ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న టెక్నాలజీ మౌలిక సదుపాయాల అవసరాన్ని దృష్టిలో ఉంచుకుని AI డేటా సెంటర్ల కోసం అత్యాధునిక హార్డ్‌వేర్‌ను రూపొందించడానికి ఓపెన్‌ఏఐ ఫాక్స్‌కాన్‌తో భాగస్వామ్యాన్ని ప్రకటించింది. ఈ సహకారం ద్వారా ఫాక్స్‌కాన్, ఓపెన్‌ఏఐలు కలిసి డేటా సెంటర్ సర్వర్ ర్యాక్‌లను అభివృద్ధి చేస్తాయి. ముఖ్యంగా ఈ ర్యాక్‌లను యూఎస్ అంతటా ఏర్పాటు చేయనున్నట్లు తెలుస్తుంది. ఇందులో భాగంగా దేశంలో డేటా సెంటర్ సౌకర్యాల కోసం అవసరమైన కేబులింగ్, పవర్ సిస్టమ్స్, ఇతర కీలక పరికరాలను ఉత్పత్తి చేయాలని ఫాక్స్‌కాన్ యోచిస్తోంది. అయితే, ఈ ఒప్పందంలో నిర్దిష్ట కొనుగోలు నిబంధనలు ఏవీ లేవని ఇరు సంస్థలు స్పష్టం చేశాయి.
సరఫరా గొలుసుపై పట్టు
ప్రపంచంలో విలువైన ప్రైవేట్ సంస్థల్లో ఒకటైన ఓపెన్‌ఏఐ ఏఐ సరఫరా గొలుసుపై మరింత నియంత్రణ సాధించడానికి చురుగ్గా చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా గత కొన్ని నెలల్లో క్లౌడ్ కంప్యూటింగ్ ప్రొవైడర్లు, చిప్ తయారీదారులైన ఎన్‌వీడియా కార్ప్, అడ్వాన్స్‌డ్ మైక్రో డివైజెస్ ఇంక్(ఏఎండీ) వంటి కంపెనీలతో ఒప్పందాలను కుదుర్చుకుంది.
ఫాక్స్‌కాన్ వ్యూహాత్మక విస్తరణ
ఓపెన్‌ఏఐతో తాజా ఒప్పందం ఫాక్స్‌కాన్‌కు ఎంతో కలిసొస్తుందని కొందరు భావిస్తున్నారు. ఈ భాగస్వామ్యం ఏఐ పర్యావరణ వ్యవస్థలో తన కార్యకలాపాలను విస్తరించడానికి దీర్ఘకాలిక వ్యూహాన్ని సూచిస్తుంది. కాగా, ఫాక్స్‌కాన్ విడిగా ఏఐ డేటా సెంటర్లను అన్వేషించడానికి ఇంట్రిన్సిక్(Intrinsic)తో ఉమ్మడి వెంచర్‌ను ప్రకటించింది.
ఇదీ చదవండి: జీవిత బీమా వెనుక భారీ సంపద రహస్యం


