ఆర్‌బీఐ ఎంపీసీ సమీక్షలో రెపో రేటును పావు శాతం తగ్గించొచ్చని రేటింగ్ సంస్థ కేర్‌ఎడ్జ్ అంచనా వేసింది. ద్రవ్యోల్బణం గణనీయంగా తగ్గడంతోపాటు, జీడీపీ వృద్ధి బలంగా కొనసాగుతుండడం రేట్ల కోతకు అనుకూలించొచ్చని పేర్కొంది. ఈ నెల 5న ఆర్‌బీఐ ఎంపీసీ తన నిర్ణయాలను ప్రకటించనుండడం తెలిసిందే. ద్రవ్యోల్బణం దశా బ్ద కనిష్ట స్థాయి అయిన 0.3 శాతానికి అక్టోబర్‌లో తగ్గినట్టు కేర్ ఎడ్జ్ గుర్తు చేసింది.
ఆర్‌బీఐ లక్ష్యం అయిన 4 శాతానికి ఇది ఎంతో దిగువన ఉందని, దీంతో పాలసీ రేట్ల తగ్గింపునకు వెసులుబాటు ఉన్నట్టు పేర్కొంది. ప్రస్తుతం రెపో రేటు 5.5 శాతంగా ఉంది. ‘‘బ్రెంట్ ముడి చమురు ధరలు స్థిరంగా ఉన్నాయి. రిజర్వాయర్లలో తగినంత నీటి నిల్వలు ఉండడం రబీ సాగుకు అనుకూలం. చైనాలో తయా రీ అధికంగా ఉండడంతో ధరలు పెరిగే ఒత్తిళ్లు లేవు. ద్రవ్యోల్బణం ఇక్కడి నుంచి గణనీయంగా పెరగకుండా ఇవి సాయపడతాయి’’అని తాజాగా విడుదల చేసిన నివేదికలో తెలిపింది.
ద్వితీయార్ధంలో వృద్ధి నెమ్మదించొచ్చు..
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2025–26) సెప్టెంబర్ త్రైమాసికంలో జీడీపీ వృద్ధి 8.2 శాతానికి విస్తరించగా.. ద్వితీయ ఆరు నెలల్లో (క్యూ3, క్యూ4) వృద్ధి రేటు 7 శాతానికి నెమ్మదించొచ్చని కేర్ ఎడ్జ్ అంచనా వేసింది. అమెరికా టారిఫ్‌లు అమల్లోకి రావడానికి ముందుగా చేసిన అధిక ఎగుమతులు, పండుగల అనంతరం వినియోగం తగ్గడం వంటివి వృద్ధి రేటును నెమ్మదింపజేస్తాయని పేర్కొంది.
కాకపోతే పూర్తి ఆర్థిక సంవత్సరానికి జీడీపీ వృద్ధి 7.5 శాతంగా ఉండొచ్చని అంచనా వేసింది. రిటైల్ ద్రవ్యోల్బణం వచ్చే 12 నెలల్లో 3.7 శాతంలోపు ఉండొచ్చని పేర్కొంది. అమెరికాతో వాణిజ్య చర్చలు దీర్ఘకాలం పాటు కొనసాగుతుండడం, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు ఉన్నప్పటికీ.. విదేశీ మారకం నిల్వలు బలంగానే కొనసాగుతున్నట్టు, నవంబర్ మధ్య నాటికి 27 బిలియన్ డాలర్లు పెరిగి 693 బిలియన్ డాలర్లకు చేరినట్టు తెలిపింది.


