టెక్ దిగ్గజం యాపిల్ సర్వీసులు అందించలేని(Obsolete) ఉత్పత్తుల జాబితాను అప్‌డేట్ చేసింది. ఐదు యాపిల్ ఉత్పత్తులకు అధికారిక హార్డ్‌వేర్ సేవలు, మరమ్మతులు నిలిపేస్తున్నట్లు తెలిపింది. కంపెనీ నిబంధనల ప్రకారం గడువు ముగిసిన నేపథ్యంలో ఈమేరకు యాపిల్ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది. అప్‌డేట్ చేసిన జాబితాలో కింది ఉత్పత్తులు ఉన్నాయి.
ఐఫోన్ SE (మొదటి తరం)
12.9 అంగుళాల ఐప్యాడ్ ప్రో (రెండవ తరం)
యాపిల్ వాచ్ సిరీస్ 4 హెర్మెస్ మోడల్స్
యాపిల్ వాచ్ సిరీస్ 4 నైక్ మోడల్స్
బీట్స్ పిల్ 2.0 పోర్టబుల్ స్పీకర్
ఏడేళ్ల గడువు పూర్తి
యాపిల్ అధికారిక పాలసీ ప్రకారం ఒక ఉత్పత్తి ‘ఒబ్సాలీట్’గా పరిగణించాలంటే కంపెనీ దాని అమ్మకాలను నిలిపివేసిన తర్వాత ఏడు సంవత్సరాలు పూర్తి కావాలి. ఈ ఏడేళ్ల గడువు దాటిన తర్వాత యాపిల్, దాని అధీకృత సర్వీస్ ప్రొవైడర్‌లు ఆ ఉత్పత్తులకు అన్ని రకాల హార్డ్‌వేర్ సేవలను పూర్తిగా నిలిపివేస్తారు. అంటే బ్యాటరీ మార్పిడి, మరమ్మతులు, విడి భాగాల లభ్యత ఉండదు. ఐఫోన్ SE (మొదటి తరం) సెప్టెంబర్ 2018లో అమ్మకాలు నిలిచిపోయాయి. దీంతో ఇది సరిగ్గా ఏడేళ్ల మార్క్‌ను దాటి ఒబ్సాలీట్ జాబితాలో చేరింది.
వినియోగదారులకు సవాలు
యాపిల్ ఒక ఉత్పత్తిని ముందుగా ‘వింటేజ్’ (అమ్మకాలు ఆపిన 5 ఏళ్ల తర్వాత)గా, ఆపై ఒబ్సాలీట్(7 ఏళ్ల తర్వాత)గా ప్రకటిస్తుంది. వింటేజ్ ఉత్పత్తులు రెండు సంవత్సరాల్లో ఒబ్సాలీట్‌గా మారతాయి. ఐఫోన్ SE వంటి అత్యంత ప్రజాదరణ పొందిన మోడల్ ఈ జాబితాలో చేరడం అనేది ఇప్పటికీ ఆ పరికరాన్ని వాడుతున్న చాలామంది వినియోగదారులకు సమస్యలను సృష్టించవచ్చు. అధికారిక హార్డ్‌వేర్ సేవలు లేకపోవడంతో వారు థర్డ్ పార్టీ రిపేర్ సెంటర్లను ఆశ్రయించవలసి ఉంటుంది లేదా కొత్త మోడల్‌కు అప్‌గ్రేడ్ కావాలి. ఈ నిర్ణయం యాపిల్ తన నూతన ఆవిష్కరణలపై దృష్టి పెట్టడానికి, పాత సాంకేతికతకు మద్దతు ఇవ్వడాన్ని తగ్గించుకోవడానికి చేసిన ప్రయత్నంగా కనిపిస్తుంది.
ఇదీ చదవండి: రాయికి రంగేసి రూ.5 వేలకు అమ్మాడు.. కానీ..


