అంతర్జాతీయ గ్రీన్ ఎకానమీ (పర్యావరణ అనుకూల రంగాలు) విలువ 2030 నాటికి వార్షికంగా 7 ట్రిలియన్ డాలర్లకు చేరుకుంటుందని ప్రపంచ ఆర్థిక వేదిక (డబ్ల్యూఈఎఫ్) అంచనా వేసింది. ఇప్పటికే ఇది 5 ట్రిలియన్ డాలర్లను అధిగమించినట్టు తెలిపింది. భారత్ పునరుత్పాదక విద్యుత్ పరంగా అధిక వృద్ధిని నమోదు చేస్తుందని పేర్కొంది. బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్‌తో కలసి రూపొందించిన నివేదికను విడుదల చేసింది.
పర్యావరణ అనుకూల ఆర్థిక వ్యవస్థతో ఎన్నో రంగాల్లోని వ్యాపారాలు ప్రయోజనం పొందుతున్నట్టు తెలిపింది. పర్యావరణ అనుకూల పరిష్కారాలను అనుసరిస్తున్న కంపెనీలు లబ్ది పొందుతున్నట్టు వివరించింది. ఆర్థిక అనిశ్చితులు నెలకొన్నప్పటికీ, వైవిధ్యమైన పర్యావరణ పరిస్థితుల్లోనూ గ్రీన్ టెక్నాలజీలపై పెట్టుబడులు గరిష్ట స్థాయిలో కొనసాగుతున్నట్టు పేర్కొంది. సంప్రదాయ వ్యాపార మార్గాల కంటే పర్యావరణ అనుకూల వ్యాపార ఆదాయాలు కలిగిన కంపెనీలు మెరుగైన పనితీరు చూపిస్తున్నట్టు డబ్ల్యూఈఎఫ్ నివేదిక వివరించింది.
సంప్రదాయ కంపెనీల కంటే పర్యావరణ అనుకూల వ్యాపారాల ఆదాయాలు రెండు రెట్లు అధికంగా వృద్ధి చెందుతున్నాయని, అలాగే నిధుల వ్యయాలు కూడా పర్యావరణ అనుకూల వ్యాపార కంపెనీలకు తక్కువగా ఉంటున్నట్టు పేర్కొంది. దీంతో ఈ కంపెనీలు 12–15 శాతం అధిక ప్రీమియాన్ని క్యాపిటల్ మార్కెట్లలో పొందుతున్నట్టు తెలిపింది. దీర్ఘకాలంలో ఈ కంపెనీల లాభాలు బలంగా కొనసాగుతాయన్న నమ్మకం ఇన్వెస్టర్లలో ఉండడమే దీనికి కారణమని వివరించింది.
పునరుత్పాదక విద్యుత్‌లో భారత్ టాప్
పునరుత్పాదక ఇంధన వనరుల ఆధారిత విద్యుదుత్పత్తి ప్రపంచ వ్యాప్తంగా ఏటా 9 శాతం పెరుగుతుంటే, 13 శాతం వృద్ధితో భారత్ అగ్రస్థానంలో ఉన్నట్టు డబ్ల్యూఈఎఫ్ నివేదిక వెల్లడించింది. చైనాలో వృద్ధి 12 శాతంగా ఉన్నట్టు తెలిపింది. చాలా ప్రాంతాల్లో ఏటా 10 శాతం వృద్ధి నమోదవుతుందంటూ.. 16 శాతం వృద్ధితో భారత్ ముందుంటుందని అంచనా వేసింది. 15 శాతం వృద్ధితో చైనా తర్వాతి స్థానంలో నిలుస్తుందని పేర్కొంది. 2019 నుంచి 2024 వరకు భారత్, చైనాలో పర్యావరణ అనుకూల ఇంధనాలపై ఏటా 12 శాతం చొ3ప్పున పెట్టుబడులు పెరిగినట్టు వెల్లడించింది. భారత్‌లో పునరుత్పాదక విద్యుదుత్పత్తి విభాగంలో ‘రెన్యూ’ కంపెనీని ప్రస్తావించింది. దేశవ్యాప్తంగా 28 గిగావాట్ల విద్యుదుత్పత్తి సామర్థ్యాన్ని ఈ సంస్థ కలిగి ఉన్నట్టు తెలిపింది.


