స్టార్టప్‌ల లిస్టింగ్ స్ట్రాటజీ
యూనికార్న్ డ్రీమ్‌కు ముందే పబ్లిక్ ఇష్యూకు రెడీ
నిధుల కోసం ప్రయివేట్ కంటే పబ్లిక్ మార్కెట్‌కే సై
ఇటీవల కొద్ది రోజులుగా చిన్న, మధ్యస్థాయి స్టార్టప్‌లు తదుపరి దశ నిధుల సమీకరణలో పబ్లిక్ రూట్‌కే ప్రాధాన్యమిస్తున్నాయి. ప్రయివేట్ రంగ పెట్టుబడులకంటే ఐపీవోకు వెళ్లడానికే ఆసక్తి చూపుతున్నాయి. స్టాక్ ఎక్సే్ఛంజీలలో లిస్టయితే బ్రాండింగ్, టాలెంట్, టెక్నాలజీ వృద్ధికి వీలుంటుందని భావిస్తున్నాయి. వివరాలు చూద్దాం..
ప్రైమరీ మార్కెట్లు రెండేళ్లుగా రికార్డు నిధుల సమీకరణ ద్వారా కదం తొక్కుతుండటంతో చిన్న, మధ్యస్థాయి స్టార్టప్‌లు లిస్టింగ్‌వైపు చూస్తున్నాయి. ఇందుకు దేశీయంగా కనిపిస్తున్న ఇన్వెస్టర్ల ఆసక్తి, అత్యధిక లిక్విడిటీ తోడ్పాటునిస్తున్నాయి. ఫలితంగా తొలి, మలిదశలలో వృద్ధి నిలుపుకునేందుకు.. తద్వారా వ్యాపార విస్తరణకు అవసరమైన నిధుల కోసం పబ్లిక్ మార్కెట్‌కు ప్రాధాన్యమిస్తున్నాయి.
వెరసి ప్రయివేట్ రంగ పెట్టుబడులకంటే స్టాక్ ఎక్సే్ఛంజీలలో నమోదయ్యేందుకే చిన్న, మధ్యస్థాయి స్టార్టప్‌లు ఆసక్తిని చూపుతున్నాయి.. కాగా.. ఇంతక్రితం చాలా స్టార్టప్‌లు బిలియన్ డాలర్ల కంపెనీలు(యూనికార్న్)గా ఎదిగిన తదుపరి మాత్రమే లిస్టింగ్‌వైపు చూసేవి. అంతకుముందు పెట్టుబడుల కోసం పీఈ, తదితర ఇన్వెస్ట్‌మెంట్ సంస్థలను ఆశ్రయిస్తుండేవి. అయితే ఇటీవల ఈ ట్రెండ్‌కు విరుద్ధంగా చాలా ముందుగానే ఐపీవో బాట పడుతుండటం గమనార్హం!
బ్రాండ్ బిల్డింగ్..
స్టాక్ ఎక్సే్ఛంజీలలో లిస్టయితే బ్రాండ్ బిల్డింగ్‌తోపాటు.. టాలెంట్‌ను ఆకట్టుకోవడం, కొత్త టెక్నాలజీలపై గురి పెట్టడం తదితరాలకు వీలుంటుందని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. ప్రధానంగా కంపెనీకి సరైన విలువ లభించడం, పారదర్శక పాలన, తగినంత లిక్విడిటీకి వీలుండటం ప్రధాన పాత్ర పోషిస్తున్నట్లు తెలియజేశాయి. వెరసి రూ. 300–400 కోట్ల ఆదాయ స్థితికి చేరిన స్టార్టప్‌లు ఐపీవోకు సిద్ధపడుతున్నట్లు తెలియజేశాయి. రెండేళ్లుగా అటు ఎస్‌ఎంఈ, ఇటు మెయిన్ బోర్డులో రికార్డ్‌స్థాయిలో కంపెనీలు లిస్టవుతుండటం స్టార్టప్‌లకు జోష్‌నిస్తున్నట్లు వివరించాయి.
జాబితా ఇలా..
స్టాక్ ఎక్సే్ఛంజీలలో లిస్టింగ్‌పట్ల ఆసక్తిగా ఉన్న మధ్యస్థాయి స్టార్టప్‌ల జాబితాలో స్క్రిప్‌బాక్స్, మైగేట్, ఫ్యాబ్‌హోటల్స్, క్లాస్‌ప్లస్ ముందువరుసలో ఉన్నట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. ఐపీవో చేపట్టేందుకు వీలుగా గత నెల(2025 డిసెంబర్)లో ఫ్యాబ్‌హోటల్స్ క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి ప్రాస్పెక్టస్ దాఖలు చేసింది. రానున్న 6 నెలల్లో లిస్టయ్యేందుకు స్క్రిప్‌బాక్స్ సైతం సన్నాహాలు ప్రారంభించినట్లు తెలుస్తోంది.
ప్రధానంగా రూ. 300–600 కోట్ల సమీకరణ ప్రణాళికలున్న స్టార్టప్‌లు అధికంగా ఐపీవో బాటవైపు చూస్తున్నట్లు ఇన్‌క్రెడ్ క్యాపిటల్ ఎండీ ప్రతీక్ ఇండ్‌వార్ పేర్కొన్నారు. రూ. 600–700 కోట్ల పరిమాణంలో నిధుల సమీకరణపై కన్నేసిన స్టార్టప్‌లు సైతం అధికంగా లిస్టింగ్‌కు సిద్ధపడుతున్నట్లు ప్రోజస్ గ్రూప్ గ్లోబల్ హెడ్ గజానన్ శుక్లా తెలియజేశారు.
ఇదీ తీరు
తొలి, మలి దశ స్టార్టప్‌లు ప్రధానంగా ఏంజెల్ ఫండింగ్, వెంచర్ క్యాపిటల్ సంస్థల ద్వారా నిధు లు సమీకరిస్తుంటాయి. ఈ జాబితాలో సీక్వోయా, యాక్సెల్, బ్లూమ్ వెంచర్స్, కళారి, వై కాంబినేటర్, లెట్స్‌వెంచర్, ఫండ్‌ఆఫ్ ఫండ్స్ ఉన్నాయి. ఆపై ప్రయివేట్ ఈక్విటీ సంస్థలను సైతం సంప్రదిస్తుంటాయి. నిజానికి 2019లో మధ్యస్థాయి స్టార్టప్‌లు ఇన్వెస్ట్‌మెంట్ సంస్థలకు 145 రౌండ్ల ద్వారా మైనారిటీ వాటాలు విక్రయించాయి. తద్వారా 5.7 బిలియన్ డాలర్లు సమకూర్చుకు న్నాయి. తదుపరి 2020, 2022లలో నిధుల సమీకరణ మరింత పుంజుకున్నప్పటికీ 2025లో నీరసించింది. 2019 స్థాయిలోనే 152 రౌండ్ల ద్వారా 5.4 బిలియన్ డాలర్లు అందుకున్నాయి. ఇందుకు సంస్థలు పెరిగినప్పటికీ ఐపీవో బాట పట్టడం ప్రభావం చూపినట్లు నిపుణులు తెలియజేశారు.
– సాక్షి, బిజినెస్ డెస్క్


