గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ మరోసారి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ద్వంద్వ స్వభావం గురించి మాట్లాడారు. ఏఐ ద్వారా రాబోయే అపారమైన సామాజిక ప్రయోజనాలను ఆయన బలంగా విశ్వసిస్తున్నప్పటికీ, దీన్ని దుర్వినియోగం చేస్తుండడం ఆందోళన కలిగిస్తుందని పేర్కొన్నారు. ముఖ్యంగా డీప్‌ఫేక్ టెక్నాలజీ (నకిలీ వీడియోలు, ఫొటోలు సృష్టించే సాంకేతికత) ద్వారా ఆన్‌లైన్‌లో ప్రజలను మోసం చేయడానికి ఉపయోగించే ప్రమాదం ఉందని, ఈ ఆలోచనే తనకు నిద్ర లేకుండా చేస్తుందని పిచాయ్ తెలిపారు.
ఇటీవల ఒక ఇంటర్వ్యూలో ‘ఏఐ గురించి తీవ్రంగా ఆలోచిస్తూ, రాత్రి నిద్రపట్టకుండా చేసే విషయం ఏమిటి?’ అని అడగ్గా పిచాయ్ మొదట సానుకూల దృక్పథాన్ని అందించారు. ‘ఏఐ వంటి శక్తివంతమైన సాంకేతికతతో చాలా ప్రయోజనాలు ఉన్నాయి. ఇది కొత్త ఔషధాలను కనుగొనడంలో, క్యాన్సర్‌కు మెరుగైన చికిత్సలను అభివృద్ధి చేయడంలో సహాయపడుతుంది’ అని ఆయన వివరించారు. అయితే, వెంటనే ఆయన ఏఐ దుర్వినియోగంతో కలిగే ప్రమాదంపై హెచ్చరిక చేశారు.
‘ఏదైనా సాంకేతికతకు రెండు వైపులు ఉంటాయి. కొందరు దీన్ని దుర్వినియోగం చేయవచ్చు. డీప్‌ఫేక్స్ లాంటివి నిజం, అబద్ధానికి మధ్య తేడా తెలియని పరిస్థితిని సృష్టించవచ్చు. ఈ అంశమే రాత్రి నిద్ర పట్టకుండా చేసేది’ అని పిచాయ్ ఆందోళన వ్యక్తం చేశారు. ఏఐని మానవాళికి మేలు చేసేలా ఉపయోగించడం అనేది కేవలం సాంకేతికతకు సంబంధించిన అంశం మాత్రమే కాదని, సామాజిక బాధ్యత కూడా ఇమిడి ఉందని ఆయన నొక్కి చెప్పారు.
ఇదీ చదవండి: వేళ్లూనుకున్న అభిషేక్ బచ్చన్ వ్యాపార సామ్రాజ్యం


