ఢిల్లీలో ధర @ 1,40,850
ఒకేరోజు రూ.2,650 పెరుగుదల
ఈ ఏడాది 78 శాతం ర్యాలీ
రూ.2.17 లక్షలకు చేరిన వెండి
న్యూఢిల్లీ: పసిడి, వెండి రికార్డు ర్యాలీలు కొనసాగుతున్నాయి. ఢిల్లీలో మార్కెట్లో 99.9 శాతం స్వచ్ఛత బంగారం ధరల్లో సరికొత్త రికార్డు నమోదైంది. మంగళవారం 10 గ్రాములకు రూ.2,650 పెరిగి రూ.1,40,850కు చేరుకుంది. దీంతో ఈ ఏడాదిలో ఇప్పటి వరకు బంగారం ధర 78 శాతం పెరిగినట్టయింది. 2024 డిసెంబర్ 31న ఉన్న రూ.78,950 నుంచి నికరంగా రూ.61,900 వరకు 10 గ్రాములకు పెరిగింది. ఢిల్లీ మార్కెట్లో వెండి ధర కిలోకి మరో రూ.2,750 పెరగడంతో సరికొత్త రికార్డు రూ.2,17,250 నమోదైంది. వెండి ధర ఈ ఏడాది ఏకంగా 142 శాతం పెరగడం గమనార్హం. 2024 డిసెంబర్ 31న కిలో ధర రూ.89,700 వద్ద ఉండగా, అక్కడి నుంచి నికరంగా రూ.1,27,550 లాభపడింది.
మరోవైపు అంతర్జాతీయ మార్కెట్లో స్పాట్ వెండి ధర ఔన్స్‌కు 1.4 శాతం పెరిగి 70 డాలర్ల మార్క్‌ను మొదటిసారి చేరుకుంది. బులియన్‌లో అసాధారణ ర్యాలీ కొనసాగుతోందని, అంతర్జాతీయంగా బంగారం ధర ఔన్స్‌కు 4,500 మార్క్‌ను చేరుకున్నట్టు హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్ కమోడిటీ విభాగం సీనియర్ అనలిస్ట్ సౌమిల్ గాంధీ తెలిపారు. యూఎస్ ఫెడ్ 2026లో ఒకటికి మించిన రేట్ల కోతను చేపట్టొచ్చన్న అంచనాలు తాజాగా మరో విడత పసిడి, వెండి ధరల్లో ర్యాలీకి కారణమవుతున్నట్టు చెప్పారు. దీనికితోడు భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలతో సురక్షిత సాధనంగా డిమాండ్ సైతం కొనసాగుతున్నట్టు తెలిపారు. అంతర్జాతీయంగా పసిడి స్పాట్ ధర ఔన్స్‌కు ఈ ఏడాది 18,92 డాలర్ల నుంచి 4,500 డాలర్లకు చేరుకోవడం గమనార్హం


