వాషింగ్టన్:ప్రపంచంలోనే అతిపెద్ద దీవి గ్రీన్‌లాండ్‌పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి కన్నేశారు. అపారమైన ఖనిజ సంపద, ఆర్కిటిక్ ప్రాంతంలో ఉన్న వ్యూహాత్మక ప్రాధాన్యం కారణంగా ఆయన తాజాగా ప్రత్యేక ప్రతినిధిని నియమిస్తూ అమెరికా దౌత్య ప్రయత్నాలను పునరుద్ధరించారు.
గ్రీన్‌లాండ్‌లోని లిథియం, రాగి వంటి ఖనిజ సంపదను సొంతం చేసుకోవాలన్న అమెరికా ప్రయత్నాలు ఎప్పట్నుంచో సాగుతున్నాయి. 55–57 వేల మంది జనాభా ఉన్న ఈ దీవి, ఖనిజ సంపదతో పాటు భౌగోళికంగా కూడా కీలకంగా మారింది. 2016లో అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ట్రంప్ గ్రీన్‌లాండ్‌ను అమెరికాలో కలపాలని ప్రయత్నాలు చేశారు. ‘గ్రీన్‌లాండ్‌ను మాకు ఇచ్చేయండి, 800 కోట్లు విలువ చేసే బంగారం ఇస్తాం’ అని ప్రతిపాదనలు పెట్టినా డెన్మార్క్ తిరస్కరించింది.
అక్కడి ప్రజలు తమ ప్రాంతాన్ని అమెరికాలో కలపాలని కోరుకుంటున్నారని, డెన్మార్క్ వైఖరి వారికి నచ్చడం లేదని పలు మార్లు మీడియా ఎదుట వ్యాఖ్యానించారు. ఇప్పుడు మళ్లీ ట్రంప్ గ్రీన్‌లాండ్‌పై దృష్టి సారించారు. ప్రత్యేక ప్రతినిధి నియామకం ద్వారా వాణిజ్య, భద్రతా, వ్యూహాత్మక అంశాలను బలపరచాలని సంకేతం ఇచ్చారు.
గ్రీన్‌లాండ్ స్వయం ప్రతిపత్తి ఉన్నప్పటికీ, డెన్మార్క్‌తో అనుబంధం కొనసాగుతోంది. దీనిపై డెన్మార్క్ నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అయితే ట్రంప్ మాత్రం ‘ఖనిజ సంపద కోసం కాదు, అమెరికా జాతీయ భద్రత కోసం ఈ నిర్ణయం’ అని స్పష్టం చేశారు. ఈ నియామకం అమెరికా ఆర్కిటిక్ వ్యూహానికి కొత్త దిశను చూపిస్తోంది.


