‘డీప్‌సీక్’ గుర్తుందా? గడచిన 2025 మొదట్లో ఈ చైనీస్ కంపెనీ కృత్రిమ మేధ రంగాన్ని కుదిపేసింది. తక్కువ ఖర్చుతో అమెరికన్ కంపెనీ ఓపెన్ ఏఐ అభివృద్ధి చేసిన ‘ఛాట్ జీపీటీ’ని తలదన్నే లార్జ్ లాంగ్వేజ్ మోడల్‌ను విడుదల చేసింది. కృత్రిమ మేధలో చైనా ఎంత ముందుందో ప్రపంచానికి చాటిన సందర్భం ఇది. తాజాగా అంతర్జాతీయ సైంటిఫిక్ జర్నల్ సైతం ‘డీప్‌సీక్’ ప్రాముఖ్యన్ని గుర్తించింది. కంపెనీ వ్యవస్థాపకుడు లియంగ్ వెన్‌ఫెంగ్‌ను గతేడాది టాప్ వ్యక్తుల్లో ఒకరిగా నిలిపింది.
ఒకే ఏడాదిలో డీప్‌సీక్ తాలూకూ జనరల్ పర్పస్ వీ–3 మోడల్ విప్లవాత్మకమైన మార్పునకు కారణమైంది. దీంట్లోని అడ్వాన్స్‌డ్ మోడల్ ఆర్–1 తర్కానికి సంబంధించినది. ఫలితంగా ఇది గణిత, సాఫ్ట్‌వేర్ కోడింగులకు సంబంధించిన సంక్లిష్టమైన విషయాలను కూడా మెరుగ్గా చేపట్టగలదు. పైగా ఇది ఓపెన్ మోడల్. అంటే ఎవరైనా స్వేచ్ఛగా దీన్ని వేర్వేరు రంగాల్లో ఉపయోగించుకోవచ్చు.
లాంగ్వేజ్ మోడళ్లకు శిక్షణ ఇవ్వాలంటే అపారమైన సమాచారం అవసరం. ఎంత సమాచారంతో శిక్షణ ఇస్తే అంత మెరుగైన ఫలి తాలు రాబట్టుకోవచ్చు. గతేడాది చైనీస్ ఏఐ మోడళ్లు మార్కెట్లో అన్నింటి కంటే ముందున్నట్లు ఒక సర్వే ద్వారా తెలిసింది. అంత ర్జాతీయంగా 33 శాతం మంది వీటిని వాడుతున్నట్లు అంచనా.
ఇంగ్లీషు తరువాత అత్యధిక సంఖ్యలో టోకెన్లు అడిగింది కూడా చైనీస్ భాషలోనే కావడం గమనార్హం. చైనాతోపాటు అంతర్జాతీయంగానూ చైనా మోడళ్లు బాగా పనిచేస్తున్నాయనేందుకు ఇవి నిదర్శ నాలు. శిక్షణ సమయంలో ఏఐ మోడళ్లు ప్రాసెస్ చేసి అర్థం చేసు కోవడం ద్వారా అంచనా కట్టే, తర్కాన్ని అభివృద్ధి చేసుకునే యూనిట్లనే ‘టోకెన్లు’ అని పిలుస్తారు.
ఏఐలో స్వావలంబన కోసం...
డీప్‌సీక్ ప్రకటన వెలువడిన వెంటనే భారత్ కూడా ఎల్‌ఎల్‌ఎంలతో పాటు స్మాల్ లాంగ్వేజ్ మోడల్స్, ప్రాథమిక ఏఐ మోడళ్ల అభి వృద్ధి గురించి వివరాలు వెల్లడించింది. భారతీయ అవసరాలకు తగ్గట్టుగా ఏఐ ఆధారిత పరిష్కారాలను అభివృద్ధి చేస్తామని ప్రకటించింది. ‘డిజిటల్ ఇండియా భాషిణి’ (భారతీయ భాషలను అను వదించేది), ‘భారత్ జెన్’ (ప్రభుత్వ సేవలను అందించే మల్టీ మోడల్ ఎల్‌ఎల్‌ఎం), పదివరకూ భారతీయ భాషల ఏఐ ఎల్‌ఎల్‌ఎం మోడల్‌గా ‘సర్వం–1’, వీడియోలను సృష్టించే ‘చిత్ర లేఖ’, 35 వరకూ భారతీయ భాషలకు ‘హనూమాన్ ఎవరెస్ట్ 1.0’ పేరుతో ఓ ఏఐ వ్యవస్థ వంటివి ఈ ప్రణాళికలో ఉన్నాయి. ఐఐటీ బాంబే ఆధ్వర్యంలో ‘భారత్ జెన్’ అభివృద్ధికి పలు టెక్నాలజీ విద్యా సంస్థలు చేతులు కలిపాయి.
కేంద్ర ప్రభుత్వ మంత్రిత్వ శాఖలు కొన్ని నిధులు సమకూర్చాయి. జాతీయ ఏఐ మిషన్ కింద మరో రూ. 980 కోట్లు కూడా కేటాయించారు. ఈ రకమైన మద్దతు లభించిన, ఒక దేశ లక్ష్యం కోసం ఏర్పాటైన మొట్టమొదటి ప్రాజెక్టు భారత్ జెన్ మాత్రమే అయివుంటుంది.భారత్ జెన్‌ను చాలామంది డీప్‌సీక్‌కు పోటీ అనుకుంటారు. కానీ రెండింటి మధ్య చెప్పుకోదగ్గ తేడాలున్నాయి. డీప్‌సీక్ పూర్తిగా వాణిజ్యపరమైంది. స్టార్టప్ మాదిరిగా మొదలైంది.
