ఉద్యోగులకు యాజమాన్యాలు బహుమతులు ఇవ్వడం కార్పొరేట్ రంగంలో సర్వసాధారణం. మంచి పనితీరు ప్రదర్శించిన ఉద్యోగులను వివిధ రకాల కానుకలిచ్చి ప్రోత్సహిస్తుంటాయి కంపెనీలు. అయితే చైనాలో ఓ కంపెనీ తమ ఉద్యోగులకు ఇచ్చిన బహుమతులు అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాయి. ఇంతకీ ఆ కంపెనీ ఏం కానుకలు ఇచ్చింది.. ఆశ్చర్యం ఎందుకు అన్నది మనమూ చూద్దామా..
ప్రపంచవ్యాప్తంగా కన్స్యూమర్ 360 డిగ్రీల కెమెరాలకు ప్రసిద్ధి చెందిన ‘ఇన్స్టా 360’ అనే సంస్థ ఇటీవల అక్టోబర్ 24న చైనాలో ప్రోగ్రామర్స్ డేను పురస్కరించుకుని ఉద్యోగులకు వినూత్న బహుమతులు ప్రదానం చేసింది. కంప్యూటర్ కీ బోర్డులో అమర్చుకునేలా స్వచ్ఛమైన బంగారంతో చేసిన కీక్యాప్స్ను కానుకలుగా ఇచ్చింది.
కంపెనీ ఈ సంవత్సరం 21 గోల్డ్ కీక్యాప్‌లను బహుమతిగా ఇచ్చింది. వీటిలో అత్యంత విలువైనది స్పేస్ బార్ కీ క్యాప్. దీని బరువు 35.02 గ్రాములు కాగా విలువ సుమారు 320,000 యువాన్లు. భారత కరెన్సీలో చెప్పాలంటే దాదాపు రూ. 39 లక్షలు. ఇన్స్టా360 సంస్థ ఉద్యోగులకు గోల్డ్ కీ క్యాప్‌లను బహుమతులుగా ఇవ్వడం ఇదే తొలిసారి కాదు. సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ కథనం ప్రకారం.. కంపెనీ గత నాలుగేళ్లలో మొత్తం 55 గోల్డ్ కీక్యాప్‌లను ప్రదానం చేసింది.
బంగారం లాంటి కంపెనీ
ఇన్స్టా360 ప్రదానం చేస్తున్న కానుకల కారణంగా చైనా టెక్ పరిశ్రమ వర్గాల్లో ఆ కంపెనీకి "గోల్డ్ ఫ్యాక్టరీ" అనే మారుపేరు వచ్చింది. ఈ కంపెనీ ఇలా బంగారు వస్తువులు కానుకలుగా ఇవ్వడం ఏదో ఏడాదికొక్కసారి మాత్రమే అనుకునేరు.. ఇన్స్టా360కి సంబంధించిన ఏ విశేష సందర్భం వచ్చినా ఏదో రూపంలో పసిడి కానుకలు ఇవ్వడమే పరిపాటి.
కంపెనీ పదేళ్ల వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని గత జూలైలో ఉద్యోగులు, ఇంటర్న్లందరికీ "గోల్డ్ బ్లైండ్ బాక్స్" ను అందించింది. ఇందులో 0.36 గ్రాముల స్వచ్ఛమైన బంగారుతో రూపొందించిన స్టిక్కర్లున్నాయి. ఇక కంపెనీలో ఉద్యోగులెవరైనా కొత్తగా వివాహం చేసుకున్నా లేదా పిల్లలకు జన్మనిచ్చినా వాళ్లకు ఒక గ్రాము స్వచ్ఛమైన బంగారు నాణెం బహూకరిస్తారు. ఇటీవలి సంవత్సరం ముగింపు వేడుకలో 50 గ్రాముల బంగారు బార్ను గ్రాండ్ ప్రైజ్గా అందించడం విశేషం.
బంగారాన్నే ఉద్యోగులకు కానుకగా ఇవ్వడం వెనుక ఉద్దేశాన్ని ఇన్స్టా360 వ్యవస్థాపకుడు లియు జింగ్కాంగ్ వివరించారు. సంస్థ బంగారాన్ని దాని నగదు విలువ కోసం కాకుండా దాని "స్థిరత్వం" కోసం ఎంచుకుంటుందని పేర్కొన్నారు. ఒక సంస్థ స్థిరత్వం ప్రతిభావంతులైన వ్యక్తులపై ఆధారపడి ఉంటుందని ఆయన నొక్కిచెప్పారు. ప్రతి కీస్ట్రోక్ "రాయిని బంగారంగా మార్చే స్పర్శ" అని గోల్డ్ కీక్యాప్స్ రిమైండర్గా పనిచేస్తాయని అన్నారు.
ఇదీ చదవండి: బంగారం ‘కొండంత’ లక్ష్యంతో కొంటున్నా: కియోసాకి


