43 పైసలు బలహీనపడి 89.96 వద్ద ముగింపు
ఇంట్రాడేలో 90 స్థాయిని కోల్పోయిన వైనం
ఇంట్రాడే, ముగింపులోనూ రికార్డు కనిష్ట స్థాయిలు నమోదు
న్యూఢిల్లీ: చరిత్రలో అత్యంత కనిష్టానికి రూపాయి విలువ పడిపోయింది. స్పెక్యులేటర్ల నుంచి భారీగా షార్ట్ కవరింగ్, దిగుమతిదారుల నుంచి అమెరికా కరెన్సీకి డిమాండ్ కొనసాగడం దేశీయ కరెన్సీపై తీవ్ర ఒత్తిడి పెంచాయి. ఫలితంగా డాలర్ మారకంలో రూపాయి విలువ 43 పైసలు బలహీనపడి జీవితకాల కనిష్టం 89.96 వద్ద స్థిరపడింది. ఎఫ్‌ఐఐలు వరుస విక్రయాలు, అమెరికా–భారత్‌ల వాణిజ్య ఒప్పందం ఆలస్యం కావడం తదితర అంశాలు సెంటిమెంట్‌ను దెబ్బతీశాయని ఫారెక్స్ ట్రేడర్లు తెలిపారు.
ఉదయం ఫారెక్స్ మార్కెట్లో 89.70 వద్ద మొదలైంది. ఒక దశలో 47 పైసలు కుప్పకూలి 90.00 స్థాయి వద్ద ఇంట్రాడే రికార్డు కనిష్టాన్ని నమోదు చేసింది. ‘‘సాంకేతికంగా రూపాయి 90 స్థాయిపై ముగిసినట్లయితే.., ఆ పైన స్థాయిల్లో బై–స్టాప్ ఆర్డర్లు మరిన్ని ఉండొచ్చు. కావున 90కి దిగువునే ఆర్‌బీఐ జోక్యం చేసుకోవాలి.
లేకపోతే 91 స్థాయిని ఛేదించేందుకు మరెంతో సమయం పట్టదు. అంతంకంతా పెరుగుతున్న వాణిజ్య లోటు రూపాయిపై మరింత భారాన్ని పెంచుతోంది. అయితే డిసెంబర్‌లో వడ్డీరేట్ల తగ్గింపు, ఆర్‌బీఐ జోక్యం చేసుకోవచ్చనే ఆశావహ అంచనాలతో రానున్న రోజుల్లో రూపాయి 89.60 – 90.20 శ్రేణిలో ట్రేడవ్వచ్చు’’ అని కోటక్ సెక్యూరిటీస్ కమోడిటీ, కరెన్సీ హెడ్ అనింద్య బెనర్జీ తెలిపారు.


