కొత్త జీవితకాల కనిష్ట స్థాయి 90.30కి పతనం
చివరికి 90.15 వద్ద ముగింపు
విదేశీ ఇన్వెస్టర్ల అమ్మకాలు
వాణిజ్య ఒప్పందంపై అస్పష్టతతో కరెన్సీపై ఒత్తిడి
ఈ ఏడాది 5 % క్షీణత
దిగుమతులు, విదేశీ చదువులు, పర్యటనల భారాన్ని పెంచేస్తూ అమెరికా డాలరుతో పోలిస్తే రూపాయి విలువ రోజు రోజుకీ కిందికి జారిపోతోంది. బుధవారం తొలిసారి ఏకంగా 90 స్థాయిని దాటేసి సెంచరీ దిశగా పతన పరుగును మరింత వేగం చేసింది. డాలరుతో రూపాయి విలువ ఈ ఏడాది అయిదు శాతం పడిపోయింది. 2030 నాటికి రూపాయి సెంచరీ కొట్టేసే అవకాశం ఉందంటూ కేంబ్రిడ్జ్ కరెన్సీస్‌లాంటి ఆర్థిక సేవల సంస్థలు అంచనా వేస్తున్నాయి.
రేపటి (శుక్రవారం) వెలువడే సమీక్షలో కీలక పాలసీ రేట్లను రిజర్వ్ బ్యాంక్ తగ్గిస్తే విదేశీ ఇన్వెస్టర్ల అమ్మకాలు మరింత వెల్లువెత్తి రూపాయి పాతాళానికి పడిపోయే అవకాశం ఉందని పరిశీలకులు అంచనావేస్తున్నారు. ఇప్పటికే బలహీనంగా ఉన్న రూపాయి కారణంగా ఆర్‌బీఐ పని కష్టతరంగా మారిందని నిపుణులు అంటున్నారు. అయితే ప్రభుత్వ వర్గాలు మాత్రం రూపాయి పతనాన్ని తేలికగా తీసిపారేస్తున్నారు, దీని గురించి పెద్దగా ఆందోళన చెందనక్కర్లేదని అంటున్నారు. రూపాయి పతనం ఎగుమతిదారులకు ప్రయోజనమే అయినప్పటికీ దిగుమతిదారులకు మాత్రం భారంగా మారుతోంది.
ముంబై: అమెరికా డాలర్లకు దిగుమతిదార్ల నుంచి డిమాండ్ భారీగా పెరుగుతున్న నేపథ్యంలో ఇంటర్‌బ్యాంక్ ఫారిన్ ఎక్సే్చంజీలో రూపాయి మారకం విలువ బుధవారం ఒక దశలో ఆల్‌టైమ్ కనిష్ట స్థాయి 90.30ని తాకింది. చివరికి క్రితం ముగింపుతో పోలిస్తే 19 పైసలు క్షీణించి 90.15 వద్ద క్లోజయ్యింది. మంగళవారం సైతం 43 పైసలు పతనమై 89.96 వద్ద ముగిసిన సంగతి తెలిసిందే. ‘‘విదేశీ ఇన్వెస్టర్లు ఎడతెగకుండా విక్రయిస్తుండటం, బలహీన ఈక్విటీ మార్కెట్లు, క్రూడాయిల్ రేట్లు పెరగడం వంటి అంశాలు దీనికి కారణం.
అమెరికాతో వాణిజ్య ఒప్పందంపై అనిశ్చితి నెలకొనడం కూడా ఒత్తిడి పెంచింది. అయితే, డాలర్ ఇండెక్స్ కూడా బలహీనంగా ఉండటం వల్ల మరింత భారీగా పతనం కాకుండా కాస్త అడ్డుకట్ట పడింది. రాబోయే రోజుల్లో కూడా రూపాయి కొంత బలహీనంగానే ట్రేడ్ కావచ్చు. అయితే, డాలరు బలహీనపడి, డిసెంబర్‌లో ఫెడ్ రేట్ల కోత అవకాశాలు పెరిగితే రూపాయి కాస్త నిలదొక్కుకోవచ్చు’’ అని మిరే అసెట్ షేర్‌ఖాన్ రీసెర్చ్ అనలిస్ట్ అనుజ్ చౌదరి తెలిపారు. విదేశీ ఇన్వెస్టర్లు రిస్కుల జోలికి వెళ్లకుండా, క్రూడాయిల్ రేట్లు అధిక స్థాయిలోనే తిరుగాడుతూ ఉంటే సమీప భవిష్యత్తులో రూపాయిపై ఒత్తిడి కొనసాగవచ్చని, 89.50–91.20 శ్రేణిలో తిరుగాడవచ్చని ఆషికా గ్రూప్ చీఫ్ బిజినెస్ ఆఫీసర్ రాహుల్ గుప్తా తెలిపారు.
