తెలంగాణలో త్వరలో ‘ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ 2.0’ | Telangana Launch Ease of Doing Business 2 0 to Attract Global Investments | Sakshi
Sakshi News home page

తెలంగాణలో త్వరలో ‘ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ 2.0’

Feb 24 2026 3:10 PM | Updated on Feb 24 2026 3:15 PM

Telangana Launch Ease of Doing Business 2 0 to Attract Global Investments

తెలంగాణ రాష్ట్రాన్ని అంతర్జాతీయ పెట్టుబడులకు చిరునామాగా మార్చే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కీలక అడుగు వేస్తోంది. పారిశ్రామికాభివృద్ధిని మరింత వేగవంతం చేస్తూ, పెట్టుబడిదారులకు భరోసా కల్పించేందుకు త్వరలోనే ‘ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ 2.0’ విధానాన్ని తీసుకురానున్నట్లు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ప్రకటించారు.

మంగళవారం జూబ్లీహిల్స్‌లో ఫిక్కీ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘గ్రోత్ ఎక్స్ 2026’ సదస్సులో ఆయన పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఆర్థిక పురోగతికి సంబంధించి ప్రభుత్వ రోడ్ మ్యాప్‌ను ఆవిష్కరించారు.

2047 నాటికి 3 ట్రిలియన్‌ డాలర్ల ఆర్థిక వ్యవస్థ

రాష్ట్ర వృద్ధి అనేది యాదృచ్ఛికంగా జరిగేది కాదని, అది పక్కా ప్రణాళికతో కూడిన ప్రక్రియ అని మంత్రి స్పష్టం చేశారు. ఈ క్రమంలోనే ప్రభుత్వం ప్రతిష్టాత్మకమైన ‘తెలంగాణ విజన్ 2047’ డాక్యుమెంట్‌ను రూపొందించిందని తెలిపారు. ప్రస్తుతం 200 బిలియన్‌ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తెలంగాణ ఎదిగిందన్నారు. 2034 నాటికి 1 ట్రిలియన్ డాలర్ల లక్ష్యంతో పని చేస్తుందన్నారు. 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల స్థాయికి చేరాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు.

రాష్ట్ర అభివృద్ధికి త్రిముఖ వ్యూహం

తెలంగాణ సమగ్రాభివృద్ధి కోసం ప్రభుత్వం ‘క్యూర్ - ప్యూర్ - రేర్’ అనే వినూత్న వ్యూహాన్ని అమలు చేస్తోందని శ్రీధర్ బాబు వివరించారు. అభివృద్ధిని కేవలం నగరాలకే పరిమితం కాకుండా గ్రామీణ ప్రాంతాల వరకు తీసుకెళ్లేందుకు తమ ప్రభుత్వ కృషి చేస్తుందన్నారు. మారుతున్న సాంకేతిక పరిజ్ఞానంపై స్పందిస్తూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటి టెక్నాలజీలు పని సంస్కృతిని పూర్తిగా మార్చేశాయని మంత్రి అభిప్రాయపడ్డారు.

‘రాబోయే రోజుల్లో ప్రత్యేకంగా కంపెనీల కంటే బలమైన ఎకో సిస్టమ్‌కే ప్రాధాన్యత ఉంటుంది. అందుకే భవిష్యత్తు కోసం వేచి చూడకుండా ఆ భవిష్యత్తును మనమే నిర్మించాలనే దృఢ సంకల్పంతో ఉన్నాం’ అని చెప్పారు. ప్రభుత్వం కేవలం అనుమతులు ఇచ్చే యంత్రాంగంలా కాకుండా పరిశ్రమలతో కలిసి నడిచే భాగస్వామిగా ఉంటుందని మంత్రి హామీ ఇచ్చారు. రాష్ట్ర పురోగతిలో భాగస్వాములు కావాలని పారిశ్రామికవేత్తలకు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా బీజేపీ నేత రాంచందర్ రావు, డా.నాగేశ్వర్ రెడ్డి, ఫిక్కీ ప్రెసిడెంట్ ఆర్.రవి కుమార్, స్కై రూట్ ఏరో స్పేస్ ప్రతినిధి పవన్, గ్రోత్ ఎక్స్ కన్వీనర్ పంకజ్ దివాన్ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఇదీ చదవండి: ‘భారత్ టాక్సీ’ సహకార ప్లాట్‌ఫామ్‌ ప్రారంభం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement