ఈక్విటీ ఫండ్స్‌లోకి రూ.28,054 కోట్లు
డిసెంబర్‌లో 6 శాతం తగ్గుదల
గోల్డ్ ఫండ్స్‌కు డిమాండ్
న్యూఢిల్లీ: ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌లోకి డిసెంబర్‌లో నికరంగా రూ.28,054 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. నవంబర్‌లో రూ.29,911 కోట్ల పెట్టుబడులతో పోల్చి చూస్తే 6 శాతం తగ్గాయి. ఈ ఏడాది అక్టోబర్‌లో వచి్చన పెట్టుబడులు రూ.24,690 కోట్లుగా ఉన్నాయి. ఈక్విటీ, గోల్డ్ ఈటీఎఫ్‌లు నికరంగా పెట్టుబడులను ఆకర్షించగా, డెట్ ఫండ్స్‌లో అమ్మకాలు చోటుచేసుకున్నాయి.
దీంతో మొత్తం మీద మ్యూచువల్ ఫండ్స్ పరిశ్రమ నుంచి డిసెంబర్‌లో రూ.66,591 కోట్ల పెట్టుబడులు బయటకు వెళ్లాయి. డివిడెండ్ ఈల్డ్, ఈక్విటీ లింక్డ్ సేవింగ్ స్కీమ్స్ (ఈఎల్‌ఎస్‌ఎస్) తప్ప మిగిలిన అన్ని ఈక్విటీ ఫండ్స్‌లోకి నికరంగా పెట్టుబడులు వచ్చాయి. నవంబర్ చివరికి ఫండ్స్ నిర్వహణలోని పెట్టుబడులు (ఏయూఎం) రూ.80.80 లక్షల కోట్లుగా ఉంటే, డిసెంబర్ చివరికి రూ.80.23 లక్షల కోట్లకు తగ్గాయి. ఈ వివరాలను మ్యూచువల్ ఫండ్స్ సంస్థల అసోసియేషన్ (యాంఫి) విడుదల చేసింది.
సిప్ ద్వారా రికార్డు స్థాయి పెట్టుబడులు
సిస్టమ్యాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ (సిప్) రూపంలో పెట్టుబడులు డిసెంబర్‌లో సరికొత్త గరిష్టానికి చేరాయి. రూ.31,000 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. నవంబర్‌లో సిప్ పెట్టుబడులు రూ.29,445 కోట్లుగా ఉన్నాయి. ఫండ్స్ నిర్వహణలోని మొత్తం సిప్ పెట్టుబడులు రూ.3.34 లక్షల కోట్లకు చేరాయి.
విభాగాల వారీ పెట్టుబడులు..
→ అత్యధికంగా ఫ్లెక్సీక్యాప్ విభాగంలోకి రూ.10,019 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. నవంబర్‌లో ఈ విభాగంలోకి వచి్చన పెట్టుబడులు రూ.8,135 కోట్లుగానే ఉన్నాయి. → మిడ్‌క్యాప్ ఫండ్స్ రూ.4,176 కోట్ల పెట్టుబడులను రాబట్టాయి. లార్జ్ అండ్ మిడ్‌క్యాప్ ఫండ్స్‌లోకి రూ.4,094 కోట్లు వచ్చాయి.
→ స్మాల్‌క్యాప్ ఫండ్స్ రూ.3,824 కోట్ల పెట్టుబడులను ఆకర్షించాయి. లార్జ్‌క్యాప్ ఫండ్స్‌లోకి రూ.1,567 కోట్ల పెట్టుబడులు వచ్చాయి.
→ వ్యాల్యూ ఫండ్స్ రూ.1,088 కోట్లు, మల్టీక్యాప్ ఫండ్స్ రూ.2,255 కోట్లు, ఫోకస్డ్ ఫండ్స్ రూ.1,057 కోట్ల చొప్పున పెట్టుబడులను ఆకర్షించాయి.
→ గోల్డ్ ఎక్సే్ఛంజ్ ట్రేడెడ్ ఫండ్స్ (ఈటీఎఫ్‌లు)లోకి పెద్ద మొత్తంలో రూ.11,647 కోట్ల పెట్టుబడులు వచ్చాయి.


