
తాత్త్వికథ
అది కార్తీక మాసం. ఊర్లో చాలామంది అయ్యప్ప దీక్షలో ఉన్నారు. వారందరినీ చూసిన ఓ యువకుడికి కూడా అయ్యప్ప మాల ధరించాలనిపించింది. అనుకున్నదే తడవుగా శివాలయం వద్ద ఉన్న గురుస్వామి గుర్తుకు వచ్చాడు. అన్నీ సిద్ధం చేసుకుని మాలధారణకు బయలుదేరాడు. అదే సమయంలో గురుస్వామి గుడి పక్కనున్న నదిలో స్నానం చేస్తూ కనిపించాడు. ఆ యువకుడు ఒడ్డున నిలబడి నమస్కరించి ‘‘స్వామీ, నాకు కూడా అయ్యప్ప మాల వేయాలని ఉంది. అయితే నలభై రోజుల మండల దీక్ష చేయలేను. రెండు వారాలు మాత్రమే మాల ధరిస్తాను’’ అని చెప్పాడు. కారణమేమిటని అడిగాడు గురుస్వామి.
‘‘నాకు చన్నీళ్ళ స్నానం అంటే భయం. అందుకని నలభై రోజులు ఉండలేను’’ అని బదులిచ్చాడు యువకుడు. ‘‘అదేమీ లేదు, కొన్నాళ్ళు చన్నీళ్ళ స్నానం చేస్తే అదే అలవాటైపోతుంది’’అని ధైర్యం చెప్పాడు గురుస్వామి. అది అసాధ్యం అన్నట్లుగా ముఖం పెట్టాడు యువకుడు. ‘‘సరే, నేను చెప్పినట్లు చేస్తావా?’’ అని అడిగాడు గురుస్వామి.
‘‘చన్నీళ్ళ స్నానం తప్పితే మరే పని చేయమన్నా చేస్తాను’’ అని గట్టిగా చెప్పాడు ఆ యువకుడు. వెంటనే గురుస్వామి ‘‘నీ చేతి వేలు ఈ ప్రవహించే నదిలో పెట్టు!’’ అన్నాడు. అదెంత పని అన్నట్లుగా నీళ్ళలో వేలు పెట్టాడు. ఎలాగుందని అడిగాడు గురుస్వామి. చలిగా ఉందని సమాధానమిచ్చాడు యువకుడు. ఈసారి చేయి మొత్తం నీళ్ళలో పెట్టమని కోరాడు. అలాగే మొత్తం చేయి పెట్టిన యువకుడు భలే చలిగా ఉందని అరిచాడు. ‘ఈసారి గట్టు నుంచి నదిలోకి దూకు!’’ అన్నాడు.
ఎగిరి దుమికాడు యువకుడు. వెంటనే స్వామి చలి ఎలా ఉందని ప్రశ్నించాడు. ‘‘చలే లేదు స్వామీ! వెచ్చగా ఉంది!!’’ అని నీళ్ళలో ఈతకొడుతూ బదులిచ్చాడు యువకుడు. గురుస్వామి నవ్వుతూ ‘‘నిండా మునిగితే చలి లేదన్నారు పెద్దలు. రోజూ చన్నీళ్ళ స్నానం చేస్తే చలీగిలీ కనిపించవు. అలవాటయ్యాక చన్నీళ్ళ స్నానమే బాగుంటుందని అంటావు. చన్నీళ్ళ స్నానానికి భయపడి దీక్ష కాలాన్ని ఎందుకు తగ్గించుకుంటావు. దీక్ష ఫలితం పూర్తిగా ఆస్వాదించాలంటే నలభై రోజులు ఉంటేనే బాగుంటుంది’’ అని సలహా ఇచ్చాడు. అలాగేనని సంతోషంగా నలభై రోజుల దీక్షకు ఉపక్రమించాడు ఆ యువకుడు.
– ఆర్.సి.కృష్ణస్వామి రాజు