సాధారణమే..
ప్రస్తుత పరిస్థితుల్లో రూపాయి పతనం సాధారణ విషయంగా మారిపోయిందని కోటక్ మహీంద్రా మ్యూచువల్ ఫండ్ ఎండీ నీలేష్ షా చెప్పారు. ‘‘మన వాణిజ్య భాగస్వాములతో పోలిస్తే ద్రవ్యోల్బణం అధిక స్థాయిలో ఉంది. ఉత్పాదకత తక్కువగా ఉంది. ఈ అసమానతల కారణంగా 2–3 శాతం క్షీణించడం సహజమే’’ అని పేర్కొన్నారు. స్వల్పకాలికంగా పెట్టుబడుల ప్రవాహంలో హెచ్చుతగ్గులనేవి కరెన్సీ స్థాయిని ప్రభావితం చేసినప్పటికీ, శాశ్వత ప్రాతిపదికన రూపాయి పెరగడానికి అవకాశాలు లేవన్నారు. ఒకవేళ అమెరికాతో వాణిజ్య ఒప్పందం కుదిరినా ఇదే స్థాయిలో కొనసాగవచ్చని చెప్పారు. రూపాయి మారకాన్ని మార్కెట్ శక్తులకు విడిచిపెట్టి, తీవ్ర ఒడిదుడుకులను కట్టడి చేసేందుకు మాత్రమే ఆర్‌బీఐ జోక్యం చేసుకోవడం సరైన విధానమేనని పేర్కొన్నారు.
పతనానికి మరిన్ని కారణాలు..
→ ముడి చమురు ధరలు అధిక స్థాయిలో తిరుగాడుతుండటం
→ ఎగుమతుల వృద్ధి నెమ్మదించడం
→ కరెన్సీ క్షీణతను అడ్డుకునేందుకు ఆర్‌బీఐ ప్రయత్నాలేమీ చేయకపోవడం
ఆందోళన అక్కర్లేదు: సీఈఏ
రూపాయి క్షీణత విషయంలో ప్రభుత్వమేమీ ఆందోళన చెందడం లేదని కేంద్ర ముఖ్య ఆర్థిక సలహాదారు (సీఈఏ) వి. అనంత నాగేశ్వరన్ చెప్పారు. దీనివల్ల ద్రవ్యోల్బణం, ఎగుమతులపై తీవ్ర ప్రతికూల ప్రభావమేమీ లేదన్నారు. వచ్చే ఏడాది రూపాయి కాస్త మెరుగుపడొచ్చని సీఐఐ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఆశాభావం వ్యక్తం చేశారు. స్థూల విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు ఈ ఏడాది 100 బిలియన్ డాలర్లకు చేరొచ్చని నాగేశ్వరన్ తెలిపారు. గత ఆర్థిక సంవత్సరం ఇది 81.04 బిలియన్ డాలర్లుగా ఉంది.
ప్రతికూలం
విదేశీ చదువులు విదేశీ టూర్లు , దిగుమతులు
(రత్నాభరణాలు, ఎల్రక్టానిక్స్, ముడిచమురు, ఫార్మా రంగానికి కావల్సిన ముడిపదార్థాలు మొదలైనవి)
విదేశీ లగ్జరీ కార్లు
సానుకూలం
ఎగుమతి ఆధారిత రంగాలు
(ఐటీ పరిశ్రమ, ఆటో ఎగుమతులు, ఫార్మా, టెక్స్‌టైల్స్)
రెమిటెన్సులు


