యుద్ధ తంత్రాలు మారుతున్నాయి. సైనిక వ్యూహాలకు టెక్నాలజీ ఆయుధంగా మారుతున్న ప్రస్తుత రోజుల్లో భవిష్యత్ యుద్ధాలు కేవలం మానవుల మధ్య మాత్రమే కాకుండా, రోబోల దండుతో ‘మెటల్ వర్సెస్ ఫ్లెష్’ (యంత్రాలు vs మనుషులు) జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ ఊహాగానాలను నిజం చేస్తూ వాస్తవాధీన రేఖ (ఎల్‌ఏసీ) సమీపంలో చైనాకు చెందిన ‘స్పై రోబోట్’ను భారత దళాలు గుర్తించాయని పేర్కొంటూ ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
చైనా-భారత్ సరిహద్దు వంటి ప్రపంచంలోని అత్యంత సున్నితమైన ప్రాంతంలో రోబోటిక్ నిఘా గురించిన ఆందోళనలను పెంచుతూ ఈ వీడియో సంచలనం సృష్టించింది. చాలా దేశాలు ఇప్పటికే తమ సైనిక వ్యూహాల్లో కృత్రిమ మేధ(ఏఐ), డ్రోన్‌లు, ఆటోనమస్ వెహికల్స్‌ను విరివిగా ఉపయోగిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ ఘటన భవిష్యత్ పోరుకు ఒక సంకేతంగా నిలుస్తోందని రక్షణ రంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
వైరల్ క్లిప్‌లో ఏముంది?
ఎత్తైన ప్రాంతంలో షూట్ చేసిన ఈ వైరల్ క్లిప్‌లో చైనా-భారత్ సరిహద్దు జోన్‌లో ఒంటరిగా నిలబడి ఉన్న హ్యూమనాయిడ్ రోబో లాంటి ఆకారాన్ని చూడవచ్చు. ఇది చైనా సరిహద్దు భద్రతలో భాగమని కొందరు చెబుతున్నారు. ఈ వీడియో చూసిన చాలా మంది ఇదో ఫంక్షనల్ రోబోట్ అని, భారత దళాల కదలికలను ట్రాక్ చేస్తుందని పేర్కొన్నారు. అయితే దీనిపై స్పష్టమైన వివరాలు వెల్లడి కావాల్సి ఉంది.
India🇮🇳 just filmed this: Chinese🇨🇳 humanoid killer robots now patrolling the border. The age of flesh-vs-metal war begins.
Who still wants to send sons to the frontline in 2030? https://t.co/zM3Gy7mYJ9 pic.twitter.com/UAB5L4N6gp— PLA_Overwhelm (@junshiguancha) December 2, 2025
సోషల్ మీడియా స్పందన
ఎక్స్ (గతంలో ట్విట్టర్) వేదికగా ఈ వీడియోకు లక్షలాది వ్యూస్, లైక్‌లు, వేల సంఖ్యలో రీపోస్ట్ చేశారు. కొందరు నెటిజన్లు ఈ వీడియోపై సరదాగా స్పందిస్తూ ‘టెర్మినేటర్ 1.0 చైనా సరిహద్దుకు వచ్చేసింది’ అని, మరికొందరు ‘మోదీగారు చిట్టి 2.0 పంపండి’ అని కామెంట్లు చేశారు.
చైనా వ్యూహంలో రోబోటిక్ విప్లవం
ఈ క్లిప్ ఇంతగా వైరల్ అయ్యేందుకు ప్రధాన కారణం అధునాతన సైనిక సాంకేతిక పరిజ్ఞానం. ముఖ్యంగా కృత్రిమ మేధ (ఏఐ), స్వయంప్రతిపత్తి కలిగిన నిఘా సాధనాల వాడకం, హ్యూమనాయిడ్ రోబోటిక్స్‌లో చైనా వేగవంతంగా పురోగతి చెందుంతుండడంతో రోబో నిఘా వ్యవస్థపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
దేశ సరిహద్దుల్లో మానవ గస్తీని తగ్గించి అక్కడ పర్యవేక్షణను పెంచడానికి చైనా ఈ పద్ధతులను ఉపయోగిస్తున్నట్లు తెలుస్తుంది. చైనా ఇప్పటికే టిబెట్‌లో రోబో డాగ్‌లతో పరీక్షలు నిర్వహిస్తున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. చైనా, తైవాన్ సరిహద్దు సమీపంలో కూడా రోబోటిక్ సైనికులను మోహరించాలని యోచిస్తున్నట్లు వెల్లడైంది. ఇది భారత్-చైనా సరిహద్దులో కూడా ఇలాంటివి వచ్చే అవకాశంపై ఆందోళన కలిగిస్తోంది.
ఇదీ చదవండి: గూగుల్ ట్రెండ్స్‌లో టాప్‌లో నీతా అంబానీ..


