదిలక్షల దీ పాలు వెలిగిస్తారు. ఇరవై మంది కూర్చొని దీపం వెలిగించి, పూజ చేసుకునేలా ఒక సెట్ ఉంటుంది. ప్రతి ఒక సెట్ దగ్గర ఒక వాలంటీర్ ఉంటారు. అలా మొత్తం 2000 మంది వాలంటీర్లు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు.
ఎన్‌టీవీ, వనిత, భక్తి టీవీ బృందంలోని వెయ్యి మంది కూడా ఈ కార్యక్రమంలో స్వచ్ఛందంగా పాలుపంచుకుంటారు. 40 కెమెరా సెటప్‌ను ఏర్పాటు చేస్తాం. దీ పాలతో చేసే కార్యక్రమం కాబట్టి ఎక్కడ ఏ చిన్న అవాంతరం జరిగినా వెంటనే తెలిసి పోతుంది.
దీనివల్ల ఎంత చిన్న సమస్య అయినా వెంటనే క్లియర్ చేసే సదు పాయం ఉంటుంది. అందుకే ఇన్నేళ్లలో ఎలాంటి సమస్యా ఉత్పన్నం కాలేదు. అంబులెన్స్, టాయ్‌లెట్ సదు పాయాలు ఉంటాయి. ఎవరికీ ఏ ఇబ్బంది లేకుండా ఉండటానికి ఏం చేయాలో ముందస్తు సమావేశాలు నిర్వహిస్తుంటాం. అందరిలోనూ ఒక దైవిక శక్తి ఉన్నదా... అన్నంతగా ఈ కార్యక్రమం పూర్తయ్యేవరకు ప్రతి ఒక్కరూ తమ ఎఫర్ట్‌ని పెడుతుంటారు. కోటి దీ పోత్సవం ఆరంభం నుంచి ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమం విజయవంతం కావడం కోసం మా సిబ్బంది చేసే కృషిని మాటల్లో చెప్పలేను. తమ సొంత కార్యక్రమంలా కార్యోన్ముఖులై పనిచేస్తారు.
ప్రతిసారీ ఈ కార్యక్రమం దిగ్విజయం అయేలా చేయడం మాకు ఒక టాస్క్ అని చెప్పవచ్చు. భగవంతుడు ఉన్నాడు, లేడు.. అనే చర్చలు అవసరం లేదు. ఇది డబ్బుకు సంబంధించిన అంశం కానే కాదు. ధర్మానికి సంబంధించినది. ఈ కార్యక్రమం వల్ల ఎంతో మందికి మేలు జరుగుతుంది. మన దేశం కళలకు పుట్టినిల్లు. సాహిత్య, సాంస్కృతిక వైభవాలతో విరాజిల్లే ఘనమైన చరిత్ర ఉంది. ఏ మారుమూల ప్రాంతానికి వెళ్లినా అక్కడి కళాకారుల సాంస్కృతిక కళారూ పాలు కనిపిస్తాయి. వాటిని ఈ వేదిక ద్వారా పరిచయం చేస్తున్నాం. ఆ విధంగా ఎంతోమంది కళాకారులకు గుర్తింపు, ఉ పాధి లభిస్తుంది. కోట్లాదిమందికి కోటిదీ పోత్సవ వేదికగా కాంతి సందేశాలు అందుతుంటాయి’ అని వివరించారు ఈ యువ పారిశ్రామికవేత్త.
’ సేవయే ప్రధానం...
ప్రతియేటా ఆగస్టు రాగానే మా ఇంట కోటి దీ పోత్సవానికి సంబంధించిన సందడి నెలకొంటుంది. అందుకు సంబంధించిన ప్రయత్నాలు, పనుల విభజన, థీమ్.. ప్రతిది ప్లానింగ్‌తో రెడీ అవుతుంది. పూణె, తంజావూరు నుంచి వచ్చిన కళాకారులు పువ్వులతో రంగోలీలు వేస్తారు. శాండ్ ఆర్టిస్టులు రకరకాల కళారూ పాలను చిత్రిస్తారు. బొమ్మల కొలువులు పెడతాం. రకరకాల దేవతామూర్తుల విగ్రహాలు కూడా స్టేడియం అంతా అలంకరిస్తాం. ఏ దేవుడికి ఏ పూలు అర్పించాలి, వాటి మాలలు ఎలా ఉండాలో ప్రత్యేకించి తయారు చేయిస్తాం. కోయంబత్తూరు, బెంగళూరు నుంచి ప్రత్యేక అలంకరణ కళాకారులను తీసుకొచ్చి, వేదికను అలంకరిస్తాం.
ప్రతిరోజు ఉదయం తొమ్మిది గంటలకు స్టేడియంకు వెళ్లి, అక్కడ ఆ రోజుకు కావల్సిన ఏర్పాట్లు, అలంకరణ ఎలా ఉండాలో చూస్తాం. అమ్మ ఈ పనులన్నీ స్వయంగా దగ్గర ఉండి పర్యవేక్షిస్తారు. వాలెంటీర్లు వచ్చి, స్టేడియం అంతా శుభ్రం చేసి, పూజ సామాగ్రి తులసి కోటతో సహా అన్ని ఏర్పాట్లు చేసి పెడతారు. అక్కడ నుంచి సాయంత్రం ఇంటికి వచ్చి, రెడీ అయి, మళ్లీ స్టేడియంకు వచ్చేస్తాం. ఈ పనిలో సేవయే ప్రధానం. ముందుగా అనుకున్న షెడ్యూల్ మారి పోవచ్చు. పనుల విభజనలో ఎవరు ఏ పనైనా చేయాల్సి రావచ్చు. రెండువేల మంది వాలంటీర్లు, ఛానెల్స్‌లో వర్క్ చేసేవారు వెయ్యి మంది, మేం.. అందరం కలిసి ఒకే ఇంటి కార్యక్రమంగా పని చేస్తాం.
తంజావూరుగోపురం సెట్
ఇప్పటికే దేశంలోని ప్రధాన పీఠాధిపతులు, రాష్ట్రపతి, ప్రధానమంత్రి.. మొదలైన ప్రముఖులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ప్రతియేటా ఒక్కో థీమ్ తీసుకుంటాం. ఈసారి కాశీ థీమ్‌తో పాటు మరిన్ని కొత్త మార్పులు ఉండబోతున్నాయి. దీంతో ప్రతియేటా వచ్చినవారు కూడా కొత్త అనుభూతి పొందుతారు. ఇప్పటికి దేశంలో ఉన్న ప్రముఖులందరూ దీ పోత్సవానికి హాజరయ్యారు. ఈ సంవత్సరం శృంగేరీ, కంచి పీఠాధిపతులు రాబోతున్నారు. నాగసాధువుల చేత శివునికి ప్రత్యేక అభిషేకాలు జరగబోతున్నాయి. కార్యక్రమానికి హాజరయ్యే భక్తులందరికీ పూజా సామాగ్రిని భక్తి టీవీయే ఉచితంగా అందజేస్తుంది. ప్రతిరోజూ కార్యక్రమం ముగిసిన వెంటనే మరుసటి రోజు చేసే కార్యక్రమాలను ఆరంభిస్తాం. ఈ సంవత్సరం తంజావూరు గోపురం నేపథ్యంలో ప్రధాన సెట్‌ను రూపొందిస్తున్నాం.
– నిర్మలారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి
ఫొటో: అనిల్ కుమార్ మోర్ల