భారత్ జెన్... వ్యూహాత్మకమైన జాతీయ మిషన్. సాంకేతిక రంగం విషయంలో స్వావలంబన కోసం ప్రభుత్వ మద్దతుతో మొదలైన ప్రాజెక్టు. డీప్ సీక్, ఛాట్‌జీపీటీల ముందున్న అతి పెద్ద సవాలు... సంక్లిష్టమైన భారతీయ భాషలను, సంస్కృతులను అర్థం చేసుకోవడం. ఈ అంత రాన్ని ‘భారత్ జెన్’ పూడ్చగలదని అంచనా. 1970, 80లలో కేంద్ర ప్రభుత్వం స్థాపించిన సీఎంసీ, సీ–డాట్ కంపెనీల మాదిరిదే ఈ భారత్ జెన్. సీఎంసీ, సీ–డాట్లను దేశీ స్వావలంబన, ఆత్మనిర్భరత లక్ష్యాలతోనే ఏర్పాటు చేశారు. ఇవి విజయవంతం కావడం వెనుక ఐఐటీలు, టాటా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రిసెర్చ్ వంటి
సంస్థలు కూడా ఉన్నాయి.
అవసరమైన మార్గదర్శకాలు
ఆశ్చర్యం కలిగించే విషయం ఏమిటంటే, భారతీయ టెక్ కంపె నీలేవీ ఏఐ ఫౌండేషనల్ మోడళ్లను అభివృద్ధి చేయకపోవడం. అదే సమయంలో ప్రైవేట్ కంపెనీలు అంతర్జాతీయ సంస్థలతో కలిసి ఏఐ వ్యవస్థలకు అవసరమైన డేటా సెంటర్ల వంటి మౌలిక సదుపా యాలు ఏర్పాటు చేసేందుకు ఉత్సాహం చూపుతున్నాయి. భార తీయ టెక్ పరిశ్రమ మొత్తం సేవా రంగం ప్రధానంగానే నడుస్తోంది. సుమారు 200 బిలియన్ డాలర్ల ఆదాయమున్న ఈ రంగం ఏఐ విషయంలో ప్రేక్షక పాత్ర వహించడం అభిలషణీయం కాదు. నైపుణ్యం, అనుభవం, ఆర్థిక శక్తి కూడా కలిగిన భారతీయ టెక్ రంగం భారత్ జెన్ వంటి వాటి అభివృద్ధికి భాగస్వాములు కావాల్సిన అవసరముంది.
ప్రభుత్వ సహకారం లేదు కానీ డీప్‌సీక్ అభివృద్ధి చేసిన మోడళ్లు చైనా ప్రభుత్వ పర్యవేక్షణకు, నిబంధనలకు కట్టుబడి ఉన్నాయి. ప్రస్తుత చైనా నియంత్రణల ప్రకారం... అన్ని ఏఐ సేవలు కూడా సోషలిస్ట్ విలువలను పాటించాలి. జాతీయ ఏకతను దృష్టిలో పెట్టుకుని వ్యవహరించాలి. అందుకే తియనాన్మెన్ స్క్వేర్ నిరస నలు, తైవాన్ పరిస్థితి, చైనా కమ్యూనిస్టు పార్టీ నాయకత్వంపై వస్తున్న మానవ హక్కుల ఉల్లంఘనల ఫిర్యాదుల వంటి అంశాలపై ఈ మోడళ్లు కిమ్మనవు.
బాధ్యతాయుతమైన ఏఐ అభివృద్ధి అన్న నినాదంతో మార్గదర్శ కాలను ప్రభుత్వం విడుదల చేసింది. పారదర్శకత, జవాబుదారీ తనం, భద్రత, మానవ పర్యవేక్షణల ప్రాముఖ>్యన్ని, అవసరాన్ని ఈ మార్గదర్శకాలు నొక్కి చెప్పాయి.
ప్రభుత్వ సహకారంతో నడుస్తోంది కాబట్టి, అటు ఈ మద్దతును కొనసాగించడం... ఇటు ప్రజా సంక్షే మాన్ని దృష్టిలో ఉంచుకోవడం భారత్ జెన్‌కు కీలకం. పాశ్చాత్య దేశాల ఏఐ మోడళ్లలో మాదిరి అల్గరిథవ్‌ుల పరమైన వివక్ష భారత్ జెన్‌లో ఉండకూడదు. రాజకీయ ప్రభావానికి గురిచేసేలా, తప్పుడు సమాచారం ఇవ్వకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే ఈ ప్రాజెక్టు మొత్తం సామాన్యుల పన్నుల డబ్బుతోనే నడుస్తోంది. వేర్వేరు భాషలకు సంబంధించిన ఎల్‌ఎల్‌ఎంలను అభివృద్ధి చేసే సందర్భంలోనూ పారదర్శకతకు, జవాబుదారీతనానికి పెద్ద పీట వేయాలి. భాషా శాస్త్రవేత్తలు, సోషల్ సైంటిస్టులు, వేర్వేరురంగాల నిపుణులతో విస్తృత సంప్రదింపులు జరిపి అభివృద్ధి చేస్తేనే ఈ లక్ష్యం నెరవేరుతుందన్నది గుర్తుంచుకోవాలి.
దినేశ్ సి. శర్మ
వ్యాసకర్త సైన్స్ అంశాల వ్యాఖ్యాత


